Etala Rajender: కాళేశ్వరం కమిషన్ విచారణలో ఈటల రాజేందర్ కు కీలక ప్రశ్నలు!

Etala Rajender: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు మాజీ మంత్రి, ఈటల రాజేందర్ హాజరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్న ఈటలను జస్టిస్ పీసీ ఘోష్ పలు 20నిమిషాల పాటు బహిరంగ విచారణ జరిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని ఎందుకు మార్చారన్న దానిపై కమిషన్ ఈటలను ప్రశ్నించింది. కేంద్ర జల సంఘం..మహారాష్ట్ర అభ్యంతరాలతో ప్రాజెక్టును తుమ్మిడి హట్టి నుంచి మేడిగడ్డకు మార్చామని..అవన్ని క్యాబినెట్ నిర్ణయం మేరకే జరిగాయని ఈటల తెలిపారు. బ్యారేజిల నిర్మాణ ప్రదేశాలు ఎందుకు మార్చారన్న కమిషన్ ప్రశ్నకు ఆ సాంకేతిక అంశాలపై మాకు అవగాహన ఉండదని..అవన్ని టెక్నికల్ కమిటీ నిర్ణయం మేరకే జరిగాయని తెలిపారు. మూడు బ్యారేజీల నిర్మాణపై ఎవరు నిర్ణయం తీసుకున్నారు అని కమిషన్ ఈటలను ప్రశ్నించింది. టెక్నికల్ టీం, క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక మేరకే బ్యారేజీలపై క్యాబినెట్ నిర్ణయం జరిగిందని ఈటల సమధానమిచ్చారు. ప్రాణహిత చేవేళ్లను మొదట 16వేలకోట్లతో నిర్మించాలని ప్రతిపాదించారని..దాన్ని కాళేశ్వరం ప్రాజెక్టుగా రూ.63 వేల కోట్లతో నిర్మించాలని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని..ఆ తర్వాత 83 వేల కోట్లకు పెరిగిందని..ఇప్పుడు ఎంత ఖర్చయిందో నాకు తెలియదని ఈటల తెలిపారు. కేబినెట్ నిర్ణయాల మేరకే ప్రాజెక్టుకు నిధులు ఇచ్చామన్న ఈటల వెల్లడించారు.
కాళేశ్వరం కార్పేరేషన్ ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందని కమిషన్ ఈటలను ప్రశ్నించింది. నిధుల సేకరణ, పనులు వేగవంతం కోసం ఆనాడు కార్పోరేషన్ ఏర్పాటు చేశారని..దానితో గాని, డిజైన్లు, నిర్మాణంతో గాని నాకు సంబంధం లేదని ఈటల స్పష్టం చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో క్వాలిటీ ఉందో లేదో ఇరిగేషన్ శాఖ చూసుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష నేతలపై బట్టకాల్చి మీద వేసే ప్రయత్నం చేయకుండా..ఏడాది కాలం గడిచిపోయిందని..వెంటనే ఘోష్ కమిటీ నివేదికను బయటపెట్టి దోషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. అయితే ఈటల గతంలో మీడియా ముందు కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ కర్త, కర్మ అంతా కేసీఆర్ చెప్పినట్లుగా కమిషన్ ముందుకూడా అదే విషయం చెప్పారా? అన్న మీడియా ప్రశ్నకు ఈటల సమాధానం దాటవేశారు. కమిషన్ ఇప్పటికే వందల మందిని విచారించినందునా అన్ని విషయాలు వారికి తెలుసని ఈటల వ్యాఖ్యానించారు.