Bhatti Vikramarka | జనపథంలో పీపుల్స్ మార్చ్.. ప్రజాపాలనలో భట్టి అడుగుజాడలు..!
రాజకీయాల్లో పాదయాత్ర అనేది కేవలం ఒక ప్రచారం కాదు.. అది ప్రజల ఆత్మీయ స్పర్శ. అధికారం కోసం అడుగులు వేయడం వేరు, సామాన్యుడి కష్టాలను కళ్ళారా చూస్తూ వారి కన్నీళ్లు తుడవడానికి అడుగులు వేయడం వేరు. సరిగ్గా మూడేళ్ల క్రితం ఇదే సిద్ధాంతాన్ని పుణికిపుచ్చుకుని, తెలంగాణ రాజకీయ యవనికపై 'పీపుల్స్ మార్చ్' పేరుతో ఒక చారిత్రాత్మక అధ్యాయాన్ని లిఖించారు ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి (నాటి సి ఎల్ పి నేత) మల్లు భట్టి విక్రమార్క.
(దుడుక రామకృష్ణ, డిప్యూటీ సీఎం పీఆర్‌వో)
Bhatti Vikramarka | 2023, మార్చి 16న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బజార్‌హత్నూర్ మండలం, పిప్పిరి గ్రామం ఒక చారిత్రక ఘట్టానికి వేదికైంది. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్రావు ఠాక్రే పచ్చజెండా ఊపి ప్రారంభించిన ఈ యాత్ర, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మలుపు తిప్పుతుందని అప్పట్లో ఎవరూ ఊహించలేదు. ‘హాథ్ సే హాథ్ జోడో అభియాన్’లో భాగంగా సాగిన ఈ ప్రయాణం, ఆదిలాబాద్ లో మొదలై ఖమ్మం గడ్డపై ముగిసే వరకు ఒక నిశ్శబ్ద విప్లవంలా సాగింది. సుమారు 108 రోజుల పాటు అలుపెరగకుండా సాగిన ఈ మహా ప్రస్థానంలో భట్టి విక్రమార్క ఏకంగా 1,365 కిలోమీటర్ల మేర నడిచారు. ఈ క్రమంలో 17 జిల్లాలు, 36 అసెంబ్లీ నియోజకవర్గాలను తాకుతూ ఆయన వేసిన ప్రతి అడుగు ప్రజా చైతన్యాన్ని రగిలించింది. జూలై 2న ఖమ్మంలో జరిగిన భారీ బహిరంగ సభకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరై, ఈ యాత్ర విజయవంతమైన తీరును కొనియాడారు.
అడవి బిడ్డల ఆత్మీయత.. పేదల భరోసా
ఈ సుదీర్ఘ ప్రయాణం పూల బాట కాదు. మండే ఎండలు, అడవి దారులు, కుగ్రామాల మధ్య సాగిన ఈ ‘పీపుల్స్ మార్చ్’లో భట్టి విక్రమార్క ప్రజలతో మమేకమయ్యారు. ఆదివాసీ గూడాల్లో మహిళలు తమ సంప్రదాయ పానీయాలను అందిస్తూ ఆయనకు నీడగా నిలిచారు. మసిబారిపోయిన పేదల బతుకులకు, నిరుద్యోగ యువతకు, కష్టాల్లో ఉన్న రైతులకు “నేనున్నాను” అనే భరోసాను ఈ యాత్ర కల్పించింది. 18కి పైగా భారీ బహిరంగ సభలు, వందలాది ముఖాముఖి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని రగిలించారు. అప్పటి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ, సామాన్యుడి గొంతుకగా భట్టి నిలిచారు.
సమస్యల నుంచే పుట్టిన ‘ఆరు గ్యారంటీలు’
ఈ పాదయాత్ర కేవలం రాజకీయ ప్రచారం కాదు, అదొక అధ్యయనం, రైతుల కన్నీళ్లు, నిరుద్యోగుల ఆవేదన, మహిళల అవసరాలను భట్టి స్వయంగా గమనించారు. పాదయాత్రలో ప్రజలు మొరపెట్టుకున్న కోట్లాది సమస్యలే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఆరు గ్యారంటీలకు’ మూల కారణం. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రూపొందించిన ఈ హామీలు నేడు తెలంగాణలో సంక్షేమ విప్లవాన్ని తీసుకువస్తున్నాయి.
అధికారం వచ్చినా వీడని అనుబంధం
సాధారణంగా పదవి వచ్చాక నాయకులు పాత పరిచయాలను మర్చిపోతుంటారు. కానీ భట్టి విక్రమార్క శైలి వేరు. తన పాదయాత్రలో తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరిని ఆయన ‘పాదయాత్ర బంధువులు’గా పిలుచుకుంటారు. తాజాగా తన కుమారుడి వివాహ వేడుకకు పాదయాత్రలో తన వెంట నడిచిన సాధారణ కార్యకర్తలను, ప్రజలను సాదరంగా ఆహ్వానించి తన నిబద్ధతను, మానవత్వాన్ని చాటుకున్నారు.
సమిధ నుంచి సారథి వరకు..
ఒక సాధారణ కార్యకర్తగా ప్రస్థానాన్ని ప్రారంభించి, నేడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను శాసించే స్థాయికి ఎదిగిన భట్టి విక్రమార్క ప్రయాణం స్ఫూర్తిదాయకం. పాదయాత్రలో ఆయన విన్న కష్టాలే నేడు ప్రభుత్వ నిర్ణయాల్లో ప్రతిబింబిస్తున్నాయి. సుమారు 8 లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో ఉన్న ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నం ప్రశంసనీయం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంటు ఉండదన్న విమర్శకుల నోళ్లకు తాళం వేస్తూ, కంటి రెప్పపాటు కూడా అంతరాయం లేకుండా నేడు తెలంగాణలో విద్యుత్ వెలుగులు విరజిల్లుతున్నాయి. ఈ నెలలో రికార్డు స్థాయి డిమాండ్ 18,228 మెగావాట్లు ఉన్నప్పటికీ, కోతలు లేకుండా సరఫరా చేయడంలో ఆయన అంకితభావం కనిపిస్తుంది.
ప్రజా పాలనే పరమావధి
పాదయాత్రలో ప్రజల కష్టాలను చూసిన భట్టి విక్రమార్క, ఆ ప్రజల కన్నీళ్లను తుడవడానికి ప్రజా పాలనలో ఉప ముఖ్యమంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా ఆర్థిక పునాదులను పటిష్టం చేస్తూ సంక్షేమ పథకాలకు నిధుల కొరత లేకుండా ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. రాష్ట్రంలోని 91 లక్షల రేషన్ కార్డుల ద్వారా దాదాపు 3.15 కోట్ల మందికి ప్రతి నెలా 6 కిలోల చొప్పున నాణ్యమైన సన్న బియ్యాన్ని ప్రభుత్వం పూర్తి ఉచితంగా పంపిణీ చేస్తోంది. ఈ పథకం కోసం ప్రభుత్వం ఏడాదికి సుమారు ₹13,523 కోట్లు వెచ్చిస్తోంది. గతంలో పంపిణీ చేసిన దొడ్డు బియ్యంతో పోలిస్తే, సన్న బియ్యం వల్ల ప్రభుత్వంపై అదనంగా ₹2,858 కోట్ల ఆర్థిక భారం పడుతున్నప్పటికీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు నిధుల మంజూరులో చొరవ చూపిస్తున్నారు. ప్రతి నెలా 1.85 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ ద్వారా పేదలకు నాణ్యమైన ఆహారం అందడమే కాకుండా, సన్న బియ్యం పండించే రైతులకు క్వింటాకు ₹500 బోనస్ ఇచ్చి ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ధరణి పేరుతో గత ప్రభుత్వం సృష్టించిన భూ చిక్కులు రైతులను కోర్టుల పాలు చేశాయి. ఆనాడు ప్రతిపక్ష నేతగా ‘ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తాం’ అని ఇచ్చిన హామీని, ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క నేడు నెరవేర్చారు. ధరణి స్థానంలో అత్యాధునిక ‘భూభారతి’ వ్యవస్థను ప్రవేశపెట్టి, అధికారాల వికేంద్రీకరణ ద్వారా తహసీల్దార్లకే సమస్యల పరిష్కార అధికారాన్ని అప్పగించారు. నాటి పాలనలో రైతులు న్యాయస్థానాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తే, నేడు భట్టి విక్రమార్క చొరవతో అధికారులే నేరుగా రైతు సమస్యలను పరిష్కరిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ఆర్థిక స్థితిని చక్కదిద్దే క్రమంలో, గతంలో 10% నుండి 11% వరకు ఉన్న అధిక వడ్డీ రుణాలను బ్యాంకర్లతో చర్చించి 8% నుండి 9% కి తగ్గించగలిగారు. వడ్డీ రేట్లలో వచ్చిన ఈ మార్పు వల్ల ఏడాదికి సుమారు ₹400 కోట్ల నుండి ₹600 కోట్ల వరకు వడ్డీ భారం తగ్గినట్లు ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి. వైద్య రంగంలోనూ విప్లవాత్మక మార్పులు చేస్తూ ఐదు లక్షల రూపాయల బీమా ఉన్న రాజీవ్ ఆరోగ్యశ్రీని ₹10 లక్షలకు పెంచారు. రాష్ట్రంలో కోటి 15 లక్షల కుటుంబాలు ఉండగా, కోటి ఆరు లక్షల కుటుంబాలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతోంది. ఈ ఏడాది ప్రభుత్వ ఆసుపత్రులను నిర్మాణం పూర్తి చేసి 12 వేల బెడ్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చే లక్ష్యంతో ముందుకు సాగడానికి భట్టి విక్రమార్క ఆర్థిక క్రమశిక్షణ ఫలితమే. పాదయాత్ర సమయంలో గ్రూప్-1 పేపర్ లీకేజీ వల్ల నిరుద్యోగులు పడుతున్న ఆవేదనను చూసి చలించిన ఆయన, అధికారంలోకి రాగానే టీఎస్‌పీఎస్సీని సంపూర్ణంగా ప్రక్షాళన చేశారు. పారదర్శకమైన విధానంలో ఇప్పటివరకు 70,000 ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగుల జీవితాల్లో కొత్త ఆశలు కల్పించారు.
గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం వల్ల రాష్ట్రంలో 52,82,494 మందికి లబ్ధి చేకూరుతోంది. ఇందుకోసం ప్రభుత్వం లబ్ధిదారుల తరఫున ₹3,593 కోట్లు చెల్లిస్తోంది. అలాగే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం వల్ల 2026 ఫిబ్రవరి నాటికి 273.24 కోట్ల మంది మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లు ఈ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. దీని ద్వారా మహిళలకు సుమారు ₹9,360.06 కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ సుమారు 30 లక్షల మంది మహిళలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకుంటూ ఆర్థికంగా ప్రయోజనం పొందుతున్నారు. గత ప్రభుత్వ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వైఫల్యాన్ని అధిగమిస్తూ, ఇందిరమ్మ ప్రభుత్వం ద్వారా నియోజకవర్గానికి 3,500 ఇళ్ల నిర్మాణానికి ఒక్కో లబ్ధిదారుడికి ₹5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నారు. రేపటి పౌరులను తీర్చిదిద్దడానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలు, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటుకు రూపకల్పనలో ముందున్నారు. 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం త్రి ట్రిలియన్ డాలర్ ఎకానమీ లక్ష్యంగా యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని ముందుకు వెళ్తున్నారు.
రాజకీయాల్లో గెలుపోటములు సహజం, కానీ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేయడం కొందరికే సాధ్యం. భట్టి విక్రమార్క చేపట్టిన ‘పీపుల్స్ మార్చ్’ కేవలం అధికార మార్పిడికి సాధనం మాత్రమే కాదు.. అది తెలంగాణ సామాన్యుడి ఆత్మగౌరవ ప్రయాణం. ఆ నడకలో వినిపించిన నినాదం, నేడు అభివృద్ధి రూపంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిధ్వనిస్తోంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram