Bhatti Vikramarka : ప్రజా సమస్యలపై పోరాడే విధానాన్ని వైఎస్ఆర్ నుంచి నేర్చుకున్నా

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రజా సమస్యలపై పోరాటాన్ని వైఎస్ఆర్ నుంచి నేర్చుకున్నట్లు, వ్యవసాయ, ఆరోగ్య పథకాలపై వివరణ.

Bhatti Vikramarka : ప్రజా సమస్యలపై పోరాడే విధానాన్ని వైఎస్ఆర్ నుంచి నేర్చుకున్నా

ప్రజా సమస్యలపై పోరాడే విధానాన్ని వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచే నేర్చుకున్నానని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్ లో వైఎస్ఆర్ మెమోరియల్ అవార్డుల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కొన్ని నెలల పాాటు పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను వైఎస్ఆర్ తెలుసుకున్నారన్నారు. రైతుల సమస్యలు తెలుసుకుని ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేశారని ఆయన చెప్పారు. సాగుకు ఉచిత విద్యుత్ అనేది కాంగ్రెస్ పార్టీ బ్రాండ్ అని ఆయన అన్నారు. దేశంలో రైతులకు ఉచిత విద్యుత్ కు శ్రీకారం చుట్టింది కాంగ్రెసేనని ఆయన అన్నారు. రోగాలబారిన పడిన పేదలను ఆదుకొనేందు ఆరోగ్యశ్రీని వైఎస్ఆర్ తీసుకువచ్చారని ఆయన తెలిపారు. పేదలకు కూడా కార్పోరేట్ విద్య, వైద్యం అందాలని వైఎస్ఆర్ కోరుకున్నారని ఆయన గుర్తు చేశారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాలు ఇవాళ అన్ని ప్రభుత్వాలకు మార్గదర్శకాలు అని ఆయన చెప్పారు. ఇల్లు లేని పేదవాడు ఉండొద్దనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని చేపట్టినట్టు డిప్యూటీ సీఎం తెలిపారు. వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలోనే గ్రామాల్లో పేదలకు లక్షలాది ఇళ్ల నిర్మాణం జరిగిందని ఆయన చెప్పారు. వైఎస్ఆర్, కేవీపీ తనకు మంచి మిత్రులు అని ఆయన అన్నారు. సుభాష్ పాలేకర్ వ్యవసాయంలో ఎంతో సేవ చేస్తూ రైతులకు అవగాహన కల్పిస్తున్నారన్నారు. వినూత్న సాగు పద్దతులపై రైతులకు అవగాహన కల్పిస్తున్న డాక్టర్ సుధ దంపతులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.వైఎస్ఆర్ జ్ఙాపకార్థం వ్యవసాయ సంబంధిత అవార్డు ఇవ్వడం హర్షణీయమని ఆయన అన్నారు. వ్యవసాయం అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఎంతో ఇష్టమని ఆయన గుర్తు చేశారు.