Nalgonda | తెలంగాణ తల్లి విగ్రహానికి కంచర్ల ఫ్లెక్సీ.. విమర్శల వెల్లువ! ఆపై దిద్దుబాటు

Nalgonda | విధాత: జిల్లా కేంద్రం నల్గొండలో తెలంగాణ తల్లి విగ్రహానికి అడ్డుగా సిటింగ్ బీఆరెస్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి జన్మదినం ఫ్లెక్సి ఏర్పాటు చేయడం విమర్శల పాలైంది. అనుచరులు చేసిన అతి చేష్టతో తెలంగాణ ఉద్యమకారుల నుంచి కంచర్ల విమర్శలను ఎదుర్కొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం కనిపించకుండా కంచర్ల ఫ్లెక్సీ ఏర్పాటు చేయడాన్ని ఉద్యమకారులు తప్పుపట్టారు. సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు. ప్లెక్సీ చోద్యాన్ని చూసిన ఆ దారి వెంట వెళ్లేవారు సైతం ఇదెక్కడి […]

Nalgonda | తెలంగాణ తల్లి విగ్రహానికి కంచర్ల ఫ్లెక్సీ.. విమర్శల వెల్లువ! ఆపై దిద్దుబాటు

Nalgonda |

విధాత: జిల్లా కేంద్రం నల్గొండలో తెలంగాణ తల్లి విగ్రహానికి అడ్డుగా సిటింగ్ బీఆరెస్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి జన్మదినం ఫ్లెక్సి ఏర్పాటు చేయడం విమర్శల పాలైంది. అనుచరులు చేసిన అతి చేష్టతో తెలంగాణ ఉద్యమకారుల నుంచి కంచర్ల విమర్శలను ఎదుర్కొన్నారు.

తెలంగాణ తల్లి విగ్రహం కనిపించకుండా కంచర్ల ఫ్లెక్సీ ఏర్పాటు చేయడాన్ని ఉద్యమకారులు తప్పుపట్టారు. సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు. ప్లెక్సీ చోద్యాన్ని చూసిన ఆ దారి వెంట వెళ్లేవారు సైతం ఇదెక్కడి పద్ధతి అంటూ ముక్కున వేలేసుకున్నారు.

అసలే తెలంగాణ ఉద్యమ కాలంలో టీడీపీలో ఉన్న కంచర్ల 2018 ఎన్నికలకు ముందు బీఆరెస్ లో చేరారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో పార్టీ శ్రేణులు, తెలంగాణవాదులు ఆయనను గెలిపించుకున్నారు. ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచాక కంచర్ల తెలంగాణ ఉద్యమకారులను, బిఆరెస్ లో మొదటి నుంచి పని చేసిన వారిని చిన్నచూపు చూశారన్న అసంతృప్తి చోటు చేసుకుంది.

చకిలం అనిల్ కుమార్ పార్టీ నుంచి బయటికి వెళ్లిపోగా, పిల్లి రామరాజు వంటి అనుచరులు రెబల్ గా మారి వచ్చే ఎన్నికల్లో కంచర్లపై పోటీకి సిద్ధమయ్యారు. టికెట్ ఆశించి భంగగపడిన చాడా కిషన్ రెడ్డి కంచర్లకు వైరి వర్గంగా ఉన్నారు.

ఈ పరిస్థితుల్లో తెలంగాణ తల్లిని చిన్నబుచ్చేలా కంచర్ల అనుచరులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ అతిచేష్ట ఆయనను మరింత డామేజ్ చేసేలా ఉందంటూ సొంత పార్టీ శ్రేణులు సైతం ఆవేదన వ్యక్తం చేశాయి.

బీఆరెస్ అధిష్టానం సిటింగ్ ఎమ్మెల్యేగా మరోసారి కంచర్లకే టికెట్ ఇవ్వడంతో గెలుపు కోసం మరింత జాగ్రత్తగా పని చేయాల్సింది పోయి ఈ తరహా పనులతో ఆభాసు పాలు కావడం ఏమిటంటూ పార్టీ వర్గాలు అసహనం వ్యక్తం చేశాయి.

ఫ్లెక్సీ వ్యవహారంపై రేగిన వివాదం పట్ల స్పందించిన ఎమ్మెల్యే వర్గీయులు వెంటనే దిద్దుబాట చర్యలు చేపట్టారు. ఇదే రోజు మధ్యాహ్నం కల్లా ఫ్లెక్సీని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నుండి పక్కకు జరిపి ఏర్పాటు చేయించడం గమనార్హం. ఇదంతా అడుసు తొక్క నేల.. కాళ్లు కడగనేలా అన్నట్లుగా ఉందంటూ తెలంగాణ వాదులు చెవులు కొరుక్కున్నారు.