BRS | కేసీఆర్ మార్క్ ఎలక్షన్ స్కెచ్? ఆ ఇద్దరు సిట్టింగులకు ఇక చెక్ ?

BRS | ముత్తిరెడ్డి, రాజయ్య ఆశ గల్లంతు నలువైపులా ఆ ఇద్దరూ దిగ్బంధం అంతా అధిష్టానం కనుసన్నల్లోనే.. మౌనం వెనుక మాస్టర్ ప్లాన్ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: మూడో పర్యాయం రాష్ర్టంలో అధికారాన్ని కారెక్కించాలనుకుంటున్న బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తనదైన మార్క్ ఎన్నికల స్కెచ్ అమలు చేస్తున్నారని తాజా పరిణామాలు రుజువు చేస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వేదికగా తన పక్కా ప్రణాళికను అమలు చేస్తున్నారు. ప్రస్తుతం జనగామ, స్టేషన్ ఘన్ పూర్ అసెంబ్లీ […]

  • Publish Date - August 19, 2023 / 03:06 PM IST

BRS |

  • ముత్తిరెడ్డి, రాజయ్య ఆశ గల్లంతు
  • నలువైపులా ఆ ఇద్దరూ దిగ్బంధం
  • అంతా అధిష్టానం కనుసన్నల్లోనే..
  • మౌనం వెనుక మాస్టర్ ప్లాన్

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: మూడో పర్యాయం రాష్ర్టంలో అధికారాన్ని కారెక్కించాలనుకుంటున్న బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తనదైన మార్క్ ఎన్నికల స్కెచ్ అమలు చేస్తున్నారని తాజా పరిణామాలు రుజువు చేస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వేదికగా తన పక్కా ప్రణాళికను అమలు చేస్తున్నారు. ప్రస్తుతం జనగామ, స్టేషన్ ఘన్ పూర్ అసెంబ్లీ సెగ్మెంట్లలో ఈ పాచికను కేసీఆర్ ప్రయోగించారని భావించాలి.

వచ్చే ఎన్నికల్లో ఏఒక్క స్థానం పైన అప్రమత్తతో, అశ్రద్ధో వహిస్తే అసలుకే ఎసరొస్తుందని ఆయనకు తెలుసు. ఈ విషయంలో అవసరానికి మించిన అనుభవం గడించిన రాజకీయ నేతగా కేసీఆర్ ఆ దిశలో పావులు కదుపుతున్నారు. రానున్న ఎన్నికల్లో తమ పార్టీ క్యాండిడేట్లు మెజార్టీ విజయం సాధిస్తే అధికారంలోకి వస్తామనేది అందరికన్నా ఆయనకే బాగా తెలుసు. ప్రభుత్వ వ్యతిరేకత వేళ్ళూనుకున్న ప్రస్తుత పరిస్థితిలో అదంతా ఆషామాషీ వ్యవహారం కాదనేది తెలుసు.

పాత వ్యూహానికి కేసీఆర్ కొత్త పదును

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 2014, 2018 ఎన్నికల్లో పయనించిన బాటకు మరింత పదునుపెట్టి, రానున్న ఎన్నికలు లక్ష్యంగా పకడ్బందీ ప్రణాళిక అమలు చేస్తున్నారు. కేసీఆర్ కత్తికి రెండు వైపులా పదును ఉGటుందని ఆయనను దగ్గరగా చూసిన వారు చెబుతుంటారు. ఇప్పుడు ఆ కత్తినే జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పై ప్రయోగించారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ విషయం సీనియర్ నాయకులుగా, ఎమ్మెల్యేలుగా వారికీ అర్థమైనా ఆఖరి ప్రయత్నంగా బలప్రదర్శన చేస్తున్నారనిపిస్తోంది. పైగా సాలీడు గూడులో చిక్కినట్లుగా ఈ ఇద్దరి ఎమ్మెల్యేల పరిస్థితి మారిందని అంటున్నారు. అదే కేసీఆర్ రాజకీయ వ్యూహంగా భావిస్తున్నారు. నలుదిశలా దిగ్బంధనం చేసి తన రాజకీయ అవసరాన్ని సాధించడంలో దిట్టగా అభివర్ణిస్తున్నారు.

2014లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 స్థానాలకుగానూ టీఆర్ఎస్ కేవలం 8 స్థానాల్లో విజయం సాధించింది. టీడీపీ నుంచి ఎర్రబెల్లి, చల్లాను, కాంగ్రెస్ నుంచి రెడ్యానాయక్ ను తమ పార్టీలో చేర్చుకున్నారు. ఇదిలా ఉండగా తెలంగాణ ఉద్యమకాలంలో బద్ధ వ్యతిరేకిగా నిలిచిన కొండా సురేఖకు వరంగల్ తూర్పు నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వడం, కొండా మురళికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడం అప్పట్లో సంచనలంగా మారింది.

కేసీఆర్ రాజకీయ ప్రాబల్యం కోసం ఎంతకైనా సిద్ధమవుతారని చాటిచెప్పారు. అదే 2018 ఎన్నికల్లో కొండా దంపతులకు పొమ్మనకుండా పొగపెట్టారు. ఇప్పుడు జనగామ, స్టేషన్ ఘన్ పూర్ లలో జరుగుతోందంటున్నారు. ఈ జాబితాలో ఇంకెంతమంది ఉన్నారో త్వరలో తేలనున్నది.

గెలుపొక్కటే కేసీఆర్ లక్ష్యం

ఎన్నికల్లో గెలుపొక్కటే సీఎం కేసీఆర్ లక్ష్యంగా ఉంటుంది. అనుబంధాలు, ఆప్యాయతలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరనేది. పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు ఆయనను వీడిన ఈటెల రాజేందర్ తో సహా అత్యంత ఆప్తులుగా చెలామణి అయినవారి సంఖ్య తక్కువేమిలేదు. ఈ లెక్కన ముత్తిరెడ్డి, తాటికొండలకు వచ్చే ఎన్నికల్లో చెక్ పెట్టడం ఆయనకు పెద్ద సమస్యేమీ కాదు.

ఈ ఇద్దరి పై గత ఎన్నికల్లోనూ అసంతృప్తి, వ్యతిరేకత ఉందనే వార్తలు గుప్పుమన్నాయి. అయినప్పటికీ సిట్టింగులుగా వారికే అవకాశం ఇచ్చారు. ఈ మేరకు 2018 ఎన్నికల్లో రెండవ పర్యాయం పోటీ చేసి గెలిచారు. ఈ పర్యాయం సైతం కొద్ది స్థానాలు మినహా మెజార్టీ స్థానాలు సిట్టింగులకే కేటాయిస్తామంటూ ప్రకటించారు. అయితే ఎంత మందికి ఛాన్స్ కల్పిస్తారో త్వరలో తేలనుంది. అయితే వరంగల్ లో మాత్రం ప్రస్తుతానికి ఈ ఇద్దరు ఎమ్మెల్యేల ఆశలు గల్లంతైనట్లేనని చెప్పవచ్చు.

మౌనం వెనుక మాస్లర్ ప్లాన్

జనగామ, స్టేషన్ ఘన్ పూర్ లో తాజా పరిణామాలు వేగంగా సాగుతున్నా అధిష్టానం నేతలుగా సీఎం కేసీఆర్, అన్నింటా తానై వ్యవహరిస్తున్న కేటీఆర్, జిల్లాకు చెందిన మంత్రి ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్ తో సహా ఏ ఒక్క నాయకుడు నోరుమెదపకపోవడం తెరవెనుక అధిష్టానం హస్తం ఉందనేదానికి సంకేతంగా భావిస్తున్నారు. స్టేషన్ ఘన్ పూర్ వ్యవహారంలో ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం మధ్య ఆధిపత్యపోరు చాలా కాలంగా సాగుతోంది. ఎక్కడాలేని విధంగా స్టేషన్ సెగ్మెంట్లో కడియం తన జోక్యం ఉన్నా అధిష్టానం పట్టించుకోలేదు.

ఈ క్రమంలో రాజయ్య చేసుకున్న స్వయంకృతాపరాధాలు సైతం కడియానికి ఉపయోగపడ్డాయి. ఈ సమస్యలు పెద్దవిగా చూపడంలో కడియం తెరవెనుక సూత్రధారిగా రాజయ్య పలుమార్లు ఆరోపించారు. ఇటీవల కేటీఆర్ రాజయ్యను ప్రగతిభవన్ కు పిలిచిమరీ సున్నితమైన హెచ్చరిక చేశారు. నిన్ననైతే ఎమ్మెల్యే మార్పు తప్పదు. తనకే పోటీచేసే అవకాశం వస్తుందంటూ పరోక్షంగా కడియం స్పష్టం చేయడం కథ క్లైమాక్సుకు చేరిందని చెప్పవచ్చు.

జనగామలో మొన్నటి వరకు ముత్తిరెడ్డికి పోటీగా ఎమ్మెల్సీ పోచంపల్లికి అవకాశం కల్పిస్తారని భావించారు. అనూహ్యంగా మూడు నెలల నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి తెరపైకి రావడం గమనార్హం. పల్లా ప్రగతిభవన్ కు దగ్గరిగా ఉన్నారనేది బహిరంగవిషయం. ఈ నేపథ్యంలో పల్లా ప్రణాళికలన్నీ ప్రగతిభవన్ నుంచే అమలుజరుగుతున్నాయనే అనుకుంటున్నారు. ఆధిపత్యపోరు రోడ్డెక్కినా అధిష్టానం మౌనం వహించడానికి కారణమిదే అంటున్నారు. ఇరువురు ఎమ్మెల్యేలకు ప్రగతిభవన్ ద్వారాలు మూసివేసినట్లుగా చెప్పవచ్చు. మీడియా వేదికగా తమ అభ్యర్థన తప్ప అధినేతనుకలిసే అవకాశాలు లేవనేది తేలిపోయింది.

మరో వైపు ఇతర పక్షాల వైపు వెళ్ళకుండా నలుదిక్కులా దిగ్బంధం చేశారంటున్నారు. ముత్తిరెడ్డి పై విపక్షాల నుంచి అనేక ఆరోపణలు, స్వపక్షం నుంచి గోతులు, సొంత కుమార్తె నుంచి వ్యతిరేకత అన్ని దారులు మూసేశారు. అందుకే శనివారం ముత్తిరెడ్డి మాటల్లో హుజురాబాద్ పేరు వచ్చిందేమో? కొంచెం తేడాతో రాజయ్య పరిస్థితి కూడాఅదే. విపక్షం, స్వపక్షం నుంచి అవినీతి, లైంగిక ఆరోపణలతో తన బలాన్ని తగ్గించేశారు. దీంతో సందిగ్ధ పరిస్థితుల్లో ఇద్దరు తమ తమ నియోజకవర్గ చౌరస్తాలో నిలిచారు.

కేసీఆర్ కు వరంగల్ అండదండ

తొలి నుంచి బీఆర్ఎస్ పార్టీకి అన్ని విధాలుగా ఉమ్మడి వరంగల్ జిల్లా అండగా నిలుస్తోంది. ప్రధానంగా ఎన్నికల పోరుల్లో ఎమ్మెల్యేలను గెలిపించి బలాన్నిస్తోంది. ఈ కారణంగా వరంగల్ పై బీఆర్ఎస్ అధిష్టానం ప్రత్యేక కేంద్రీకరణ చేస్తోంది. గత ఎన్నికల్లో 12 అసెంబ్లీ స్థానాలకుగానూ 10 స్థానాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారు. కాంగ్రెస్ నుంచి మరో ఎమ్మెల్యే ఫిరాయించి గులాబీ గూటికి చేరుకున్నారు. ఈ సారి సిట్టింగ్ ఎమ్మెల్యేల పై వ్యతిరేకత తీవ్రంగా ఉన్నప్పటికీ ప్రత్యామ్నాయ అభ్యర్థ్యుల సర్వేతో పోల్చుకుంటే సిట్టింగులే బెటర్ గా నివేదికలు వచ్చినట్లు సమాచారం.

దీనికి తోడు ఎన్నికల రణరంగంలో సకలహంగులు సిట్టింగులు కలిగి ఉన్నందున మెజార్టీ సిట్టింగుల వైపే మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఈ కారణంగా ప్రత్యామ్నాయ అభ్యర్థులు బలంగా ఉన్న జనగామ, స్టేషన్ ఘన్ పూర్ లో మార్పుకు సిద్ధమైనట్లు భావిస్తున్నారు. వరంగల్ లో ఒక్క స్థానం చేజారకుండా జాగ్రత్తవహిస్తున్నట్లు చెబుతున్నారు. అందుకే సర్వశక్తులొడ్డుతున్నారని భావిస్తున్నారు.

Latest News