Kolkata | బెంగాల్‌లో ఇద్దరు మహిళలపై ఘాతుకం.. నగ్నంగా ఊరేగింపు

Kolkata దొంగతనం చేశారని నగ్నంగా ఊరేగింపు చిత్రహింసలు పెట్టిన స్థానికులు రాజకీయ దుమారం రేపిన ఘటన కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని మాల్డాలో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై రాజకీయ దుమారం రేగింది. పోలీసులు చూస్తుండగానే ఇద్దరు మహిళలను కొందరు వ్యక్తులు వివస్త్రలను చేసి, దారుణంగా హింసిస్తూ ఉన్న వీడియో ఒకటి తాజాగా వెలుగు చూసింది. ఈ ఇద్దరు మహిళలు గిరిజనులు. మాల్డాలోని బమన్‌గోల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పకువా హట్‌ అనే వారాంతపు సంతలో జూలై 19న […]

Kolkata | బెంగాల్‌లో ఇద్దరు మహిళలపై ఘాతుకం.. నగ్నంగా ఊరేగింపు

Kolkata

  • దొంగతనం చేశారని నగ్నంగా ఊరేగింపు
  • చిత్రహింసలు పెట్టిన స్థానికులు
  • రాజకీయ దుమారం రేపిన ఘటన

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని మాల్డాలో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై రాజకీయ దుమారం రేగింది. పోలీసులు చూస్తుండగానే ఇద్దరు మహిళలను కొందరు వ్యక్తులు వివస్త్రలను చేసి, దారుణంగా హింసిస్తూ ఉన్న వీడియో ఒకటి తాజాగా వెలుగు చూసింది. ఈ ఇద్దరు మహిళలు గిరిజనులు. మాల్డాలోని బమన్‌గోల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పకువా హట్‌ అనే వారాంతపు సంతలో జూలై 19న ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తున్నది.

మణిపూర్‌లో ఇద్దరు కుకీ గిరిజన మహిళలను వివ‌స్త్రలను చేసి ఊరేగించిన ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు రేపుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బెంగాల్‌లో తాజా ఘటన చోటు చేసుకోవడంతో దీనిని రాజకీయంగా వాడుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించింది.

బెంగాల్‌లో మహిళలకు ముఖ్యమంత్రి మమతాబెనర్జీ భద్రత కల్పించలేక పోతున్నారని బీజేపీ మండి పడింది. దీనిపై తీవ్రంగా స్పందించిన అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌.. ఈ అంశాన్ని బీజేపీ రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. వాస్తవానికి ఆ ఇద్దరు మహిళలు దొంగతనం చేస్తూ దొరికిపోతే.. స్థానికులు ఆగ్రహంతో చేసిన పనిని మణిపూర్‌ హింసతో పోల్చడం సరికాదని పేర్కొన్నారు.

సోషల్‌ మీడియాలో వెలుగు చూసిన ఈ వీడియోను బీజేపీ సోషల్‌ మీడియా విభాగం హెడ్‌ అమిత్‌ మాలవీయ శనివారం పోస్ట్‌ చేశారు. ‘పశ్చిమబెంగాల్‌లో భయానక పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇద్దరు గిరిజన మహిళలను దుస్తులు ఊడబీకి, హింసించి, కొట్టారు. పోలీసులు అక్కడే ఉన్నా.. నోరు మెదపలేదు’ అని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు. కానీ.. ఘటన ఎందుకు జరిగిందో ఆయన తెలియజేయలేదు.

దీనిపై బీజేపీ అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నదని బెంగాల్‌ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి శశి పంజా విమర్శించారు. ‘ఇది ఒక దొంగతనం కేసు. మార్కెట్‌లో ఇద్దరు మహిళలు దొంగతనం చేసేందుకు ప్రయత్నిస్తే స్థానికులు ఆగ్రహంతో పాల్పడిన దుశ్చర్య. ఘటనా స్థలానికి పోలీసులు వెంటే వెళ్లారు. కేసు కూడా నమోదైంది. దర్యాప్తు చేస్తున్నారు’ అని వివరించారు.

దీనికి రాజకీయాలతో సంబంధమేంటని మంత్రి నిలదీశారు. ఈ విషయంలో సీపీఎం నాయకులు బృందా కారత్‌ స్పందించారు. పశ్చిమ బెంగాల్‌లో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయన్న కారత్‌.. మాల్డా ఘటనలో మణిపూర్‌ ఘటనను పోల్చడం సరికాదని వ్యాఖ్యానించారు. మహిళలపై అకృత్యాలు ఎక్కడ జరిగినా ఖండించాల్సిందేనని, ఆదివాసీ మహిళలను మరొకొందరు ఆదివాసీ మహిళలు హింసించడం దారుణమని అన్నారు.