Gattu Lift Irragation Project | ‘గట్టు’ ఎత్తిపోతల గట్టెక్కేనా! ఏడేళ్లుగా శంకుస్థాపనకే పరిమితం.. ‘గట్టు’పై దృష్టి పెట్టని సీఎం రేవంత్
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గట్టు మండలం అత్యంత కరువు ప్రాంతం. దీన్ని గుర్తించిన నాటి బీఆరెస్ ప్రభుత్వం.. ఈ ప్రాంతంలో ఎత్తిపోతల పథకం నిర్మిస్తే కరువును పారద్రోలే అవకాశం ఉందని భావించి.. గట్టు లిఫ్టుకు శంకుస్థాపన చేసింది. కానీ.. అది అక్కడితోనే ఆగిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ఎలాంటి మార్పు లేదని రైతులు విమర్శిస్తున్నారు.

Gattu Lift Irragation Project | (విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి) : ఉమ్మడి పాలమూరు జిల్లా ఎత్తిపోతల పథకాలకు గ్రహణం పట్టుకున్నట్టుంది. ఉమ్మడి జిల్లాలో చేపట్టిన ఎత్తిపోతల పథకాలన్నీ మధ్యలోనే ఆగిపోయి పాలకుల చేష్టలను ప్రశ్నిస్తున్నాయి. పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు పెద్దగా శ్రద్ద చూపలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికీ జిల్లాలో చేపట్టిన పాలమూరు.. రంగారెడ్డి, కొడంగల్, కల్వకుర్తి, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాలన్నీ అసంపూర్తి దశలో ఉన్నాయి. ఇవి ఎప్పుడు పూర్తి అవుతాయోనని ఈ ప్రాంత రైతులు ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం, ఉమ్మడి జిల్లాలోని కొడంగల్ నుంచి గెలిచిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో ప్రాజెక్టుల పనులు పరుగులుతీస్తాయని ఇక్కడి రైతులు ఆశపడ్డారు. కానీ రెండేళ్లు దాటుతున్నా.. పనులు ముందుకు సాగడం లేదు. ముఖ్యంగా కరువు ప్రాంత లిఫ్ట్‌లపై దృష్టి పెట్టకపోవడంతో సాగు భూములన్నీ బీడుభూములుగా మారుతున్నాయని రైతులు చెబుతున్నారు. ఈ పరిణామాలు రైతులను మళ్లీ వలసబాట పట్టిస్తున్నాయి.
అత్యంత కరువు ప్రాంతం గట్టు
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గట్టు మండలం అత్యంత కరువు ప్రాంతం. దీన్ని గుర్తించిన నాటి బీఆరెస్ ప్రభుత్వం.. ఈ ప్రాంతంలో ఎత్తిపోతల పథకం నిర్మిస్తే కరువును పారద్రోలే అవకాశం ఉందని భావించి.. గట్టు లిఫ్టుకు శంకుస్థాపన చేసింది. కానీ.. అది అక్కడితోనే ఆగిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ఎలాంటి మార్పు లేదని రైతులు విమర్శిస్తున్నారు.
గట్టు ఎత్తిపోతల పథకం :
జోగులాంబ గద్వాల జిల్లాలో అత్యంత వెనకబడిన ప్రాంతంలో ముఖ్యమైనది గట్టు. జూరాల, నెట్టెంపాడు, భీమా ఎత్తిపోతల పథకాలున్నా ఈ ప్రాంతానికి పెద్దగా ఉపయోగం లేకపోయింది. గట్టు ఎత్తైన ప్రాంతం కావటంతో వర్షాధార పంటలే ఆధారం. సక్రమంగా వర్షం కురిస్తేనే పంటలు చేతికి అందుతాయి. లేదంటే అప్పులు, వలస బాటలే. గట్టు ఎత్తిపోతల పూర్తయితే తమ ప్రాంతానికీ మేలు జరుగుతుందని ఆశించిన ప్రజలకు దశాబ్దాలుగా అది ఎన్నికల హామీగానే మిగిలిపోతున్నది.
2018 లో శంకుస్థాపన :
అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 2018 జూన్ నెలలో గట్టు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. రెండేళ్లలో నీళ్లందిస్తామని హామీ ఇచ్చారు. ర్యాలంపాడు జలాశయం నుంచి 2.80 టీఎంసీల నీటిని ఎత్తిపోయటం ద్వారా గట్టు ఎత్తిపోతల పథకానికి నీరివ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యం. రూ.580 కోట్ల వ్యయంతో పరిపాలన అనుమతులు వచ్చాయి. 1.32 టీఎంసీల నీటి నిలువ సామర్థ్యంతో జలాశయాన్ని నిర్మించనున్నారు. ఈ పనులు 18 నెలల్లో పూర్తి చేయాల్సి ఉన్నా నేటికీ ముందుకు సాగడం లేదు. ఈ పథకం పూర్తయితే ధరూరు, గట్టు, కేడీ దొడ్డి, మల్దకల్ మండలాల్లోని 21 గ్రామాల్లో ఉన్న 30వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. చెరువులు నింపడం ద్వారా మరో 3 వేల ఎకరాలకు నీరు అందించనున్నారు.
భూసేకరణ ఇబ్బంది లేనేలేదు
ప్రభుత్వ అలసత్వం తప్పా గట్టు ఎత్తిపోతల పథకానికి ఏ అడ్డంకి లేదని జిల్లాలోని సాగునీటి రంగ నిపుణులు చెబుతున్నారు. దీనికి 935 ఎకరాల భూమి అవసరం కాగా.. రైతులు 100 ఎకరాల్లోపు మాత్రమే పట్టా భూములు కోల్పోతున్నారు. దీంతో ప్రాజెక్టుకు భూసేకరణ సమస్య పెద్దగా లేదు. ప్రస్తుతం భూసేకరణ అవసరం లేని ప్రాంతాల్లోనే పనులు పెడింగ్‌లో ఉన్నాయి. భూసేకరణ సైతం పూర్తైతే పనులు చేపట్టేందుకు అవకాశం ఉంది. ఈ గట్టు ఎత్తిపోతల పథకం పూర్తవుతే ఈ ప్రాంతంలో వలసలకు బ్రేక్ పడుతుంది..ఇక్కడి సాగు పొలాలు పచ్చని పంట పొలాలుగా మారిపోతాయి. ఈ లిఫ్ట్ పూర్తి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు.