Telangana BJP Rift | ఆరెస్సెస్ వర్సెస్ నాన్ ఆరెస్సెస్.. తెలంగాణ బీజేపీలో ‘సంఘ్’ రాజకీయం!
ఈటల వంటివారిని ఆరెస్సెస్ భావజాలంతో ఎదిగిన, విద్యార్థి దశ నుంచి.. ఏబీవీపీలో పనిచేసి, కీలక నాయకులుగా ఎదిగిన కిషన్‌రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్, మురళీధర్ రావు తదితర నేతలు పొసగనివ్వడం లేదని బీజేపీ పార్టీ వ్యవహారాలను అతిదగ్గరి నుంచి పరిశీలించే సీనియర్ జర్నలిస్ట్ ఒకరు అభిప్రాయ పడ్డారు. అందుకే ఈటలకు రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కకుండా అడ్డుపడ్డారని చెబుతున్నారు.

Telangana BJP Rift | హైదరాబాద్, జూలై 24 (విధాత): తెలంగాణ బీజేపీ రెండు వర్గాలుగా చీలిపోయిందా? అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే చెపుతున్నాయి. ముఖ్యంగా వివిధ పార్టీల నుంచి బీజేపీలో చేరిన నేతలను మొదటి నుంచీ పార్టీలో కొనసాగుతున్న నేతలు పొసగనివ్వడం లేదన్న వాదన గట్టిగానే వినిపిస్తున్నది. ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చినవారు మళ్లీ ఏదైనా పార్టీలోకి వెళ్లిపోతారన్న అనుమానం పెట్టుకున్న కట్టర్ బీజేపీ నేతలు.. వలస నేతల పట్ట ఆచితూచి స్పందిస్తున్నారని, వారికి పార్టీ పగ్గాలు అందకుండా జగ్రత్త పడుతున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఢిల్లీలో బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి విందుకు ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి చేరిన ఎంపీలు హాజరయ్యారు తప్పించి.. బీజేపీలో తొలి నుంచీ ఉండి.. ఇప్పుడు కేంద్రమంత్రులైన జీ కిషన్ రెడ్డి, బండి సంజయ్ హాజరు కాకపోవడం తాజా చర్చలకు తెర తీసింది. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఏర్పాటు చేసిన ఢిల్లీ విందు సమావేశంలో పాల్గొన్నవారిలో ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, డీకే అరుణ, గోడం నగేశ్, రఘునందన్‌రావు ఉన్నారు. వీరంతా ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరినవారే కావడం గమనార్హం. ఈ విందుకు హాజరుకాకపోవడం ద్వారా వాళ్లు వేరు, మేం వేరు అనే సంకేతాలను కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఇచ్చారన్న చర్చలు రాజకీయ పరిశీలకుల్లో జరుగుతున్నాయి. ఈటల రాజేందర్‌కు, బండి సంజయ్‌కు మధ్య విభేదాలు బహిరంగమైన నేపథ్యం కూడా ఈ విందుకు ప్రాధాన్యం తెచ్చిపెట్టింది. ఈటల రాజేందర్‌కు బీజేపీలో ఊపిరి సలుపనీయడం లేదనే వాదన ఉన్నది.
విద్యార్థి దశలో కమ్యూనిస్ట్ భావజాలంతో ఉన్న ఈటల రాజేందర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆరెస్‌లో చేరి ప్రజా బలం ఉన్న నాయకుడిగా, బీఆరెస్‌లో బలమైన నేతగా ఎదిగారు. కేసీఆర్‌తో వచ్చిన తీవ్ర స్థాయి విభేదాల కారణంగా బీఆరెస్‌ను వీడి బీజేపీలో చేరాల్సి వచ్చింది. నిజానికి బీజేపీ భావజాలానికి ఈటల రాజేందర్ భావజాలానికి పొంతనే లేదు. కమ్యూనిస్టు, ప్రగతిశీల భావాలు కలిగిన ఈటల ఫక్తు మితవాద పార్టీలో చేరడమే అప్పట్లో అందరినీ ఆశ్చర్యపర్చింది. ఆయన రాజకీయ అవసరాలు ఆయనను అటు నడిపించాయి. అయితే.. ఆయన చేరిన దగ్గర నుంచీ రాష్ట్ర స్థాయి బీజేపీ నాయకత్వంతో పొసగని పరిస్థితులు ఉన్నాయని, ఇప్పటికీ అవి కొనసాగుతున్నాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. నిజానికి ఈటల చేరిక, హుజురాబాద్ ఉప ఎన్నికలో ఆయన ఘన విజయంతో తెలంగాణలో బీజేపీకి రాజకీయంగా కొంత బూస్టింగ్ వచ్చినట్టయింది. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి లాంటి నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీకి కొంత సానుకూల పరిస్థితులు నెలకొంటున్నాయని భావించే సమయంలో కొత్త నేతలను బీజేపీ నేతలు మనస్ఫూర్తిగా స్వాగతించలేదని తదుపరి పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. అయితే.. ఈటల రాజేందర్‌కు అనతికాలంలోనే ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షా అభిమానం లభించింది. కానీ.. ఈటల వంటివారిని ఆరెస్సెస్ భావజాలంతో ఎదిగిన, విద్యార్థి దశ నుంచి.. ఏబీవీపీలో పనిచేసి, కీలక నాయకులుగా ఎదిగిన కిషన్‌రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్, మురళీధర్ రావు తదితర నేతలు పొసగనివ్వడం లేదని బీజేపీ పార్టీ వ్యవహారాలను అతిదగ్గరి నుంచి పరిశీలించే సీనియర్ జర్నలిస్ట్ ఒకరు అభిప్రాయ పడ్డారు. అందుకే ఈటలకు రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కకుండా అడ్డుపడ్డారని చెబుతున్నారు. ఈటల రాజేందర్‌కు రాష్ట్రవ్యాప్తంగా ప్రభావితం చేయగల నేతగా పేరుంది. నిత్యం జనాల్లో ఉండే నాయకుడు. ఇటువంటి స్థితిలో ఆయనకు అధ్యక్ష పగ్గాలు అప్పగిస్తే.. తమను దాటిపోతాడని, అందనంత ఎత్తుకు ఎదుగుతాడని సంఘ్ బీజేపీ నేతలు భావించారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆయనపై కమ్యూనిస్టు ముద్ర వేసి అడ్డుపడ్డారని అంటున్నారు. నిజానికి ఇది ఈటల ఒక్కరి కథే కాదని సీనియర్ జర్నలిస్టు గుర్తు చేశారు.
నాగం జనార్దన్‌రెడ్డికీ భంగపాటు
తెలంగాణ ఉద్యమం ఉధృతంగా నడుస్తున్న సమయంలో టీడీపీ రెండు కళ్ల సిద్ధాంతంతో ఉండేది. ఈ వైఖరిని వ్యతిరేకిస్తూ నాటి టీడీపీలో నెంబర్ టూ నాయకుడిగా చలామణీ అయిన నాగం జనార్దన్‌రెడ్డి.. ఆ పార్టీకి రాజీనామా చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా తెలంగాణ నగారా పేరుతో పార్టీ పెట్టారు. ఆ తర్వాతి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన బీజేపీలో తన పార్టీని విలీనం చేశారు. అప్పటికే తెలంగాణలో ప్రభావవంతమైన నాయకుడిగా నాగం ఉన్నారు. ఆయనను కూడా బీజేపీలోని సంఘ్ నేతలే బయటకు వెళ్లిపోయేలా పుల్లలు పెట్టారని సీనియర్ జర్నలిస్టు గుర్తు చేశారు.
డీకే అరుణకూ దక్కని అధ్యక్ష పగ్గాలు
బీఆరెస్ ఆపరేషన్ గులాబీతో కాంగ్రెస్ పార్టీ ఛిన్నాభిన్నమైన నేపథ్యంలో నాయకులు చెల్లాచెదురయ్యారు. ఆ సమయంలో మాజీ మంత్రి, సీనియర్ నేత డీకే అరుణ బీజేపీలో చేరారు. ఒక దశలో అరుణకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కే అవకాశాలపై చర్చ జరిగింది. పార్టీ అధిష్ఠానం ఆమెకు రాష్ట్ర పగ్గాలు అప్పగించే ప్రతిపాదన చేయగా.. సంఘ్ బీజేపీ నేతలు అడ్డుకున్నారనే చర్చలు అప్పట్లో సాగాయి. ఇప్పడు ఈటల రాజేందర్‌ను సైతం ఇదే సంఘ్ బ్యాచ్ అడ్డుకుంటున్నదనే అభిప్రాయాన్ని పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. వలస నేతలు మళ్లీ వలసపోయే అవకాశాలుంటాయని, అందులోనూ ఈటల రాజేందర్‌కు కమ్యూనిస్టు భావజాలం ఉన్నదని అధిష్ఠానం వద్ద మెలిక పెట్టారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. పార్టీని సిద్ధాంత ప్రాతిపదికన నడపాలంటే.. సంఘ్ మూలాలు ఉన్న వారే అవసరమన్న వాదనను అధిష్ఠానం వద్ద బలంగా వినిపిస్తున్నారని తెలిసింది.
స్నేహ హస్తాన్నీ అందుకోలేదు
బీజేపీలో చేరిన కొన్ని రోజులకే పరిస్థితులు మెల్లగా అవగతం అవుతున్న సమయంలో ఒక సందర్భంలో ఈటల రాజేందర్ సంఘ్ బీజేపీ నాయకత్వానికి స్నేహ హస్తం అందించేందుకు ప్రయత్నించారని ఈ పరిణామాలపై అవగాహన ఉన్న ఒక నాయకుడు చెప్పారు. ఒక పార్టీలోనే ఉన్నందున కలిసి పనిచేద్దామని అంటూ.. కలిసి మాట్లాడేందుకు అవకాశం కోరగా.. ఒక సీనియర్ నేత కరకుగానే నిరాకరించారని విశ్వసనీయంగా తెలిసింది. లక్షణ్ వంటి jayనాయకులు ఈటల ఎదురుపడి విష్ చేసినా పట్టించుకోకుండా వెళ్లిన సందర్బాలు తాను చూశానని ఈటల సన్నిహితుడొకరు తెలిపారు. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి విందుకు బండి, కిషన్‌రెడ్డి వెళ్లకపోవడానికి కూడా ఇదే కారణమని అంటున్నారు. కాంగ్రెస్, బీఆరెస్‌లతో పాటు ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు ఎంత ప్రజాదరణ ఉన్న వాళ్లైనా సరే.. వారికి సమాన దూరం పాటించాలని, వారిని గుర్తించాల్సిన అవసరం లేదనేది సంఘ్ బీజేపీ నేతల అభిప్రాయంగా తెలుస్తున్నది.