BRS Suspensions | బీఆర్ఎస్‌లో సంచలనాత్మక సస్పెన్షన్లు: అప్పట్లో నరేంద్ర, విజయశాంతి… నేడు కవిత
పార్టీలో కీలక స్థానాల్లో ఉన్న వారైనా సరే గులాబీ దళపతితో గ్యాప్ వస్తే పార్టీకి దూరంగా వెళ్లాల్సిన పరిస్థితులు వస్తాయనే చర్చ ఉంది. ఈ క్రమంలోనే గతంలో ఆలె నరేంద్ర, విజయశాంతి వంటివారిపై సస్పెన్షన్ వేటు పడింది. తాజాగా బీఆర్ఎస్ నాయకత్వంతో కవితకు కూడా గ్యాప్ వచ్చింది. అది కూడా బహిష్కరణకు దారి తీసింది.

BRS Suspensions | పార్టీలో కీలకంగా పనిచేసిన నాయకులపై బీఆర్ఎస్ నాయకత్వం పలు కారణాలతో గతంలో సస్పెన్షన్ వేటేసింది. ఆలె నరేంద్ర, విజయశాంతి వంటి నాయకులు ఇలా సస్పెన్షన్‌కు గురయ్యారు. అయితే ఈసారి మాత్రం ఇంటిబిడ్డ కవితపై చర్యలు తీసుకోవడం సంచలనం రేపింది. కేసీఆర్ భారత రాష్ట్ర సమితిని (అప్పట్లో తెలంగాణ రాష్ట్ర సమితి) ఏర్పాటు చేసిన తర్వాత ఆలె నరేంద్ర తన తెలంగాణ సాధన సమితిని బీఆర్ఎస్‌లో విలీనం చేశారు. బీఆర్ఎస్‌లో కేసీఆర్ తర్వాత నంబర్ టూ నాయకుడిగా చలామణీ అయ్యారు. కేంద్ర మంత్రివర్గంలో కేసీఆర్‌తోపాటు నరేంద్రకు కూడా చోటు దక్కింది. కేసీఆర్, నరేంద్రకు మధ్య కొంతకాలం బాగానే ఉంది. ఆ తర్వాత గ్యాప్ వచ్చింది. అదే సమయంలో కొన్ని ఆరోపణలు నరేంద్రపై వచ్చాయి. ఈ ఆరోపణలను ఆసరాగా చేసుకొని 2007 ఏప్రిల్ 27న నరేంద్రను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీనిపై తీవ్రంగా స్పందించిన నరేంద్ర.. కేసీఆర్ పై ఆరోపణలు చేశారు. తనపై వచ్చిన ఆరోపణలు కూడా కేసీఆర్ పై కూడా ఉన్నాయని విమర్శించారు.
మరో నంబర్ టూ నేత విజయశాంతి
తెలంగాణ సాధన కోసం విజయశాంతి సైతం సొంత పార్టీ పెట్టుకున్నారు. బీఆరెస్ ఏర్పాటు తర్వాత తన పార్టీని అందులో విలీనం చేశారు. బీఆరెస్‌లో తొలి సెక్రటరీ జనరల్ పోస్టులో కేసీఆర్ తర్వాత నంబర్ టూగా వెలుగొందారు. పార్టీ కార్యక్రమాల్లో కేసీఆర్‌తోపాటు ఆమెకు ప్రాధాన్యం ఉండేది. పలు యాగాల్లో ఆమెను తన పక్కనకూర్చొనబెట్టుకునేవారు. ఆమె ప్రతి రాఖీ పండుగకు కేసీఆర్‌కు రాఖీ కట్టేవారు. కానీ.. వారిద్దరి మధ్య కూడా గ్యాప్ వచ్చింది. అది.. 2014 ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఒక స్థాయిని దాటిపోయింది. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పాసైన తర్వాత సోనియాగాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్‌తో విజయశాంతి భేటీ అయ్యారు. అప్పటికే ఆమె కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం సాగుతున్న సమయం. దీనికి ఊతమిచ్చేలా ఆమె పటేల్‌తో సమావేశం కావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో 2013 ఆగస్టు 1న విజయశాంతిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ఆమె కాంగ్రెస్‌లో చేరారు.
మరో కీలక నేత ఈటల
తెలంగాణ ఉద్యమం సమయంలో బీఆర్ఎస్‌లో కీలక నేతగా ఈటల రాజేందర్ ఉన్నారు. కానీ.. పార్టీ రెండో దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత బయటకు రావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. 2018లో బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు వైద్య, ఆరోగ్య శాఖ పోర్ట్ ఫోలియోను కట్టబెట్టారు. అయితే ఈ సమయంలో రాజేందర్, కేసీఆర్ మధ్య కూడా గ్యాప్ వచ్చింది. గులాబీ జెండాకు తామే ఓనర్లమంటూ ఒకానొకదశలో ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో బీఆర్ఎస్ లో చర్చకు దారితీశాయి. ఆ సమయంలో ఈటలను కేటీఆర్ స్వయంగా వెంటబెట్టుకొని కేసీఆర్ వద్దకు తీసుకెళ్లారు. ఇద్దరి మధ్య గ్యాప్ తగ్గిందని అంతా భావించారు. కానీ, ఈటల రాజేందర్ పై ఆరోపణలు వచ్చాయని ప్రభుత్వం విచారణ నిర్వహించడం సంచలనం రేపింది. ఈ ఆరోపణలను రాజేందర్, ఆయన భార్య తోసిపుచ్చారు. దరిమిలా.. 2021 మేలో ఆయనను మంత్రిపదవి నుంచి కేసీఆర్ తప్పించారు. ఈ పరిణామాలతో రాజేందర్ బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పారు. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి, 2021 జూన్ 14న బీజేపీలో చేరారు.
తొలి డిప్యూటీ రాజయ్య
తెలంగాణ తొలి డిప్యూటీ సీఎంగా రాజయ్యకు కేసీఆర్ అవకాశం కల్పించారు. ఆయన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా వ్యవహరించారు. అయితే అప్పట్లో రాజయ్య వ్యవహారశైలిపై విమర్శలు వచ్చాయి. దీంతో రాజయ్యను 2015 జనవరి 15న కేబినెట్ నుంచి తప్పించారు. ఆ స్థానంలో అదే జిల్లాకు చెందిన కడియం శ్రీహరికి అవకాశం కల్పించారు.
సవాలు చేసినా సస్పెండ్ కాని డీఎస్
సుదీర్ఘ కాలం కాంగ్రెస్‌లో పనిచేసిన డీ శ్రీనివాస్ 2015 జూలై 2న బీఆర్ఎస్‌లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని డీఎస్ పై చర్యలు తీసుకోవాలని కేసీఆర్ కు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఆ పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసీఆర్‌ను కలిసేందుకు డీఎస్ ప్రయత్నించినా.. అప్పాయింట్‌మెంట్ లభించలేదు. 2019లో నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి అరవింద్ గెలుపు వెనుక డీఎస్ వ్యూహ రచన ఉందని అప్పట్లో ప్రచారం సాగింది. బీఆర్ఎస్ ఎంపీగా ఉన్నప్పటికీ పార్లమెంటరీ పార్టీ సమావేశాలకు కూడా ఆయన హాజరుకాలేదు. తనపై చర్యలు తీసుకోవాలని కూడా డీఎస్ ఒకానొక సందర్భంలో సవాల్ చేశారు. కానీ, ఆయనపై కేసీఆర్ చర్యలు తీసుకోలేదు. కానీ, కవిత విషయంలో మాత్రం కేసీఆర్ వెంటనే చర్యలు తీసుకున్నారు. కవిత వ్యవహారశైలితో రాజకీయంగా నష్టం జరుగుతోందనే భావన బీఆర్ఎస్ నాయకత్వంలో ఉంది. దీంతో చర్యలు తీసుకున్నారని గులాబీ పార్టీ నాయకులు చెబుతున్నారు.
పార్టీకి కేశవరావు రాంరాం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పీసీసీ చీఫ్‌గా పనిచేసిన కే కేశవరావు హస్తం పార్టీని వీడి బీఆర్ఎస్‌లో చేరారు. ఆయనకు కూడా కేసీఆర్ అంతటి ప్రాధాన్యం దక్కింది. బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ గా విజయశాంతి తర్వాత ఆ స్థానంలో కొనసాగారు. 2023లో బీఆర్ఎస్ తెలంగాణలో అధికారం కోల్పోయింది. ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీ నాయకులు కూడా ఇతర పార్టీలవైపు చూశారు. కాంగ్రెస్‌లో సుదీర్ఘకాలం కొనసాగిన కేశవరావు కూడా బీఆర్ఎస్‌ను వీడాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీగా దీపాదాస్ మున్షి ఉన్నసమయంలో కేశవరావుతో ఆమె భేటీ అయ్యారు. కాంగ్రెస్ లో కేశవరావు ఉన్న సమయంలో ఆయన బెంగాల్ సహా కొన్ని రాష్ట్రాలకు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీగా కొనసాగారు. ఈ పరిచయాలతో కేశవరావు దీపాదాస్ మున్షి భేటీ అయిన తర్వాత ఆయన బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పాలని నిర్ణయం తీసుకున్నారు. 2024 జూలైలో బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరారు.
గ్యాప్ వస్తే కీలక నేతలూ బయటికే
పార్టీలో కీలక స్థానాల్లో ఉన్న వారైనా సరే గులాబీ దళపతితో గ్యాప్ వస్తే పార్టీకి దూరంగా వెళ్లాల్సిన పరిస్థితులు వస్తాయనే చర్చ ఉంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నాయకత్వంతో కవితకు కూడా గ్యాప్ వచ్చింది. ఇది రోజు రోజుకు పెరిగింది. అదే సమయంలో బీఆర్ఎస్ తో సంబంధం లేకుండా తన రాజకీయ కార్యాచరణను తెలంగాణ జాగృతి ద్వారా ఆమె చేపట్టారు. కవిత వ్యాఖ్యలు రాజకీయంగా బీఆర్ఎస్ కు నష్టం చేస్తున్నాయనే భావన ఉంది. హరీశ్, సంతోష్ ను టార్గెట్ చేసుకొని విమరశలు చేసిన కవిత.. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని అంగీకరించేలా వ్యాఖ్యలు చేశారు. అటు కుటుంబ సభ్యులను వేలెత్తి చూపడంతోపాటు.. పార్టీకి నష్టం చేసేలా అవినీతి విషయంలో వ్యాఖ్యలు చేయడంతో ఇక అధినేత తన కూతురని కూడా చూడకుండా వేటు వేయాల్సి వచ్చింది.