Operation Sindoor | పాక్ డీజీఎం బతిమాలితేనే ఆపరేషన్ సిందూర్ ఆపాం : లోక్‌సభలో ప్రధాని మోదీ
పాకిస్తాన్ డీజీఎం అర్ధరాత్రి ఫోన్ చేసి.. బతిమలాడితేనే ఆపరేషన్ సిందూర్ ఆపామని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. అంతేకానీ ఏ ప్రపంచ నాయకుడి ఒత్తిడి ఇందులో లేదని లోక్‌సభలో చర్చలో పేర్కొన్నారు.
Operation Sindoor | ఆపరేషన్ సిందూర్ నిలిపివేత వెనుక ప్రపంచంలో ఏ దేశ నాయకుడి పాత్ర లేదని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే చెప్పుకొంటున్న నేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్‌పై లోక్‌సభలో జరిగిన చర్చకు ఆయన మంగళవారం సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉగ్రవాదులను మట్టికరిపించినందుకు భారతదేశం విజయోత్సవాలు చేసుకుంటున్నదని తెలిపారు. భారత సేన శౌర్య ప్రతాపాలతోనే ఆపరేషన్ సిందూర్ విజయవంతమైందని చెప్పారు. ]
‘పాకిస్తాన్‌పై ఆపరేషన్ సిందూర్‌ను ఆపాలంటూ ఏ దేశాధినేత నుంచి మాకు ఫోన్ రాలేదు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మే 9వ తేదీన నాతో ఫోన్‌లో సంభాషించారు. భారత్‌పై భారీ దాడికి పాకిస్తాన్ సిద్ధమైందని ఆయన నాకు చెప్పారు. అదే జరిగితే పాకిస్తాన్ భారీ మూల్యం చెల్లించుకో తప్పదని ఆయనకు తెలిపాను. పాకిస్తాన్‌కు ఎవరు సహాయం చేసినా కూడా ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పాను. పాకిస్తాన్ దాడి చేస్తే బుల్లెట్‌కు బుల్లెట్ సమాధానం అవుతందని స్పష్టం చేశాం. అన్నట్టే పాకిస్తాన్‌కు చిరకాలం గుర్తుండిపోయేలా సమాధానం చెప్పాం’ అని ప్రధాని తెలిపారు.
పాకిస్తాన్ డీజీఎం అర్ధరాత్రి ఫోన్ చేసి తమ దేశంపై దాడులు ఆపాలని బ్రతిమలాడారని, అందుకే ఆపరేషన్ సిందూర్ నిలిపివేశామని తెలిపారు. పాకిస్తాన్ మళ్లీ ఎలాంటి కుయుక్తులకు పాల్పడినా ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని ప్రధాని హెచ్చరించారు. అయితే.. పహల్గామ్ దాడి విషయంలో భద్రతా వైఫల్యాలపై ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం. అంతకు ముందు చర్చలో పాల్గొన్న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. ఆపరేషన్ సిందూర్‌ను కేవలం 22 నిమిషాల్లో ముగించారని ఆరోపించారు. యుద్దం తన వల్లే ఆగిందని చెబుతున్న డొనాల్డ్ ట్రంప్ అబద్ధం చెబుతున్నారనే దమ్ముందా? అని ప్రధాని మోదీని సవాలు చేశారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో ప్రతిపక్షం అధికార పక్షం వెంట గట్టి రాయిలా నిలబడిందని గుర్తు చేశారు. ఆపరేషన్ సింధూర్‌లో సైన్యం పోషించిన పాత్రను ఆయన ప్రశంసించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram