కోట్లు దోచుకున్న దొంగ కేసీఆర్: టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి

కోట్లు దోచుకున్న దొంగ కేసీఆర్: టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి
  • అవినీతి వ‌ల్లే బ‌రాజ్ కుంగింది
  • ఆదిలాబాద్‌లో కాంగ్రెస్‌దే గెలుపు
  • జిల్లాకు ఇచ్చిన హామీల‌పై ప్ర‌శ్న‌లు

విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: ఆంధ్రా కాంట్రాక్టర్లకు నిధులు అప్పజెప్తే మేడిగడ్డ బ‌రాజ్‌ కుప్పకూలిపోయింద‌ని టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి ధ్వ‌జ‌మెత్తారు. అవినీతి కార‌ణంగానే అన్నారం బ‌రాజ్‌ పగిలిపోయింద‌న్నారు. కోట్ల రూపాయలు దోచుకున్న దొంగ కేసీఆర్ అంటూ ఫైర్ అయ్యారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలోని డైట్ క‌ళాశాల మైదానంలో బుధవారం నిర్వ‌హించిన విజ‌య‌భేరి బ‌హిరంగ స‌భ‌కు ఆయ‌న ముఖ్య అతిథిగా హాజ‌రయ్యారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. స‌భ‌కు వ‌చ్చిన‌ జనాల్ని చూస్తే ఆదిలాబాద్‌లో కంది శ్రీనివాసరెడ్డి భారీ మెజారిటీతో గెలవడం ఖాయంగా కనిపిస్తున్నదని చెప్పారు. ఆదిలాబాద్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగురుతుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. సీఎం కేసీఆర్‌, ఎమ్మెల్యే జోగు రామ‌న్న‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుప‌డ్డారు.


జోగు రామన్న నీతివంతుడైతే మంత్రి పదవి నుండి ఎందుకు తొలగించార‌ని ప్ర‌శ్నించారు. నిరుద్యోగ యువతకు న్యాయం జరగాలని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింద‌న్నారు. కానీ కేసీఆర్ కుటుంబీకుల‌కు ఉద్యోగాలు వచ్చాయ‌ని అన్నారు. అడ‌వుల జిల్లా ఆదిలాబాద్‌కు ఎందుకు యూనివర్సిటీ ఇవ్వలేద‌ని ప్ర‌శ్నించారు. కేజీ టూ పీజీ ఉచిత నిర్బంధ విద్య‌ ఎక్కడ పోయింద‌న్నారు. 10 ఏళ్ల‌యినా ఆదిలాబాద్‌కు గిరిజన యూనివర్సిటీ రాలేద‌న్నారు. తెలంగాణలో 1200 మంది విద్యార్థులు ఆత్మబలిదానం చేసుకున్నార‌న్నారు. ఇవాళ జోగు రామన్న కాకపోతే.. జోకుడు రామన్న వస్తాడ‌న్నారు. వీరందరికీ బ్రహ్మరాక్షసుడు కేసీఆర్ అంటూ ఘాటుగా విమ‌ర్శించారు. పిల్ల రాక్షసులను ఆదిలాబాద్‌ మీదకు తోలాడని చ‌మ‌త్క‌రించారు. రాక్షసున్ని గద్దె దించాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలన్నారు. ప్ర‌స్తుతం దొరల తెలంగాణకు.. ప్రజల తెలంగాణకు యుద్ధం జరుగుతోంద‌ని పేర్కొన్నారు.

ఇదీ కాంగ్రెస్ పార్టీ కుటుంబం: కంది శ్రీ‌నివాస‌రెడ్డి

కాంగ్రెస్‌ ఎక్కడ‌ని అహంకారంతో ప్ర‌శ్నిస్తున్న‌వాళ్లు.. త‌మ స‌భ‌కు వేలాదిగా త‌ర‌లివ‌చ్చిన ప్ర‌జ‌ల‌ను చూడాల‌ని, కాంగ్రెస్ పార్టీ కుటుంబం క‌న్పిస్తుంద‌ని ఆదిలాబాద్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి కంది శ్రీ‌నివాస‌రెడ్డి అన్నారు. తెలంగాణ‌కు కాబోయే ముఖ్యమంత్రి, పులిబిడ్డ రేవంతన్న వచ్చార‌న్నారు. ఈ జ‌నాల‌ను చూసిన త‌ర్వాత జోగు రామన్న, ఆయ‌న‌కు కొడుకుల‌కు తడిసిపోతుంద‌ని ఎద్దేవా చేశారు. జోగు రామన్న ఏ ఊరికెళ్లినా జనం తిరగబడుతున్నార‌ని, ఆయ‌న ఓడిపోతే పోచమ్మకు బోనమెత్తడానికి మా సోదరీమణులంద‌రూ సిద్ధంగా ఉన్నార‌ని అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉండ‌గా 35 వేల ఇంటి స్థలాలు, 45 వేల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామ‌న్నారు. జోగు రామన్న‌కు ద‌మ్ముంటే ఇందిరమ్మ ఇళ్లున్న‌ ఊర్లలో ఓట్లడగ‌వ‌ద్ద‌ని, అదే డబుల్ బెడ్రూం ఉన్న ఊళ్ల‌లో మేం ఓట్లడగ‌బోమ‌న్నారు.


ఈ స‌వాల్‌కు సిద్ధ‌మా? అంటూ ప్ర‌శ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఆరు గ్యారంటీ హామీల‌ను ఆరునూరైనా అమ‌లు చేసి తీరుతామ‌న్నారు. రేవంత‌న్న స‌హ‌కారంతో వెనుక‌బ‌డ్డ ఆదిలాబాద్‌ను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసుకుందామ‌న్నారు. పాయ‌ల శంక‌ర్… జోగు రామ‌న్న ఇంట్లో మ‌నిష‌ని, వారిద్ద‌రిలో ఎవ‌రికి ఓటేసినా మ‌ళ్లీ ఐదేళ్లు క‌ష్టాలు త‌ప్ప‌వ‌ని హిత‌వు ప‌లికారు. పేద‌ల బ‌తుకుల్లో వెలుగులు నిండాలంటే మ‌ళ్లీ కాంగ్రెస్ పార్టీనే గెలిపించాల‌ని, చేతి గుర్తుకే ఓటేసి త‌న‌ను ఆశీర్వ‌దించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో త‌ల‌మ‌డుగు జ‌డ్పీటీసీ గోక గ‌ణేష్‌రెడ్డి, డీసీసీబీ డైరెక్ట‌ర్ బాలూరి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ ముడుపు దామోద‌ర్‌రెడ్డి, మున్సిప‌ల్ మాజీ చైర్మన్ దిగంబ‌ర్‌రావు పాటిల్, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భూపెల్లి శ్రీధర్, ఎస్టీ సెల్ చైర్మన్ షెడ్మ‌కి ఆనంద్‌రావు, ఎన్ఎస్‌యూఐ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ రంగినేని శాంతన్ రావు, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్య‌క్ష‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు చ‌ర‌ణ్‌గౌడ్‌, సామ రూపేష్‌రెడ్డి, సీపీఐ జిల్లా కార్య‌ద‌ర్శి ముడుపు ప్ర‌భాక‌ర్‌రెడ్డి, మాజీ స‌ర్పంచ్ పూసం ప్రభాకర్, సుజాత అలీ, కందుల సుకేందర్, సాహిద్ ఖాన్, లత, షకీల్, కొండూరి రవి,షేక్ మన్సూర్, బోనం మల్లయ్య, బూర్ల శంకర్, అన్నెల శంకర్, అల్లూరి అశోక్ రెడ్డి, కిష్టారెడ్డి, ముఖీమ్, అంజద్ ఖాన్, కర్మ, అస్బాత్ ఖాన్, భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.