చంద్రబాబు స్క్రిప్టునే రేవంత్ రెడ్డి చదివాడు: మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం బనకచర్ల కుట్రకు అనుకూలంగానే ఉందని..ఏపీ సీఎం చంద్రబాబు స్క్రిప్టునే రేవంత్ రెడ్డి చదివాడని మాజీ మంత్రి జీ.జగదీష్ రెడ్డి మండిపడ్డారు

చంద్రబాబు స్క్రిప్టునే రేవంత్ రెడ్డి చదివాడు: మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

విధాత, నల్లగొండ: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం బనకచర్ల కుట్రకు అనుకూలంగానే ఉందని..ఏపీ సీఎం చంద్రబాబు స్క్రిప్టునే రేవంత్ రెడ్డి చదివాడని మాజీ మంత్రి జీ.జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ప్రస్తుతం గోదావరిలో చుక్క నీళ్లు కూడా లేవని..అలాంటప్పుడు మిగులు జలాల సమస్యే లేదని..గోదావరికి సంబంధించి కొత్త ట్రిబ్యూనల్ ఎన్ని నీళ్లున్నాయో తేల్చాకే ఏపీ కొత్త ప్రాజెక్టుల కట్టాలని..ఇప్పుడున్న గోదావరి నీళ్లపై మరో ప్రాజెక్ట్ కట్టడానికి వీళ్లేదని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. బనకచర్ల ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించాల్సిందేనన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో ఏపీ సీఎం చంద్రబాబు తాము మిగులు జలాలతో బనకచర్ల కడితే అభ్యంతరమేంటని మాట్లాడగా..సీఎం రేవంత్ రెడ్డి గోదావరి లో నీళ్లు లేవని చెప్పకుండా..కాళేశ్వరం లేదని చెప్పడం అంటే కేవలం బనకచర్లకు మద్దతు ప్రకటించడమేని ఆరోపించారు. చంద్రబాబు మాటలకు తాళం వేయడమేనని విమర్శించారు. కాళేశ్వరం నుంచి 240 టీఎంసీలకు పైగా నీళ్లను వాడుతున్నామని రేవంత్ రెడ్డి చెప్పలేదంటే బనకచర్లకు అనుమతిస్తున్నట్లే అని స్పష్టమవుతుందని ఆరోపించారు. బనకచర్ల కట్టి తీరుతామన్న చంద్రబాబుకు అనుకూలంగానే కాళేశ్వరంలో మాకు నీళ్లు అవసరం లేదు అన్నట్లు రేవంత్ రెడ్డి మాటలు ఉన్నాయన్నారు. ఇది ముమ్మాటికి తెలంగాణ ప్రజలకు మోసం చేయడమేనన్నారు. బనకచర్లకు అనుమతులు రావాలంటే కాళేశ్వరంను రికార్డులలో నుంచి మాయం చేయాలనే కుట్ర చేస్తున్నారని..చంద్రబాబు కుట్రలో భాగంగానే ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారన్నారు.

పంప్ లు నడిపిస్తారు..కాళేశ్వరం లేదంటారు

కాళేశ్వరంపై ఉన్న నంది మేడారం, కన్నేపల్లి గాయత్రి పంప్ హౌస్ లను ప్రారంభించినారంటేనే కాళేశ్వరం ప్రాజెక్టు అంతా బాగున్నట్లేనని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. ఓవైపు కాళేశ్వరం పంప్ లు నడిపిస్తూ మరోవైపు కాళేశ్వరం లేదంటూ కాంగ్రెస్ ద్వంద్వ విధానాలు అనుసరిస్తుందన్నారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ చెప్పిందంతా అబద్దం అని రుజువైందన్నారు. కాళేశ్వరం ద్వారా గత ఎనిమిది పంటలకు నీళ్లు ఇచ్చినట్లుగానే ఈ ప్రభుత్వం ఆయకట్టు ప్రాంతాలకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లాకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దేవాదుల నుంచి నీళ్లు ఇస్తామంటూ కొత్త పాట అందుకున్నారని..దేవాదుల నీళ్లు ఇస్తామన్న ప్రాంతానికే ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. ఎస్సారెస్పీ 40 ఏళ్లు గడిచినా మొత్తం ఆయకట్టుకు ఇప్పటివరకు నీళ్లు ఇవ్వలేదని..దేవాదుల ప్రాజెక్టు ద్వారా నీళ్లు తెస్తామనేది ఒక మోసం అని జగదీష్ రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నేపల్లి పంపు హౌస్ ను ప్రారంభించి ఈ ప్రాంత రైతాంగానికి నీళ్లు ఇవ్వాలన్నదే మా డిమాండ్ అని స్పష్టం చేశారు. నందిమేడారం పంపు ఆన్ చేస్తే మిడ్ మానేరుకు నీళ్ళొచ్చినాయని…అట్లానే మిగతా పంపులు ఆన్ చేస్తే సూర్యాపేటకు కూడా నీళ్లు వస్తాయన్నారు. మీరు ప్రారంభించిన పంప్ హౌస్ లన్ని కాళేశ్వరంలో భాగమేనని..నాలుగేళ్లుగా సూర్యాపేటకు వచ్చింది కాళేశ్వరం జలాలేనని స్పష్టం చేశారు. ఇప్పుడొచ్చే నీళ్లకు ఏ పేరు పెట్టినా పర్వాలేదు.. కానీ ఒక ఎకరం ఎండిపోకుండా నీళ్లు ఇచ్చి ఈ జిల్లా రైతుల పంటలను కాపాడాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. వ్యవసాయ మోటార్లకు బీఆర్ఎస్ ఇచ్చిన పద్ధతుల్లోనే నిరంతరం విద్యుత్ తో పాటు సరిపడా నీళ్లందించాలని కోరారు.