KCR: ముగిసిన కేసీఆర్ విచారణ!

KCR: ముగిసిన కేసీఆర్ విచారణ!

విధాత : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ అవతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విచారణ ముగిసింది. కమిషన్ 50నిమిషాల పాటు కేసీఆర్ ను విచారించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో తీసుకున్న నిర్ణయాలపై క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. ఇన్ కెమెరాలో జరిగిన విచారణలో కమిషన్ చైర్మన్‌ జస్టిస్‌ పీసీ ఘోష్‌, కమిషన్‌ కార్యదర్శి మురళీధర్‌, కేసీఆర్ లు మాత్రమే ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ క్రమంలో 115వ సాక్షిగా కమిషన్ కేసీఆర్ ను ప్రశ్నించింది. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ అవతవకలపై కాగ్, విజిలెన్స్ కమిషన్, ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదికల అంశాలతో పాటు ఘోష్ కమిషన్ ఇప్పటికే ఇంజనీర్లు, ప్రజాప్రతినిధులను, కాంట్రాక్టు సంస్థలను విచారించిన అంశాల నేపథ్యంలో కేసీఆర్ ను ప్రశ్నించింది.

కాగా విచారణ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణలో తాగు, సాగు నీటి పరిస్థితులతో పాటు భారతదేశంలో నీటి లభ్యత, వినియోగంపై కమిషన్ కు వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ అంశాలు..తీసుకున్న నిర్ణయాలపై పలు డాక్యుమెంట్లు పీసీ ఘోష్ కమీషన్ కు అందించారు. విచారణ అనంతరం బీఆర్కే భవన్ నుంచి బయటకు వచ్చిన కేసీఆర్ కొద్దిసేపట్లో మీడియాతో మాట్లాడనున్నారు.

 

కాళేశ్వరం కమిషన్ విచారణ సందర్భంగా కేసీఆర్ ను 18ప్రశ్నలు

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్ణయం ఎవరు తీసుకున్నారు?, బ్యారేజీలలో నీళ్లను నింపమని మీరు అదేశించారా?..బ్యారేజీల లొకేషన్స్ మార్పు నిర్ణయం ఎవరు తీసుకున్నారు? ఆనకట్టల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం ఉందా? కార్పేరేషన్ ఎందుకు ఏర్పాటు చేశారు వంటి ప్రశ్నలను కాళేశ్వరం కమిషన్ సంధించింది. కాళేశ్వరం ప్రాజెక్టుల డిజైన్ల రూపకల్పనలో మీ పాత్ర ఏంటి?.. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు కారణం ఏంటి?..ప్రాజెక్టు పూర్తి కాకముందే బిల్లులు ఎందుకు చెల్లించారు?..కాళేశ్వరం ప్రాజెక్టును ఎప్పుడు ఆమోదించారు?..మంత్రివర్గ ఉపసంఘం ఎప్పుడు ఏర్పాటైంది?..కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి మంత్రివర్గ ఆమోదం ఉందా? 7. సబ్ కమిటీ సిఫార్సులకు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధం ఉందా?..మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల నిర్మాణ వద్ద రాతి పునాది ఉందా?..మేడిగడ్డ ప్రాజెక్టు స్థలాన్ని ఎందుకు మార్చారు? వంటి ప్రశ్నలు సంధించారు.

కేబినెట్ ఆమోదంతోనే..ఆనకట్టల నిర్మాణం జరిగిందని..వ్యాప్కోస్ సిఫారసులు మేరకు నిర్మాణం చేశారని..అన్ని అనుమతులు తీసుకున్నామని కేసీఆర్ వివరించారు. మేడిగడ్డ వద్ద 230 టీఎంసీల నీళ్లను లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉంది. అందుకే లోకేషన్ మార్పు అని..ప్రాజెక్టు వేగంగా పూర్తి చేసేందుకు కార్పోరేషన్ ఏర్పాటు చేశామని..బ్యారేజీల నిర్మాణ స్థలం ఎంపిక, మార్పు సాంకేతిక అంశమని..నీటి లభ్యత పరిగణలోకి తీసుకుని కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టామన్నారు. ఎంత నీరు నిల్వ చేయాలన్నది ఇంజనీర్లు చూసుకుంటారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలకు సంబంధించిన పుస్తకాన్ని, జీవో నంబర్ 45, ఆపరేషన్స్ ఆండ్ మెయింటనెన్స్ బుక్ ను కమిషన్ కు అందచేశారు.