MLC Kavitha : రేపు ఉదయం ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా..?

కవిత రేపు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా; మధ్యాహ్నం 12 గంటలకు ప్రెస్ మీట్, BRS సస్పెన్షన్, రాజకీయ భవిష్యత్తుపై మాట్లాడనుంది.

MLC Kavitha : రేపు ఉదయం ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా..?

హైద‌రాబాద్ : స్థానిక సంస్థ‌ల‌ ఎమ్మెల్సీ ప‌ద‌వికి క‌ల్వ‌కుంట్ల క‌విత(Kalvakuntla Kavitha) రేపు(బుధ‌వారం) రాజీనామా చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. రాజీనామా చేసిన అనంతరం క‌విత రేపు మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు ప్రెస్ మీట్ పెట్ట‌నున్న‌ట్లు తెలుస్తుంది. ప్ర‌స్తుతం కవిత ఉమ్మ‌డి నిజామాబాద్ స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీగా కొన‌సాగుతున్నారు.

ఎమ్మెల్సీ క‌విత‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ(BRS Party) నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు పార్టీ అధికారికంగా బీఆర్ఎస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి టీ ర‌వీంద‌ర్ రావు, పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణ వ్య‌వ‌హారాల బాధ్యులు సోమ భ‌ర‌త్ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఎమ్మెల్సీ క‌విత ఇటీవ‌లి కాలంలో ప్ర‌వ‌ర్తిస్తున్న తీరుతెన్నులు, కొన‌సాగిస్తున్న పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌లాపాలు బీఆర్ఎస్ పార్టీకి న‌ష్టం క‌లిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విష‌యాన్నీ తీవ్రంగా ప‌రిగ‌ణిస్తున్న‌ది. పార్టీ అధ్య‌క్షులు కేసీఆర్ కవిత‌ను త‌క్ష‌ణం పార్టీ నుంచి స‌స్పెండ్ చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నార‌ని బీఆర్ఎస్ పార్టీ పేర్కొంది.

ఎంపీగా ఓట‌మి.. ఎమ్మెల్సీగా గెలుపు..

2009 నుంచి 2014 వ‌ర‌కు తెలంగాణ ఉద్య‌మంలో క‌విత క్రియాశీల‌క పాత్ర పోషించారు. 2014 లోక్‌స‌భ(Loksabha) ఎన్నిక‌ల్లో నిజామాబాద్(Nizamabad) నుంచి గెలుపొందారు. 2019 ఎన్నిక‌ల్లో బీజేపీ(BJP) నేత ధ‌ర్మ‌పురి అర‌వింద్‌పై క‌విత ఓట‌మి పాల‌య్యారు. 2020 అక్టోబ‌ర్‌లో నిర్వ‌హించిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌ల్లో నిజామాబాద్ స్థానిక సంస్థ‌ల అభ్య‌ర్థిగా క‌విత పోటీ చేసి తొలిసారి శాన‌స‌మండ‌లిలో అడుగుపెట్టారు. నాటి ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కవితకు 728 ఓట్లు రాగా బీజేపీకి 56 ఓట్లు, కాంగ్రెస్‌కు 29 ఓట్లు వచ్చాయి. ఉప పోరులో 672 ఓట్ల మెజార్టీతో కవిత విజయం సాధించారు.

తెలంగాణ(Telangana) శాసనమండలికి మ‌ళ్లీ 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మ‌డి నిజామాబాద్ స్థానిక సంస్థల బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవిత పోటీ చేశారు. ఈ ఎన్నిక‌ల్లో క‌విత ఏక‌గ్రీవంగా ఎన్నియ్యారు. క‌విత 2022 జ‌న‌వ‌రి 19న రెండోసారి ఎమ్మెల్సీగా ప్ర‌మాణస్వీకారం చేశారు. ఆమె ఎమ్మెల్సీ ప‌ద‌వీకాలం 2028 జ‌న‌వ‌రి 4వ తేదీన ముగియ‌నుంది. కానీ ప్ర‌స్తుత ప‌రిణామాల దృష్ట్యా క‌విత త‌న ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేశారు.