Satyavathi Rathod : కవిత పార్టీలో ఉంటే ఎంత..పోతే ఎంత
కవిత సస్పెండ్ పై BRS నేతలు స్పందన, కేసీఆర్ పార్టీకి ప్రాధాన్యం, సత్యవతి రాథోడ్, వివేకానంద్ వ్యాఖ్యలు, పార్టీ భవిష్యత్తుపై సందేశం.

విధాత, హైదరాబాద్ : పార్టీ గురించి చెడుగా మాట్లాడిన కవిత పార్టీలో ఉంటే ఎంత.. పోతే ఎంత అని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. తెలంగాణ భవన్ లో ఆమె మాజీ విప్ గొంగిడి సునీతతో కలిసి మీడియాతో మాట్లాడారు. కవిత వెనుక ఎవరో ఉండి మాట్లాడిస్తున్నట్లు మాకు అనిపిస్తోందని సత్యవతి రాథోడ్ అనుమానం వ్యక్తం చేశారు. కవితకు మా నాయకుడు కేసీఆర్ ఎన్నో అవకాశాలు ఇచ్చారు. ఒకసారి ఎంపీని చేశారు.. తర్వాత ఓడిపోయినా.. ఎమ్మెల్సీని చేశారు. కేసీఆర్ కుమార్తెగా కవితకు పార్టీలో గౌరవం దక్కింది. ఇవాళ అన్ని మర్చిపోయి పార్టీని, నాయకత్వాన్ని విమర్శిస్తున్నారన్నారు. కవితను సస్పెండ్ చేసి పేగుబంధం కంటే పార్టీని నమ్ముకున్న కోట్లాది కార్యకర్తలకే కేసీఆర్ ప్రాధాన్యం ఇచ్చారు అని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌తో కోట్ల మంది కలిసి నడిచారు. పార్టీకి జరుగుతున్న నష్టాన్ని నివారించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బతినకూడదని ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. కన్నబిడ్డల కంటే పార్టీ ఎక్కువని.. ఈ నిర్ణయంతో కేసీఆర్ చాటిచెప్పారన్నారు.
ముందే హెచ్చరించినా కవిత తన తీరు మార్చుకోనందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కంటే ఎవరూ ఎక్కువ కాదనే సందేశాన్ని కేసీఆర్ ఇచ్చారు. కవిత మాటలు లక్షలాది బీఆర్ఎస్ కార్యకర్తలను బాధపెట్టాయి. పార్టీ పెట్టినప్పటి నుంచి కేసీఆర్‌కు కుడిభుజంగా హరీశ్‌రావు ఉన్నారు. కొన్నాళ్లు కేటీఆర్‌పై విమర్శలు చేశారు. ఇప్పుడు హరీశ్‌రావుపై విమర్శలు చేశారు అని సత్యవతి రాథోడ్ గుర్తు చేశారు. మాకు కవిత కంటే పార్టీ, హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ లు ముఖ్యమన్నారు.
గొంగిడి సునిత మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అంటే.. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు హడల్ అన్నారు. అందుకే బీఆర్ ఎస్ ను బలహీన పరిచే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. మళ్లీ కేసీఆర్ కావాలి, బీఆర్ఎస్ రావాలని.. రాష్ట్ర ప్రజలు ఆకాంక్షిస్తున్నారన్నారు. కేసీఆర్ అంటే బీఆర్ఎస్.. బీఆర్ఎస్ అంటే కేసీఆర్. కేసీఆర్ తన ప్రాణాన్ని ఫణంగా పెట్టి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారన్నారు. కవిత భుజం మీద తుపాకీ పెట్టి ఎవరో కాలుస్తున్నారు. కాలగమనంలో అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు.
కవిత సస్పెండ్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం : వివేకానంద
ఎమ్మెల్సీ కవిత చేసే పనులతో బీఆర్ఎస్ కు నష్టం జరుగుతుందని గుర్తించి, పార్టీకి నష్టం కలిగించే వ్యక్తి ఎవరినైనా ఉపేక్షించేది లేదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని..ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఒక ప్రకటనలో తెలిపారు. కన్నకూతురు కంటే కూడా కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న కార్యకర్తల భవిష్యత్తు ముఖ్యమని కేసీఆర్ తీసుకున్న నిర్ణయం హర్షించదగ్గ విషయం. పార్టీ కంటే ఎవరు పెద్ద వారు కాదనే విషయం ఈ నిర్ణయంతో స్పష్టమైంది. ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డారు, ఈరోజు పార్టీ కోసం కన్న బిడ్డను కూడా వదులుకున్న గొప్ప నాయకుడు కేసీఆర్ అని కేపీ వివేకానంద్ అన్నారు.
మాజీ మంత్రలు జోగు రామన్న, ఎర్రబెల్లి దయాకర్ రావు, . ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, మాజీ విప్ గంప గోవర్ధన్, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిలు కవిన సస్పెన్షన్ నిర్ణయాన్ని స్వాగతించారు.