Eetala Rajender | ఢిల్లీలో వందలకొద్దీ విమానాలు రద్ధు, ఆలస్యంపై లోక్‌సభలో లేవనెత్తిన ఎంపీ ఈటల రాజేందర్

న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో వందలాది విమాన సర్వీసుల ఆలస్యం, రద్దు పై గురువారం నాడు లోకసభలో ఎంపీ ఈటల రాజేందర్ ప్రశ్న వేశారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి దయచేసి ఈ క్రింది విషయాలను తెలియాలని ఆయన కోరారు.

  • By: TAAZ |    national |    Published on : Dec 04, 2025 9:10 PM IST
Eetala Rajender | ఢిల్లీలో వందలకొద్దీ విమానాలు రద్ధు, ఆలస్యంపై లోక్‌సభలో లేవనెత్తిన ఎంపీ ఈటల రాజేందర్

Eetala Rajender |  న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో వందలాది విమాన సర్వీసుల ఆలస్యం, రద్దు పై గురువారం నాడు లోకసభలో ఎంపీ ఈటల రాజేందర్ ప్రశ్న వేశారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి దయచేసి ఈ క్రింది విషయాలను తెలియాలని ఆయన కోరారు. ఈ సంవత్సరం నవంబర్ 7, 8 తేదీలలో ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) సాఫ్ట్‌వేర్ లోపం, స్పూఫింగ్ వల్ల 800 కి పైగా విమానాలను ఆలస్యం లేదా రద్దు అయ్యాయి. ఫలితంగా లక్ష మందికి పైగా ప్రయాణికులు ఇబ్బందులకు గురైన విషయం ప్రభుత్వానికి తెలుసా అని అడిగారు. ఒకవేళ తెలిస్తే దాని వివరాలు, విమానయాన సంస్థలకు ఎంత నష్టం జరిగిందో తెలియచేయాలన్నారు. భవిష్యత్తులో పెరుగుతున్న విమాన ట్రాఫిక్‌ను నిర్వహించడానికి రద్దీగా ఉండే విమానాశ్రయాలలో వ్యవస్థలను సాంకేతికంగా ఆధునీకరించడానికి ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కి విమానయాన మంత్రిత్వ శాఖ ఏమైనా సూచనలు ఇచ్చిందా అని ఈటల అడిగారు. నిర్వహణ, సైబర్ సెక్యూరిటీ ప్రోటోకాల్‌లలో లోపాలను గుర్తించడానికి ప్రభుత్వం విచారణను ఆదేశించిందా అని ప్రశ్నించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఏటీసీ వ్యవస్థ బలోపేతం చేయడానికి, సకాలంలో బ్యాకప్‌ను నిర్ధారించడానికి డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ ఏ చర్యలు తీసుకున్నదో వివరించాలని ఈటల కోరారు.

ఈటల రాజేందర్ ప్రశ్నలకు కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ సమాధానమిచ్చారు. ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నవంబర్ 6 న 11:00 గంటలకు ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ ఆటోమేషన్ సిస్టమ్, ఇతర వాటాదారులకు ఎయిర్ ట్రాఫిక్ సర్వీస్ (ఏటీఎస్) సందేశాల ప్రాసెసింగ్, డెలివరీలో అధిక జాప్యం జరిగినట్లు గమనించారు. ఫలితంగా ఫ్లైట్ ప్లాన్ తో సహా ఏరోనాటికల్ ఫిక్స్‌డ్ టెలికమ్యూనికేషన్ నెట్‌వర్క్ సందేశాల డెలివరీలో ఆలస్యం జరిగిందన్నారు. ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ నెంబర్ జారీ, ఎయిర్ డిఫెన్స్ క్లియరెన్స్‌లు జారీ చేశారు. దీంతో నవంబర్ 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు 397 విమానాలను షెడ్యూల్ చేసిన ప్రయాణీకుల నిష్క్రమణలలో ఆలస్యం జరిగింది వాస్తవమేనని తెలిపారు. ఇలాంటి ఘటనల మూలంగా ఉత్పన్నమయ్యే నష్టాలను లెక్కించడం సాధ్యం కాదని మంత్రి మురళీధర్ పేర్కొన్నారు.

భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికి, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రస్తుతం ఉన్న ఐపీ ఆధారిత ఆటోమేటిక్ మెసేజ్ స్విచింగ్ సిస్టమ్ స్థానంలో కొత్త ఎయిర్ ట్రాఫిక్ సర్వీసెస్ మెసేజ్ హ్యాండ్లింగ్ సిస్టమ్ ను ప్రవేశపెట్టిందన్నారు. అంతేకాకుండా, విమానాశ్రయాలలోని అన్ని కమ్యూనికేషన్, నావిగేషన్ మరియు సర్వైలెన్స్ పరికరాల స్థితి, కార్యాచరణ విశ్వసనీయత, నిర్వహణను అంచనా వేయడానికి వాటి సమగ్ర ఆడిట్‌ను నిర్వహించాలని ఏయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియానను ఆదేశించడం జరగిందన్నారు. ఏటీసీ పనితీరును మెరుగుపరచడానికి ఇప్పటికే ఉన్న డేటాబేస్ సర్వర్లను అప్‌గ్రేడ్ చేశారని మంత్రి మురళీధర్ సమాధానమిచ్చారు.