Lift rope breaks: తెగిన లిఫ్ట్ రోప్..పోలీస్ అధికారి మృతి!
రాజన్న సిరిసిల్ల జిల్లా టీజీఎస్పీ(TGSP) 17వ బెటాలియన్ అదనపు కమాండెంట్ గంగారాం(55) లిఫ్ట్ ప్రమాదంలో మృతి చెందాడు.

Lift rope breaks: లిఫ్ట్ రోప్ తెగి కిందపడిన ప్రమాదంలో ఓ పోలీస్ అధికారి మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా టీజీఎస్పీ(TGSP) 17వ బెటాలియన్ అదనపు కమాండెంట్ గంగారాం(55) లిఫ్ట్ ప్రమాదంలో మృతి చెందాడు.
సిరిసిల్లలోని ఓ భవనంలో లిఫ్ట్ దిగుతుండగా తాడు తెగిపోయి ఒక్కసారిగా లిఫ్టు కూలి కిందకు పడిపోయింది. ఎత్తు నుంచి వేగంగా కిందకు లిఫ్టు పడిపోవడంతో గంగారామ్ చాతి పైన భారీ గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతుడు గంగారామ్ గతంలో తెలంగాణ సెక్రటేరియట్‌లో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేశారు. అనుకోని ప్రమాదంలో కమాండెంట్ గంగారామ్ మృతి చెందడం పట్ల బెటాలియన్ సిబ్బంది, కుటుంబ సభ్యులు విషాదంలో మునిగారు.
మంత్రి సురేఖ సంతాపం
తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్ మాజీ సీఎస్ఓ, సిరిసిల్ల బెటాలియన్ కమాండెంట్ టి.గంగారామ్ మృతి పట్ల తెలంగాణ అటవీ,పర్యావరణ,దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గంగారామ్ ఆకస్మిక మరణంపై సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కమాండెంట్ గంగారామ్ ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబీకులు ఈ కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని పేర్కొన్నారు.