Womens Reservation Bill | మహిళా బిల్లుకు లోక్‌సభ ఆమోదం

Womens Reservation Bill | అనుకూలం 454.. వ్యతిరేకం 2 నేడు రాజ్యసభలో బిల్లుపై చర్చ లోక్‌సభలో 8 గంటలపాటు సుదీర్ఘ చర్చ అమిత్‌షా సమాధానం అనంతరం ఓటింగ్‌ పనిచేయని ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ వ్యవస్థ గత్యంతరం లేక స్లిప్పుల ద్వారా నిర్వహణ 2029 ఎన్నికల నాటికే బిల్లు ఫలితం మహిళలకు ఇంకెన్నాళ్లీ ఎదురుచూపు? 15 ఏళ్లు ఆగమనడం కుటిల యత్నమే వందనాలు వద్దు.. సమాన గౌరవం కావాలి మహిళా బిల్లుపై చర్చలో ప్రతిపక్ష సభ్యులు జనగణన, పునర్విభజనతో […]

  • By: krs    latest    Sep 20, 2023 3:20 PM IST
Womens Reservation Bill | మహిళా బిల్లుకు లోక్‌సభ ఆమోదం

Womens Reservation Bill |

  • అనుకూలం 454.. వ్యతిరేకం 2
  • నేడు రాజ్యసభలో బిల్లుపై చర్చ
  • లోక్‌సభలో 8 గంటలపాటు సుదీర్ఘ చర్చ
  • అమిత్‌షా సమాధానం అనంతరం ఓటింగ్‌
  • పనిచేయని ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ వ్యవస్థ
  • గత్యంతరం లేక స్లిప్పుల ద్వారా నిర్వహణ
  • 2029 ఎన్నికల నాటికే బిల్లు ఫలితం
  • మహిళలకు ఇంకెన్నాళ్లీ ఎదురుచూపు?
  • 15 ఏళ్లు ఆగమనడం కుటిల యత్నమే
  • వందనాలు వద్దు.. సమాన గౌరవం కావాలి
  • మహిళా బిల్లుపై చర్చలో ప్రతిపక్ష సభ్యులు
  • జనగణన, పునర్విభజనతో లింకుపై ఆగ్రహం
  • అయినా కాంగ్రెస్‌ సహా పలు పక్షాల మద్దతు

న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. బుధవారం 8 గంటలపాటు రోజంతా ఇదే బిల్లుపై చర్చ నడిచింది. అనంతరం ఓటింగ్‌ నిర్వహించగా.. బిల్లుకు అనుకూలంగా 454 మంది ఆమోదం తెలపగా.. ఇద్దరు ఎంపీలు వ్యతిరేకించారు. దీంతో బిల్లు ఆమోదం పొందిందని స్పీకర్‌ ఓంబిర్లా ప్రకటించారు. ఎంఐఎంకు చెందిన ఇద్దరు ఎంపీలు బిల్లును వ్యతిరేకించినట్టు తెలుస్తున్నది. కొత్త సభలో నిర్వహించిన తొలి ఓటింగ్‌లోనే సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ వ్యవస్థ పనిచేయలేదు. దీంతో స్లిప్పుల ద్వారా ఓటింగ్‌ నిర్వహించాల్సి వచ్చింది. ఓటింగ్‌ సమయానికి సభకు హాజరైన ప్రధాని మోదీ.. ఓటింగ్‌లో పాల్గొన్నారు.

అంతకు ముందు పలువురు ప్రతిపక్ష సభ్యులు బిల్లు తెచ్చిన విధానాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. పదిహే నేళ్ల తర్వాత కానీ అమలుకు నోచుకోని మహిళా బిల్లు వల్ల ప్రయోజమేంటని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. జనాభా లెక్కల సేకరణ, నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే బిల్లు అమలు అనే అంశాన్ని నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. లేదంటే బిల్లు అమలులో విపరీతమైన జప్యం జరుగుతుందని హెచ్చరించారు. అదే సమయంలో బీసీ మహిళలకు కూడా రిజర్వేషన్‌ కల్పించాలని డిమాండ్‌ చేశారు.

కాంగ్రెస్‌ నాయకురాలు సోనియాగాంధీతోపాటు.. ప్రతిపక్ష పార్టీలైన జేడీయూ, డీఎంకే, ఎన్సీపీ, ఆర్జేడీ, బీఎస్పీ నేతలు కూడా బిల్లులో ఓబీసీ కోటాను చేర్చాలని డిమాండ్‌ చేశారు. ఓబీసీ కోటా కోరుకోవడంలో తప్పు లేదని కేంద్ర సహాయ మంత్రి, అప్నా దళ్‌ (సోనేవాల్‌) నేత అనుప్రియ పటేల్‌ చెప్పారు. దీనిపై ప్రధాని కూడా ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లుపై బుధవారం లోక్‌సభలో చర్చ ప్రారంభమైంది. కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత సోనియా గాంధీ ఈ చర్చను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు తమ పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నదని చెప్పారు. ‘నారీ శక్తి వందన్‌ అభినియం-2023కి కాంగ్రెస్‌ తరఫున మద్దతు ప్రకటిస్తున్నాను’ అని ఆమె ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు సబ్‌ కోటా వర్తింపజేస్తూ సత్వరమే బిల్లును అమల్లోకి తేవాలని డిమాండ్‌ చేశారు. మహిళల ఓపికను అంచనా వేయడం సాధ్యం కాదని, విశ్రాంతి ఆలోచనే వారికి రాదని చెప్పారు. మహిళలు ఇంకా ఎంతకాలం ఎదురు చూడాలని ప్రశ్నించారు.

మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఆమోదించడంలో ఏ మాత్రం జాప్యం జరిగినా అది భారతీయ మహిళలకు తీవ్ర అన్యాయం చేస్తుందని అన్నారు. ‘గత పదమూడేళ్లుగా భారతీయ మహిళలు రాజకీయ బాధ్యతల కోసం ఎదురు చూస్తున్నారు. వారిని ఇంకా కొన్నేళ్లు ఆగమని చెబుతున్నారు. ఇంకెన్నేళ్లు? ఈ తరహా వైఖరి సరైనదేనా?’ అని ఆమె ప్రశ్నించారు. అడ్డంకులు తొలగించి సత్వరమే బిల్లును అమలు చేయడం అత్యవసరమని చెప్పారు. అలా చేయడం అసాధ్యం ఏమీ కాదని అన్నారు.

ఇది తన వ్యక్తిగత జీవితంలో భావోద్వేగాలతో ముడిపడిన రోజన్న సోనియా.. మొదటిసారిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళల ప్రాతినిధ్యానికి సంబంధించిన రాజ్యాంగ సవరణను తన భర్త రాజీవ్‌గాంధీ తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఈ బిల్లు ఆమోదంతో ఆయన కల పరిపూర్ణం అవుతుందని చెప్పారు. అంతకుముందు లోక్‌సభలో ఈ మేరకు బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌.. ఇది చాలా ముఖ్యమైనదని, సభ్యులు ఏకాభిప్రాయంతో ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు.

కేంద్రం సాధించిన ఏకాభిప్రాయం ఏంటి?

మహిళా రిజర్వేషన్‌ బిల్లు అనేది కేవలం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించినది కాదని, అది మహిళల పట్ల పక్షపాతాన్ని, అన్యాయాన్ని తొలగించేదని డీఎంకే సభ్యురాలు కనిమొళి అన్నారు. సమాన గౌరవాన్ని మహిళలు కోరుకుంటున్నారని చెప్పారు. నారీ శక్తి వందన్‌ అభినియంపై చర్చలో ఆమె మాట్లాడుతూ.. బిల్లులో పేర్కొన్న ‘పునర్విభజన తర్వాత’ అనే అంశాన్ని తొలగించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో మహిళలకు రిజర్వేషన్‌ కల్పించడంలో విపరీతమైన జాప్యం అవుతుందని అన్నారు. ‘ఈ బిల్లు అమలు కోసం మేం ఎన్నాళ్లు ఎదురుచూడాలి? రాబోయే పార్లమెంటు సమావేశాల్లోనే దీనిని సులభంగానే అమలు చేయవచ్చు. ఇది కేవలం రిజర్వేషన్లు కల్పించేది మాత్రమే కాదు.. ఇది మహిళల పట్ల వివక్షను, అన్యాయాన్ని తొలగించేదిగా అర్థం చేసుకోవాలి’ అని కనిమొళి చెప్పారు.

ఉత్తుత్తి రాజకీయాలు వదిలి.. ఆలోచనా రాజకీయాలకు మళ్లాల్సిన అవసరం ఉన్నదని ఆమె నొక్కి చెప్పారు. ‘ఈ బిల్లును నారీ శక్తి వందన్‌ అధినియం అని పిలుస్తున్నారు. మాకు వందనాలు చేయడం మానండి. మీ వందనాలు మాకు అవసరం లేదు. మమ్మల్ని పీఠాలపైకి ఎక్కించాలని మేం కోరుకోవడం లేదు. మమ్మల్ని పూజించాలనీ అనుకోవడం లేదు. సమాన గౌరవాన్ని కోరుకుంటున్నాం అంతే’ అని ఆమె చెప్పారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితను శక్తిమంతమైన నాయకురాలిగా ఆమోదించడానికి తనకేమీ శషభిషలు లేవని కనిమొళి స్పష్టం చేశారు.

తాను అనేక పర్యాయాలు ఈ అంశాన్ని లోక్‌సభలో ప్రస్తావించానని తెలిపారు. ప్రతి సారీ ప్రభుత్వం.. ఈ బిల్లు తేవడానికి ముందు ఏకాభిప్రాయం సాధించాల్సి ఉన్నదని, అందరితో చర్చించాల్సి ఉన్నదనే సమాధానాన్నే ఇస్తూ వచ్చిందన్న కనిమొళి.. ఇప్పుడు బిల్లు తేవడానికి ముందు ఎవరితో చర్చించారు? ఎలాంటి ఏకాభిప్రాయాం సాధించారు? అని నిలదీశారు. అత్యంత గోప్యంగా ఈ బిల్లు తెచ్చారని విమర్శించారు. అసలు ఈ సమావేశాలు ఎందుకు ఏర్పాటు చేశారో కూడా తమకు తెలియలేదని చెప్పారు.

ఎన్నికల కోసమే మహిళా బిల్లు : జేడీయూ

ప్రతిపక్షాల ‘ఇండియా కూటమి’ ఏర్పాటుతో భయాందోళనకు గురైన బీజేపీ ప్రభుత్వం హడావుడిగా మహిళా కోటా బిల్లును తీసుకొచ్చిందని జేడీయూ విమర్శించింది. జేడీయూ నేత రాజీవ్‌ రంజన్‌సింగ్‌ చర్చలో పాల్గొంటూ.. ఈ చర్యను 2024 ఎన్నికల్లో మోసపూరితంగా గెలిచేందుకు మోదీ ప్రభుత్వ ఎత్తుగడగా అభివర్ణించారు. ‘మేం ఈ బిల్లును సమర్థిస్తున్నాం. మహిళకు అధికారం ఇవ్వాలని మేం కోరుకుంటున్నాం. కానీ.. ఈ బిల్లు జుమ్లా తప్ప మరేమీ కాదు. ప్రతిపక్షాలు ఇండియా కూటమిగా ఏర్పడటంతో ప్రభుత్వం భయపడింది. 2024 ఎన్నికల గురించి మీరు (అధికార బీజేపీ) భయపడుతున్నారు.

అందుకే ఈ బిల్లు తీసుకొచ్చారు’ అని ఆయన చెప్పారు. నరేంద్రమోదీ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. ప్రతిపక్షాలు సుదీర్ఘ కాలంగా డిమాండ్‌ చేస్తున్న కుల గణనను చేపట్టి ఉండేదని అన్నారు. నిజానికి మహిళలకు అధికారం ఇవ్వాలన్న ఉద్దేశం బీజేపీ ప్రభుత్వానికి లేదని, మళ్లీ అధికారంలోకి రావడం ఒక్కటే వారి ఉద్దేశమని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వ ఉద్దేశాలు దేశ ప్రజలకు తెలుసని అన్నారు. బీజేపీ ప్రభుత్వం మహిళలకుగానీ, వెనుబడిన వర్గాలకు గానీ రిజర్వేషన్‌ ఇవ్వదని వారికి అర్థమైందని చెప్పారు.

మహిళా బిల్లుపై బీజేపీ కుటిల పన్నాగం

మహిళా రిజర్వేషన్‌ బిల్లు అమలును తదుపరి జనగణన, నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టడం ద్వారా బీజేపీ సర్కారు కుటిల పన్నాగం పన్నిందని తృణమూల్‌ కాంగ్రెస్‌ సభ్యురాలు కకోలి ఘోష్‌ దాస్తిదార్‌ ఆరోపించారు. తమ పార్టీ అధినేత్రి, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఈ ప్రక్రియ ప్రారంభమైన 1996 నుంచీ ఈ బిల్లును సమర్థిస్తున్నారని గుర్తు చేశారు. 33% మహిళా రిజర్వేషన్‌ను తమ పార్టీలో ముందే అమలు చేశామని చెప్పారు. ప్రస్తుతం టీఎంసీ ఎంపీల్లో 40శాతం మంది మహిళలేనని తెలిపారు. ప్రతి ఒక్కరూ మహిళ పట్ల నిజమైన గౌరవం చూపాలని అన్నారు.

ఇటీవల రెజ్లర్లు ఢిల్లీలో ఆందోళన చేసిన విషయాన్ని ప్రస్తావించిన కకోలి ఘోష్‌.. ‘మన దేశానికి పతకాలు తెచ్చిన ‘బంగారు అమ్మాయిలు’ తమపై లైంగిక వేధింపులు జరిగాయని ఆరోపించారు. ఆ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఇక్కడే పార్లమెంటులో కూర్చుని ఉన్నారు’ అని చెప్పారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌, ఇస్రోలోని మహిళా శాస్త్రవేత్తలకు వేతనాలు సరిగ్గా అందించడం లేదని విమర్శించారు. దీనికి అధికార పక్ష సభ్యలు తీవ్రస్థాయిలో స్పందించారు. ఇది తప్పుదోవ పట్టించే ఆరోపణని, ఇస్రో శాస్త్రవేత్తలకు క్రమం తప్పకుండా వేతనాలు, పెన్షన్లు అందుతున్నాయని కేంద్రమంత్రి కిరణ్‌రెజిజు చెప్పారు.

మద్దతు ఇస్తున్నాం: బీఎస్పీ

మహిళలకు సాధికారత కల్పించే, ప్రోత్సాహం ఇచ్చే ఈ బిల్లుకు హృదయపూర్వకంగా మద్దతు ఇస్తున్నామని బీఎస్పీ ఎంపీ సంగీతా ఆజాద్‌ చెప్పారు. దేశ నిర్మాణలో భాగం అవుతామని మహిళలు సంతోషిస్తారన్న సంగీత.. మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని డిమాండ్‌ చేశారు.

వెంటనే అమల్లోకి తేవాలి: బీఆరెస్‌

బీఆరెస్‌ లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ.. ఈ బిల్లును పార్లమెంటు ఆమోదించిన మరుక్షణమే అమల్లోకి తేవాలని డిమాండ్‌ చేశారు. లేదా.. జనగణన ఎప్పుడు పూర్తవుతుందో, పునర్విభజన ప్రక్రియ ఎప్పడు పూర్తవుతాయో ప్రభుత్వం ప్రకటించాలని చెప్పారు. దేశ మహిళలకు ప్రయోజనం చేకూర్చే బిల్లుకు తమ పార్టీ మద్దతు ఇస్తున్నదని శివసేన (షిండే) సభ్యురాలు భావన గవాలి చెప్పారు. పార్లమెంటులోకి అడుగు పెట్టేందుకు తాము ఎంతగా పోరాడాల్సి వచ్చిందో ఇక్కడున్న మహిళా సభ్యులందరికీ తెలుసని అన్నారు. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీల్లో 33శాతం రిజర్వేషన్‌ కల్పించడం పట్ల తాము సంతోషంతో ఉన్నామని, అదే సమయంలో మంత్రివర్గాల్లోనూ మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

మహిళా రిజర్వేషన్‌ బిల్లు చరిత్రాత్మకమైనదని బీజేపీ సభ్యురాలు సునీతా దుగ్గల్‌ అభివర్ణించారు. మోదీ వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు పార్టీలకు అతీతంగా అందరూ మద్దతు పలకాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కోరారు. బుధవారం లోక్‌సభలో 60 మంది సభ్యులు చర్చలో పాల్గొన్నారు. ఆ చర్చకు అమిత్‌షా సమాధానమిచ్చారు. బిల్లులో ఏమన్నా లేకపోతే చేర్చేందుకు సిద్ధమని చెప్పారు. కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు కురిపించిన అమిత్‌షా.. ఐదు దశాబ్దాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌.. గరీబీ హఠావో అని నినాదాలు ఇచ్చినా.. పేదరికాన్ని నిర్మూలించలేక పోయిందని చెప్పారు.

వారి పాలనలో 11 కోట్ల కుటుంబాలకు మరుగుదొడ్డి లేకపోయిందని విమర్శించారు. రాజ్యాంగంలోని 370 వ అధికరణం ప్రకారం జనరల్‌, ఎస్సీ, ఎస్టీ క్యాటగిరీలు మాత్రమే ఉన్నాయని, ఈ క్యాటగిరీల్లోనే తాము మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తున్నామని తెలిపారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు సభకు రావడం ఇదే మొదటిసారి కాదని అమిత్‌షా గుర్తు చేశారు. గతంలో నాలుగు సార్లు పార్లమెంటుకు వచ్చిందని, అప్పుడు ఎందుకు ఆమోదం పొందలేక పోయిందని ప్రశ్నించారు. తాము తీసుకొచ్చిన బిల్లు నిర్ణయాలు, విధానాల రూపకల్పనలో మహిళకు భాగస్వామ్యాన్ని కల్పిస్తుందని చెప్పారు. పురుషుల కంటే మహిళలే సమర్థులని అన్నారు. మహిళా బిల్లు ఆమోదంతో కొత్త శకం ప్రారంభమైందని చెప్పారు.

అగ్రవర్ణాల మహిళల కోసమే ఈ బిల్లు: ఒవైసీ

బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్‌ బిల్లుతో లబ్ధి పొందేది అగ్రవర్ణాల మహిళలేనని ఎంఐఎం సభ్యుడు అసదుద్దీన్‌ ఒవైసీ విమర్శించారు. ఈ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నామని ప్రకటించారు. లోక్‌సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. ఓబీసీ, ముస్లిం మహిళలకు ఎందుకు అవకాశం కల్పించరని ప్రశ్నించారు. దేశంలో ముస్లిం మహిళలు ఏడు శాతం ఉన్నారని, కానీ లోక్‌సభలో వారి ప్రాతినిథ్యం 0.7 శాతం మాత్రమేనని తెలిపారు. మోదీ ప్రభుత్వం చట్టసభల్లో సవర్ణ మహిళ ప్రాతినిధ్యాన్ని పెంచాలని కోరుకుంటున్నదని విమర్శించారు.

ఓబీసీ, ముస్లిం మహిళల ప్రాతినిథ్యాన్ని వారు కోరుకోవడం లేదని అన్నారు. ఇప్పటి వరకూ లోక్‌సభకు 690 మంది మహిళా ఎంపీలు ఎన్నికైతే.. అందులో 25మంది మాత్రమే ముస్లింలని చెప్పారు. మతప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వడం లేదని చెబుతున్నారని, కానీ.. 1950 ప్రెసిడెన్షియల్‌ ఆర్డర్లు దేని గురించని ప్రశ్నించారు. రిజర్వేషన్లలో ముస్లిం మహిళలకు కోటాను నిరాకరించడం ద్వారా మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓబీసీ మహిళలకు న్యాయంగా రావాల్సిన వాటా రావటం లేదని, ముస్లిం మహిళలకు తలుపులు మూసివేశారని విమర్శించారు.