పంపకాల గొడవలే కారణం… కాళేశ్వరం లాగే బీఆర్ఎస్ ముక్కలు

కవిత సస్పెండ్‌పై బీజేపీ, కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు: బీఆర్ఎస్ అవినీతీ, కుటుంబ గొడవల కారణంగా సస్పెన్షన్.

పంపకాల గొడవలే కారణం… కాళేశ్వరం లాగే బీఆర్ఎస్ ముక్కలు

కవిత సస్పెండ్ పై బీజేపీ, కాంగ్రెస్, టీజేఎస్ నేతల స్పందన

విధాత, హైదరాబాద్ : బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ కవిత సస్పెండ్ అంశంపై కాంగ్రెస్, బీజేపీ పార్టీలు స్పందించాయి. కవిత సస్పెండ్ విషయం పూర్తిగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిందని బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని బీజేపీ ముందు నుంచి చెప్తూనే ఉందన్నారు. సొంత కుటుంబంపై కవిత ఆరోపణలతో అవినీతి జరిగిందనేది పూర్తిగా స్పష్టమైందన్నారు. అవినీతి సొమ్ము పంపకాల విషయంలో గొడవలు జరగడంతోనే కవిత సస్పెండ్ కు దారి తీసిందని రామచంద్రరావు వ్యాఖ్యానించారు.

బీఆర్ఎస్ అంతర్గత వ్యవహారం : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెండ్ అంశం పూర్తిగా బీఆర్‌ఎస్ అంతర్గత వ్యవహారమని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. కేసీఆర్ కుటుంబంలో చోటుచేసుకున్న పరిణామాలతో మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆస్తులు, వాటాల్లో వారి మధ్య తగాదాలున్నాయని గతంలోనే తాను చెప్పినట్లు గుర్తు చేశారు. ఆ తగాదాలే సస్పెన్షన్‌కు దారి తీసి ఉండొచ్చన్నారు. కేసీఆర్‌ కుటుంబం కూడా అవినీతిలో కూరుకుపోయిందన్నారు. మేం గతం నుంచి బీఆర్ఎస్ హాయంలో అవినీతి జరిగిందని..కాళేశ్వరం నిర్మాణంలో అక్రమాలు జరిగాయని చెబుతున్నామని..దాన్ని బలపరిచేలా కవిత వ్యాఖ్యలు ఉన్నాయన్నారు.

కాళేశ్వరం మాదిరిగానే బీఆర్ఎస్ ముక్కలైంది : ఎంపీ లక్ష్మణ్

మొన్న కాళేశ్వరం కూలింది..కాళేశ్వరం మూడు పిల్లర్లు కూలినట్లే…బీఆర్ఎస్ మూడు ముక్కలైందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు కే.లక్ష్మణ్ అన్నారు. కాగ్ నివేదిక, విజిలెన్స్ రిపోర్టులు అన్నీ కాళేశ్వరంలోని అవినీతిని స్పష్టంగా చూపిస్తున్నాయన్నారు. కవితే స్వయంగా హరీశ్ రావు, సంతోశ్ అవినీతికి పాల్పడ్డారని చెప్పిందని..వారిని ‘ఆనకొండలు’గా సంబోధించిందన్నారు. అలా అయితే కేసీఆర్ కూడా అవినీతిలో భాగస్వామే కాదా? అని ప్రశ్నించారు. అవినీతి సొమ్ములో వాటాల పంచాయతీనే కవిత సస్పెండ్ వ్యవహారమని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.

పంపకాల గొడవతోనే కవిత సస్పెండ్ : కోదండరామ్

కాళేశ్వరం సహా బీఆర్ఎస్ హాయంలో జరిగిన అవినీతి సొమ్ము వాటాల పేచితోనే కల్వకుంట్ల కుటుంబంలో విభేదాలు నెలకొని కవిత సస్పెండ్ పరిణామమని టీజీఎస్ అధ్యక్షుడు కోదండరామ్ అన్నారు. కాళేశ్వరం అక్రమాల నేపథ్యంలో సొంత కుటుంబ సభ్యులపై కవిత చేసిన వ్యాఖ్యలతో అవినీతి జరిగిందని తెలిపోయిందన్నారు.

పంపకాల్లో తేడా వల్లే గొడవలు : పాల్వాయి హరీశ్

పంపకాల్లో తేడాలతోనే కల్వకుంట్ల కుటుంబంలో విభేదాలు ఏర్పడి కవిత సస్పెన్షన్ కు దారితీసిందని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ అన్నారు. హరీశ్ రావు, సంతోష్ రావులు కేసీఆర్‌ను నిండా ముంచారన్నారు. కాళేశ్వరంతో సహా అవినీతి సొమ్మును అడ్డగోలుగా సంపాదించి ఎక్కడ పెట్టాలో తెలియక కుటుంబంలో లుకలుకలు నెలకొన్నాయని విమర్శించారు.