Komatireddy Brothers: కమిటీల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ అవుట్ !

Komatireddy Brothers: కమిటీల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ అవుట్ !

హాట్ టాపిక్ గా మారిన హైకమాండ్ నిర్ణయం
కారణాలపై కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తికర చర్చ
కేబినెట్ విస్తరణలో చాన్స్ లేకపోతే మరో రచ్చ
ఆ నలుగురు మంత్రుల భవితవ్యంపై సందేహాలు

విధాత, హైదరాబాద్ : కాంగ్రెస్ హైకమాండ్ తాజాగా ప్రకటించిన పీసీసీ కమిటీల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలతో పాటు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిలకు స్థానం కల్పించకపోవడం కాంగ్రెస్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. 70మందితో కూడిన నాలుగు పీసీసీ కమిటీలు దేనిలోనూ కోమటిరెడ్డి బ్రదర్స్ కు స్థానం కల్పించకపోవడం..అదే సమయంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కే.జానారెడ్డి, ఎన్. బాలునాయక్, బీర్ల అయిలయ్య యాదవ్ , అద్దంకి దయాకర్ లకు కమిటీల్లో చోటు కల్పించడం కోమటిరెడ్డి బ్రదర్స్ కు మింగుడుపడని వ్యవహారంగా మారింది. కోమటిరెడ్డి బ్రదర్స్ ను, వివేక్ ను కావాలనే కాంగ్రెస్ హైకమాండ్ దూరం పెట్టిందా లేక..నేడో రేపో ప్రకటించనున్న పీసీసీ కార్యవర్గం, కేబినెట్ విస్తరణలో అవకాశం కల్పించే ఉద్దేశంతోనే పీసీసీ కమిటీల నుంచి వారిని ఎగ్జిట్ చేశారా అన్నదానిపై ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి. కాంగ్రెస్ హైకమాండ్ పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీలో 22మందికి స్థానం కల్పించగా..పలువురు మంత్రులతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాకే చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీర్ల అయిలయ్యలు ఈ కమిటీలో ఉన్నారు. సలహా కమిటీలో 15మందికి స్థానం కల్పించగా.. అదే జిల్లాకు చెందిన సీనీయర్ నాయకుడు కె.జానారెడ్డికి ప్రాతినిథ్యం దక్కింది. ఇక ఏడుగురితో ఏర్పాటు చేసిన డీలిమిటేషన్ కమిటీలోనూ కోమటిరెడ్డి బ్రదర్స్ కు ప్రాతినిధ్యం లేదు. అలాగే 16మందితో కూడిన సంవిధాన్ బచావో కార్యక్రమ కమిటీలోనూ కోమటిరెడ్డి బ్రదర్స్ లేరు. ఈ కమిటీలో వారి జిల్లాకే చెందిన అద్దంకి దయాకర్, ఎన్.బాలునాయక్ లకు చోటు దక్కింది. ఆరుగురితో కూడిన పార్టీ క్రమశిక్షణా చర్యల కమిటీలోనూ కోమటిరెడ్డి బ్రదర్స్ కు స్థానం కల్పించలేదు.

ఆ నలుగురు మంత్రులకే ఎందుకలా..?
కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించిన రాజకీయ వ్యవహారాల కమిటీలో 22మంది సభ్యుల్లో సీఎం రేవంత్ రెడ్డి సహా 8మంది మంత్రులకు ప్రాతినిధ్యం కల్పించిన అధిష్టానం మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్ రావు, కొండా సురేఖలకు మాత్రం స్థానం కల్పించకపోవడం వెనుక మతలబు ఏమిటన్నది మరింత ఆసక్తికరంగా మారింది. రాజకీయ వ్యవహారాల కమిటీలో మంత్రులను ప్రత్యేక ఆహ్వానితులుగా పేర్కోనడం కొంత వారికి ఊరటగా ఉంది. అయితే ఆ నలుగురు మంత్రులను రాజకీయ వ్యవహారాల కమిటీతో పాటు మిగతా ఏ కమిటీల్లోనూ తీసుకోకపోవడంతో వారిని కేబినెట్ నుంచి తప్పిస్తారా అన్న ఊహాగానాలు సైతం వినిపిస్తున్నాయి. ఈ ఊహాగానాలకు కేబినెట్ విస్తరణలో పరిశీలనలో ఉన్న ఆశావహుల పేర్లు, సామాజిక సమీకరణలు, జిల్లాల ప్రాతినిధ్యం, రాజకీయ అవసరాల నేపథ్యం కూడా తోడవ్వడంతో ఆ నలుగురు మంత్రుల భవితవ్యంపై సందేహాలు రేకెత్తుతున్నాయి.

కమిటీల్లో ఎగ్జిట్…కేబినెట్ ఎంట్రీకేనా..?
పీసీసీ కమిటీల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ ను, వివేక్ ను ఎంపిక చేయకపోవడానికి కారణాలపై కాంగ్రెస్ వర్గాలతో పాటు పొలిటికల్ సర్కిల్ లోనూ ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి. మంత్రివర్గ విస్తరణలో రాజగోపాల్ రెడ్డి, వివేక్ లు తమకు స్థానం కల్పించాలని పట్టుబట్టిన నేపథ్యంలోనే వారిని పీసీసీ కమిటీలకు దూరం పెట్టారా అన్న చర్చ సాగుతుంది. కనీసం మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికైనా ఎందుకు ఆ కమిటీల్లో స్థానం కల్పించలేదన్న ప్రశ్న రచ్చ రేపుతుంది. కోమటిరెడ్డి వర్గీయులు ఏ నలుగురు కలిసినా జిల్లాకే చెందిన ఉత్తమ్, జానారెడ్డి, అయిలయ్య, అద్దంకి, బాలునాయక్ లను కమిటీల్లో తీసుకుని కోమటిరెడ్డి బ్రదర్స్ ను ఎందుకు దూరం పెట్టారన్నదానిపైనే మాట్లాడుకుంటున్నారు. అయితే రాజగోపాల్ రెడ్డిని, వివేక్ ను కేబినెట్ లో తీసుకోబోతున్నందునే వారికి పీసీసీ కమిటీల్లో స్థానం కల్పించలేదన్న అభిప్రాయం కూడా వినిపిస్తుంది. అదిగాక రాజగోపాల్ రెడ్డి, వివేక్ ల పేర్లు పీసీసీ కార్యవర్గంలో కీలక పదవులకు కూడా పరిశీలనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఏది ఏమైనా పీసీసీ కమిటీల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ , వివేక్ ల పేర్లు లేకపోవడం కాంగ్రెస్ రాజకీయాల్లో సరికొత్త రచ్చను రేపినట్లయ్యింది. నేడో రేపో ప్రకటించే పీసీసీ కార్యవర్గంలో, కేబినెట్ విస్తరణలో రాజగోపాల్ రెడ్డి, వివేక్ ల పేర్లు లేకపోతే కాంగ్రెస్ లో అసమ్మతి జ్వాలలు రగలడం ఖాయంగా కనిపిస్తుంది.