Kavitha : కేసీఆర్ పై ఒత్తిడి తీసుకొచ్చి నన్ను సస్పెండ్ చేయించారు

హరీష్ రావు కుట్రతో కవిత బీఆర్ఎస్ సస్పెన్షన్. కేసీఆర్ కూతురు సంచలన ఆరోపణలు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా ప్రకటన. తెలంగాణ రాజకీయాల్లో కలకలం

Kavitha : కేసీఆర్ పై ఒత్తిడి తీసుకొచ్చి నన్ను సస్పెండ్ చేయించారు

విధాత : హరీష్ రావు, సంతోష్ రావులు నా తండ్రిపై ఒత్తిడి తెచ్చి నన్ను సస్పెండ్ చేయించారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక తెలంగాణ అంటుందని..అదేదో తప్పయినట్లుగా..పార్టీకి వ్యతిరేకమైనట్లుగా చిత్రీకరించి నాపై కుట్రతో సస్పెండ్ చేయించారని కవిత ఆరోపించారు. సస్పెండ్ కు ముందు నాకు ఎలాంటి షోకాజ్ నోటీస్ గాని..వివరణ గాని కోరలేదన్నారు. 2024నవంబర్ 23న ఢీల్లీ లిక్కర్ వ్యవహారంలో నాపై పెట్టిన అక్రమ కేసుల నుంచి తీహార్ జైల్లో ఐదున్నర నెలలు ఉండి బయటకు వచ్చానన్నారు. ఆ తర్వాత 103రోజులుగా పార్టీ పరంగా, జాగృతి పరంగా పలు ప్రజాసమస్యలపై పోరాటాలు చేశానన్నారు. బీసీ రిజర్వేషన్లు, గురుకులాల సమస్య, తెలంగాణ తల్లి విగ్రహం మార్పు, బనకచర్ల, తెలంగాణ నీటీవనరులు, భధ్రాచలం ముంపు గ్రామాల సమస్యలు, నారాయణపేట భూ నిర్వాసితులు సమస్యలు, కాంగ్రెస్ ఎన్నికల హామీలపైన గులాబీ కండువా కప్పుకుని 47నియోజకవర్గాల్లో పార్టీ పరంగా చేశానని..అవి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలా అని ప్రశ్నించారు. ఒకసారి వాటిపై బీఆర్ఎస్ పెద్దలు ఆలోచించుకోవాలన్నారు.

సామాజిక తెలంగాణ అనడం తప్పా..

బీసీల కోసం పోరాటం చేస్తుంటే పార్టీ వ్యతిరేకంగా మాట్లాడతారంటారని..నేను కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకవచ్చే పోరాటాలు చేస్తుంటే హరీష్ రావు, సంతోష్ రావులు నాపై అవాకులు చివాకులు ప్రచారం చేశారన్నారు. సామాజిక తెలంగాణ సాధన కోసం కట్టుబడి ఉన్నానని అందులో తప్పేముందని కవిత వ్యాఖ్యానించారు. నేను నా తండ్రి కేసీఆర్ చిటికెన వేలు పట్టుకుని తెలంగాణ ఉద్యమంలో రాజకీయ ఓనమాలు నేర్చుకున్నానన్నారు. ఆ నాయకుడి స్ఫూర్తిగానే నేను సామాజిక తెలంగాణ కోసం మాట్లాడానన్నారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో దళితులకు మూడెకరాల భూమి ఇస్తానన్న కేసీఆర్ దగ్గరే నుంచే కదా సామాజిక తెలంగాణ ఎజెండా తెచ్చుకున్నానని.. బీసీలకు వృత్తి పరికరాలు అందించిన కేసీఆర్ కార్యక్రరమంల సామాజిక తెలంగాణ కాదా అని కవిత ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీకి సామాజిక తెలంగాణ అవసరం లేదా భౌగోళిక తెలంగాణ చాలా అని.. బంగారు తెలంగాణ కేసీఆర్ ఇచ్చిన నినాదమే కదా అని.. హరీష్ రావు, సంతోష్ రావు ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ కాదు కదా అని ..ప్రతి సమాజం బాగుంటేనే బంగారు తెలంగాణ అని కవిత అన్నారు.

కేటీఆర్ కు చెప్పిన స్పందన లేదు

పార్టీలో నాపై కుట్రలు జరుగుతున్నాయని తెలంగాణ భవన్ లోనే నేను చెబితే..103రోజుల నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ నుంచి స్పందన..ఫోన్ కూడా లేదన్నారు. కేటీఆర్ దగ్గర నుంచి ఇంత కమ్యూనికేషన్ గ్యాప్ ను తాను ఊహించలేదన్నారు. కేసీఆర్ కూతురిగా ఉన్న నేనే తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెడితే స్పందన లేదంటే.. ఇక సాధారణ నాయకుల పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాలన్నారు. అయితే సస్పెండ్ నోటీసు రాగానే..తెలంగాణ భవన్ లో ఐదుగురు మహిళలు నాపై స్వేచ్చగా మాట్లాడారని..ఇటువంటి అంతర్గత ప్రజాస్వామ్యం రావాలనే నా కోరిక అని..అది నాకు చాలా సంతోషంగా ఉందని కవిత చెప్పారు.

రేపు మీకు ఇదే పరిస్థితి రావచ్చు..మీ చుట్టు ఏం జరుతుందో తెలుసుకోండి

హరీష్ రావు పార్టీలో ఉండి కేవలం డబ్బు సంపాదించుకోవాలని, వ్యక్తిగత లబ్ది పొందాలనే ఆలోచనతో ఉన్నారని..నేను, కేటీఆర్, కేసీఆర్ కలిసి ఉండొద్దని..మా కుటుంబం విచ్చిన్నమైతేనే వాళ్లకు నడుస్తుందని సాగించిన కుట్రలో భాగంగా నన్ను మొదటి శత్రువగా పార్టీ నుంచి బయట పడేశారన్నారు. దైవసమానమైన కేసీఆర్ కు ఈ సందర్బంగా నేను కోరుతున్నాననని..దయచేసి మీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోండని కవిత కోరారు. నన్ను బయట పంపొచ్చు కాని..నన్ను బలి చేయవచ్చు కాని.. రేపటినాడు ఇదే ప్రమాదం మీకు కూడా పొంచి ఉండవచ్చని కేసీఆర్, కేటీఆర్ ను కవిత హెచ్చరించారు. అల్టిమేట్ గా బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవడానికి జరుగుతున్న కుట్రలో బాగానే నాపై హరీష్ రావు వేటు వేయించాడని కవిత ఆరోపించారు.

ఒకే విమానంలో ప్రయాణించినప్పటికి నుంచి కుట్రలు షురు

సీఎం రేవంత్ రెడ్డి, హరీష్ రావులు కలిసి విమానంలో ప్రయాణించినప్పటి నుంచి నాపైన, మా కుటుంబాన్ని విచ్చిన్నం చేసే కుట్రలు ప్రారంభమయ్యాయన్నారు. నేను రేవంత్ రెడ్డిని, హరీష్ రావును ఛాలెంజ్ చేస్తున్నానని..వారిద్దరు ఒకే విమానంలో ప్రయాణించారా లేదా అన్న సంగతి స్పష్టం చేయాలని కవిత డిమాండ్ చేశారు. ఆ సమయంలోనే రేవంత్ రెడ్డికి హరీష్ రావు సరెండరైపోయి కేసీఆర్ కుటుంబంపై కుట్రలు ప్రారంభించాడని కవిత ఆరోపించారు. హరీష్ రావు పాల డైయిరీ నుంచి గురుకులాలకు పాలుసరఫరా జరుగుతున్నాయని..దానిపై కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి చర్యలు లేని.. రంగనాయక సాగర్ దగ్గర ప్రభుత్వం భూమిని ఆక్రమించి హరీష్ రావు ఫామ్ హౌస్ కట్టారని ఆరోపించిన రేవంత్ రెడ్డి ఆ మరుసటి రోజు నుంచే దానిపై ఎందుకు మాట్లాడలేదని కవిత ప్రశ్నించారు. అదే కేటీఆర్ పైన ఎన్ని కేసులు..విచారణలో ఆలోచించాలని..ఇదంతా రేవంత్ రెడ్డికి, హరీష్ రావుల మధ్య అవగాహానకు నిదర్శనమన్నారు. కాళేశ్వరం అవినీతి మీద కేసీఆర్ ని టార్గెట్ చేస్తున్నారే తప్ప.. ఆనాటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావుపై మాత్రం ఎలాంటి విమర్శలు చేయరన్నారు. తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు స్థలం మార్చి, డిజైన్లు, అనుమతులలో కీలకంగా ఉన్న హరీష్ రావు పై ఎందుకు రేవంత్ రెడ్డి విమర్శలు చేయరని ప్రశ్నించారు. ఇదంతా వారి మ్యాచ్ ఫిక్స్ కు నిదర్శనమన్నారు. ఎంతసేపు కేసీఆర్ కుటుంబం లక్ష కోట్లు తిన్నదంటారని..ఆ ప్రాజెక్టు ఖర్చు కూడా అంత కాలేదని…అలాంటప్పుడు లక్షకోట్లు ఎలా తిన్నారని కవిత ప్రశ్నించారు. హరీష్ రావు అవినీతి కారణంగానే కేసీఆర్ సీబీఐ విచారణ ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు.

కేటీఆర్ వారితో జాగ్రత్త

హరీష్ రావు, సంతోష్ రావులు ఇవ్వాళ కేటీఆర్ తో బాగున్నట్లుగా నటిస్తున్నారని..వారు నిజానికి కేసీఆర్ మంచిని, నీ మంచిని, తెలంగాణ సమాజం మంచి కోరుకునే వారు కాదని కేటీఆర్ ను కవిత హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమంలో హరీష్ రావు మొదటి నుంచి లేరని…కేసీఆర్ డిప్యూటీ స్పీకర్ కు రాజీనామా చేసి టీడీపీ నుంచి వస్తుంటే వద్దని హరీష్ రావు అడ్డుకుని కోటిన్నర రూపాయాలు తీసుకుని వ్యాపారం చేసుకునేందుకు వెళ్లిపోయి..పది నెలల తర్వాతా ఉద్యమంలోకి వచ్చాడని కవిత గుర్తు చేశారు. ఉద్యమంలో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు హరీష్ రావు ఆనాడు వైఎస్. రాజశేఖర్ రెడ్డితో కుమ్మక్కయ్యాడని కవిత ఆరోపించారు. ఆయన ఆరడుగుల బుల్లెట్, ట్రబుల్ షూటర్ అనుకుంటున్నారని..బబుల్ షూటర్ మాత్రమేనని..ట్రబుల్స్ సృష్టించి పరిష్కరించినట్లుగా నటిస్తాడని కవిత విమర్శించారు. ఆరడుగుల బుల్లెట్ ఇప్పుడు నన్ను గాయపరిచిందని..రేపు కేటీఆర్ ను గాయపరుస్తుందన్నారు.

ట్రబుల్ షూటర్ కాదు..బబూల్ షూటర్

ఇటీవల దాసోజు శ్రవణ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి బలం లేకున్నా పార్టీ నుంచి రెండో అభ్యర్థిగా పెట్టాలని హరీష్ రావు సలహా ఇచ్చాడన్నారు. ఇప్పటికి హరీష్ రావు ఓ పక్క కాంగ్రెస్, మరో పక్క బీజేపీ నేతలతో సంప్రదింపులు కొనసాగిస్తున్నాడన్నారు. 2018 ఎన్నికల్లో 2మంది ఎమ్మెల్యేలకు ఫండింగ్ చేశాడని..అదంత నూరు శాతం కాళేశ్వరం అవినీతి సొమ్ము అని కవిత ఆరోపించారు. ఆ ఎన్నికల్లో మెజార్టీ అటు ఇటు అయితే తన ఎమ్మెల్యేలతో గేమ్ ఆడాలనుకున్నాడని కవిత వెల్లడించారు. సిరిసిల్లలో కేటీఆర్ ను ఒడగొట్టేందుకు ప్రత్యర్థికి రూ.60లక్షలు హరీష్ రావు ఇచ్చాడని..నిజమాబాద్ లో ఎంపీగా నన్ను ఓడించాడని, గజ్వేల్ లో కేసీఆర్ ను ఓడించేందుకు ప్రయత్నించాడని కవిత ఆరోపించారు. హరీష్ రావుకు కేసీఆర్ కుటుంబం విచ్చిన్నం కావాలి…కాని కేసీఆర్ తో వచ్చే ప్రయూజనాలు అందుకోవాలన్న ఆలోచనే ఉందన్నారు.

హరీష్ రావు కారణంగానే వారంతా పార్టీకి దూరం

హరీష్ రావు కారణంగానే ఇప్పటిదాకా జగ్గారెడ్డి, విజయశాంతి, రఘునందన్ రావు, ఈటల రాజేందర్ వరరకు అంతా పార్టీ నుంచి వెళ్లిపోయానన్నారు. దుబ్బాకలో పార్టీని ఓడించడానికి ప్రయత్నించి..మీడియాలో దుబ్బాక లో హరీష్ ఒంటరి పోరాటం అని రాయించుకున్నాడని కవిత ఆరోపించారు. కేటీఆర్ కూడా అలాంటి స్కిల్స్ నేర్చుకోవాలని కవిత సలహా ఇచ్చారు. హూజూర్ నగర్ ఉప ఎన్నికలోనూ రేవంత్ రెడ్డితో కుమ్మక్కై ఈటల రాజేందర్ గెలుపుకు హరీష్ రావు సహకరించాడని కవిత ఆరోపించారు. చెప్పుడు మాటలతో నా వివరణ తీసుకోకుండా నన్ను సస్పెండ్ చేశారని.. నా లేఖ లీక్ చేసిన వ్యక్తులపై ఎందుకు విచారణ జరగలేదు? నా వివరణ తీసుకోకుండా డైరెక్ట్ గా ఉరి వేశారని..కానీ నేను ఫిర్యాదు చేసిన వ్యక్తులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో నాకు తెలియాలని కవిత డిమాండ్ చేశారు.

కేసీఆర్ నీడలో సంతోష్ రావు భారీ అవినీతి

పెద్దసార్ కేసీఆర్ కు నీడలాగా సంతోష్ రావు ఉంటాడని.. కూరలో ఉప్పు..చెప్పులో రాయి…చెవిలో జొర్రీగా మాదిరగా తయారై తన ధన దాహానికి కేసీఆర్ ను వాడుకున్నాడన్నారు. కేటీఆర్ నియోజకవర్గం నేరెళ్లలో దళిత బిడ్డ చనిపోతే ఏడుగురు దళిత బిడ్డల్ని సీఎంవో నుంచి సంతోష్ రావు ఫోన్ చేసి పోలీసులతో కొట్టించాడని..దీంతో కేటీఆర్ బద్నామ్ అయ్యాడని కవిత వెల్లడించారు. ఇక టానిక్, బ్రూఫిన్ కంపెనీ కేసులు రేవంత్ రెడ్డితో ఉన్న మ్యాచ్ ఫిక్సింగ్ తో వెంటనే మూతపడిపోయాయన్నారు. తెలంగాణకు హరితహారం అని కేసీఆర్ ఓ మంచి కార్యక్రమాన్ని అమలు చేస్తే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అంటూ సంతోష్ రావు నకిలీ కార్యక్రమం పెట్టి సినిమా వాళ్లతో సొంత ప్రచారం చేయించుకున్నాడని…తన కోసం అటవీ నిర్మాణాలంటూ 10శాతం జీవో తెచ్చుకున్నాడని కవిత ఆరోపించారు. సంతోష్ రావు క్లాస్ మెట్ ఎమ్మల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మెగా కృష్ణా రెడ్డితో కలిసి మోకిలాలో రూ.750కోట్ల విల్లా చేస్తున్నాడని..అంత డబ్బు వాళ్లకు ఎక్కడి నుంచి వచ్చిందని..అదంతా అవినీతి డబ్బులేనని కవిత తెలిపారు. సంతోష్ రావు మరో మిత్రుడు నవీన్ రావుకు, పోచంపల్లికి ఎమ్మెల్సీ పదవులు, కాంట్రాక్టులు ఎట్లా వచ్చాయని కవిత ప్రశ్నించారు. వాళ్ల ఇళ్ల అడ్రస్ లు ఏసీబీకి ఎందుకు దొరకడం లేదని కవిత ప్రశ్నించారు. కేసీఆర్ నుంచి ఎమ్మెల్సీ పదవి పొందిన నవీన్ రావు నాకు దేవుడు సంతోష్ రావు అంటాడని కవిత విమర్శించారు. ఫామ్ హౌస్ కేసును నవీన్ రావు ముఖ్యమంత్రి కాళ్లు పట్టుకుని మాఫీ చేయించుకున్నాడన్నారు. ఒకపక్క సంతోష రావు, మరో పక్క హరీష్ రావులు సీఎం రేవంత్ రెడ్డితో, బీజేపీ వారితో కుమ్మక్కై కేసీఆర్ ను జలగల్లాగా పట్టి పీడిస్తున్నారన్నానరు. పోయేదాకా వచ్చింది

పార్టీ కోసం 20ఏళ్లు కష్టపడ్డాను

తన వయసులో 20సంవత్సరాలు బీఆర్ఎస్ తోనే సాగిందని..ఇప్పుడు బీఆర్ఎస్ తో నీకేం సంబంధం అంటు నాకు సస్పెండ్ లెటర్ పంపించారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకలు బతుకమ్మ, బోనాల సంస్కృతిని గొప్పగా నిలబెట్టానన్నారు. మీరు మేక వన్నె పులుల మాటలు నమ్మి మీ కూతురైన నన్ను సస్పెండ్ చేసిన పర్వాలేదుగాని.. వాళ్లను పార్టీలో ఉంచుకుంటే పార్టీ ఎట్లుంటదో మీరు ఆలోచించుకోండి అని కేసీఆర్ కు కవిత హెచ్చరించారు. తాత్కాలికంగా అబద్దాలు, మోసాలు గెలవ వచ్చని.. నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతానని.. ఖచ్చితంగా దేవుడు వాళ్లకు అంతకు అంత అనుభవం లోకి తెస్తాడని కవిత వ్యాఖ్యానించారు.

భవిష్యత్ రాజకీయ కార్యచరణపై త్వరలో ప్రకటన

నేను ఏ పార్టీలో చేరబోనని..ఏ పార్టీ అవసరం నాకు లేదని..నా భవిష్యత్తు రాజకీయ కార్యాచరణను తెలంగాణ మేధావులు, బీసీ, జాగృతి సంఘాలు, అన్ని వర్గాల ప్రజలతో కలిసి చర్చించి త్వరలోనే ప్రకటిస్తానన్నారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ పదవికి స్పీకర్ ఫార్మెట్ లో రాజీనామా చేస్తున్నానని..మండలి చైర్మన్ కు రాజీనామా లేఖ పంపిస్తున్నానని తెలిపారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని, కేసీఆర్ కు, తెలంగాణ భవన్ రావుల చంద్రశేఖర్ రెడ్డికి రాజీనామా లేఖను పంపిస్తున్నానని తెలిపారు. నేను పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదని..తెలంగాణ ఉద్యమంలో నాన్నకు అండగా ఉండేందుకు వచ్చానన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఇప్పటికైనా కేసీఆర్ కుటుంబంపై జరుగుతున్న కుట్రలను గమనించాలని కవిత కోరారు.