Telangana Assembly Budget | ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు … తొలి రోజు లాస్య నందితకు సంతాపం

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. సమావేశాల తొలి రోజున కంటోన్మెంట్ బీఆరెస్‌ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి ప‌ట్ల శాస‌న‌స‌భ సంతాపం ప్ర‌క‌టించింది.

Telangana Assembly Budget | ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు … తొలి రోజు లాస్య నందితకు సంతాపం

విధాత, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. సమావేశాల తొలి రోజున కంటోన్మెంట్ బీఆరెస్‌ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి ప‌ట్ల శాస‌న‌స‌భ సంతాపం ప్ర‌క‌టించింది. ఆమె మృతికి సంతాపంగా స‌భ్యులంద‌రూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంత‌రం స‌భ‌ను బుధ‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు వాయిదా వేస్తున్న‌ట్లు స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ ప్ర‌క‌టించారు. స‌భ ఉద‌యం 11 గంట‌ల‌కు ప్రారంభం కాగా, లాస్య నందిత మృతిప‌ట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాప తీర్మానం ప్ర‌వేశ‌పెట్టారు. ఈ సంద‌ర్భంగా లాస్య నందిత సేవ‌ల‌ను, ఆమె తండ్రి సాయ‌న్న సేవ‌ల‌ను రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఇలాంటి బాధకరమైన సంతాప తీర్మానం ప్రవేశపట్టాల్సివచ్చినందుకు చింతిస్తున్నానన్నారు. అనంత‌రం శాస‌న‌స‌భా వ్య‌వ‌హారాల మంత్రి శ్రీధ‌ర్ బాబు, ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్, ఎమ్మెల్యేలు కేటీఆర్, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, సునీతా ల‌క్ష్మారెడ్డి, ముఠా గోపాల్, రాజశేఖ‌ర్ రెడ్డి, కేపీ వివేకానంద్ గౌడ్, కూనంనేని సాంబ‌శివ‌రావు, ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి, పాయ‌ల్ శంక‌ర్, మ‌క్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, శ్రీ గ‌ణేశ్.. లాస్య నందిత మృతిప‌ట్ల సంతాపం ప్ర‌క‌టిస్తూ సీఎం రేవంత్ తీర్మానాన్ని బ‌ల‌పరిచారు.

అమరువీరుల స్థూపం వద్ధ బీఆరెస్ ఎమ్మెల్యేల నివాళులు..

అంతకుముందు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గ‌న్ పార్కు వ‌ద్ద తెలంగాణ అమ‌రవీరుల స్థూపానికి బీఆరెస్‌ ఎమ్మెల్యేలు పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. జై తెలంగాణ‌, జోహ‌ర్ తెలంగాణ అమ‌ర‌వీరుల‌కు జోహార్.. జోహార్.. అంటూ నినదించారు. కేసీఆర్ నాయ‌క‌త్వం వ‌ర్ధిల్లాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంత‌రం గ‌న్ పార్కు నుంచి అసెంబ్లీలోకి బీఆరెస్ ఎమ్మెల్యేలంద‌రూ న‌డుచుకుంటూ వెళ్లారు. అమ‌ర‌వీరుల‌కు నివాళుల‌ర్పించిన వారిలో కేటీఆర్, హ‌రీశ్‌రావు, జ‌గ‌దీశ్ రెడ్డి, ప్ర‌శాంత్ రెడ్డి, స‌బితా ఇంద్రారెడ్డి, సునీతా ల‌క్ష్మారెడ్డి, కోవా ల‌క్ష్మి, పాడి కౌశిక్ రెడ్డి, ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి, డాక్ట‌ర్ క‌ల్వ‌కుంట్ల సంజ‌య్, ముఠా గోపాల్, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, కేపీ వివేకానంద్ గౌడ్, కాలేరు వెంక‌టేశ్, గంగుల క‌మ‌లాక‌ర్, మాగంటి గోపీనాథ్, మాధ‌వ‌రం కృష్ణారావు, మ‌ర్రి రాజశేఖ‌ర్ రెడ్డి, అనిల్ జాద‌వ్, మ‌ల్లారెడ్డి, చింతా ప్ర‌భాక‌ర్‌తో పాటు త‌దిత‌రులు ఉన్నారు.

అంబేద్కర్ విగ్రహం వద్ధ బీజేపీ ఎమ్మెల్యేల నిరసన

బీజేపీ ఎమ్మెల్యేలు ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ధ రైతు రుణమాఫీ అంశంపై ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందంటూ నిరసన తెలిపి అసెంబ్లీకి బయలు దేరారు. బీజేపీ ఎమ్మెల్యేలు రైతులకు మద్ధతుగా ధోతీలు ధరించి, ఫ్లకార్డు పట్టుకుని ఈ నిరసనలో పాల్గొన్నారు. ఆంక్షలు లేకుండా రైతులందరికి 2లక్షల రుణ మాఫీ చేయాలని నినాదాలు చేశారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతి పత్రం అందించారు.