BJP Telangana President | బీజేపీ నేతలకు తీరిక దొరికెన్!.. రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలకు నేడు నోటిఫికేషన్
తెలంగాణలో పార్టీల అభ్యర్థుల గెలుపు ఓటములలో మున్నూరు కాపులు, యాదవులు, ముదిరాజులు, పద్మశాలీల ఓట్లు క్రియాశీలకంగా ఉన్నాయి. ఈ కులాల నుంచి అధ్యక్ష పదవికి ఎంపిక చేస్తారా? ఇతర కులాల నాయకులకు పెద్ద పీట వేస్తారా? అనేది తెలియడం లేదు. ఓసీ నాయకుడిని ఎంపిక చేస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి విమర్శలు వచ్చే ప్రమాదం కూడా ఉందని, ఏం నిర్ణయం వెలువరిస్తారో తెలియడం లేదని ఒక నాయకుడు తెలిపారు.

BJP Telangana President | హైదరాబాద్, జూన్ 28 (విధాత) : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవికి నగరా మోగింది. ఈ పదవి కోసం ఆదివారం నోటిఫికేషన్ జారీ చేస్తుండగా, సోమవారం నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. గత ఎనిమిది నెలలుగా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తున్న రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎన్నికలకు ఎట్టకేలకు షెడ్యూలు ప్రకటించారు. మరో ఏడాది పాటు కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా కొనసాగుతారని రెండు నెలల క్రితం వార్తలు కూడా వచ్చాయి. అయితే అనూహ్యంగా ఎన్నికల షెడ్యూలు ప్రకటించడంతో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
సమస్యగా అంతర్గత పోరు!
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపికకు బీజేపీ నేతలు, బయటి నుంచి వచ్చిన నేతల మధ్య అంతర్యుద్ధం జరుగుతున్నదనే వాదనలు ఉన్నాయి. కేంద్ర గనుల శాఖ మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జీ కిషన్ రెడ్డి పదవీ కాలం గతేడాది అక్టోబర్ నెలలోనే ముగిసినా నూతన అధ్యక్షుడి నియామకంలో పార్టీ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నది. సికింద్రాబాద్ నుంచి రెండోసారి ఎంపీగా జీ కిషన్ రెడ్డి విజయం సాధించడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి కొత్తవారికి అప్పగించాలని నిర్ణయించారు. పార్టీ నియామావళి ప్రకారం ఒకే వ్యక్తికి ఒకే పదవి అనేది ఉండటంతో ముఖ్య నాయకులు అధ్యక్ష పదవిని సాధించుకునేందుకు తమవంతు ప్రయాత్నాలు మొదలు పెట్టారు. అదిగో ఇదిగో అంటూ చెబుతున్నారు కాని ఎన్నికలకు సంబంధించి స్పష్టమైన నిర్ణయాన్ని ఢిల్లీ పార్టీ పెద్దలు ప్రకటించకపోవడం ఆశావహులతో పాటు కార్యకర్తలకు మింగుడుపడలేదు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర శాఖలో ఆరెస్సెస్ గ్రూపు, బీఆర్ఎస్ అనుకూల గ్రూపు, బయట నుంచి చేరిన వారి నాయకత్వంలో ఇలా పలు గ్రూపులు కొనసాగుతున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒక గ్రూపు అంటే మరో గ్రూపునకు సరిపడకపోవడం మూలంగా విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయంటున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్య నాయకులకు గట్టిగానే హెచ్చరికలు చేసినప్పటికీ గ్రూపు విభేధాలు సమసిపోలేదు. పార్టీ దూకుడును చూసి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన నాయకులు గత్యంతరం లేక బయటకు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. పార్టీ అభివృద్ధి కోసం కోసం ఎంత పనిచేసినా విలువ ఇవ్వడం లేదని, దిక్కులేక వచ్చిన నాయకులుగా చూస్తున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎపీ జితేందర్ రెడ్డి కేంద్ర మంత్రి అమిత్ షా ముందే ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్‌తో అంటకాగుతున్నందున ఇక పార్టీ కోసం పనిచేయడం వృథా అంటూ ఇద్దరు నాయకులు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఒక దశలో సీనియర్ నాయకుడు ఈటల రాజేందర్ కూడా తన దారి తాను చూసుకుంటున్నారని పార్టీ పెద్దలకు సంకేతాలు వెళ్లాయని సమాచారం. తెలంగాణలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పోరాడేందుకు సిద్ధంగా లేదనే విధంగా పరిస్థితులు మారాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఢిల్లీ పెద్దలు అప్రమత్తమై.. ఈటలను సముదాయించారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో కొందరి నాయకుల నుంచి సమాచారం స్వీకరించామని, అందరి అభిప్రాయాలు తీసుకుని నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందంటూ.. మున్ముందు మంచి అవకాశాలు వస్తాయని, పార్టీ కోసం పనిచేయాలని చెప్పి పంపించారని తెలిసింది.
రేసులో చాలా మంది!
బీజేపీ నాయకులు ఎస్ రామచందర్ రావు, ఎంపీలు ధర్మపురి అర్వింద్, ఎం రఘునందన్ రావు, డీకే అరుణతో పాటు బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి, కాసం వెంకటేశ్వర్లు ఇలా ఎవరికి వారుగా తమకంటే తమకే పదవి దక్కాలని ప్రయత్నాలు చేసుకుంటున్నారని తెలుస్తున్నది. వీరితో పాటు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేరు కూడా విన్పించింది. అయితే.. మరోసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా లేనని, కేంద్ర మంత్రి పదవి బాగుందని చెప్పిన ఆయన తేల్చేశారు. అయితే అధ్యక్షుడి ఎంపికలో అధిష్ఠానం ముందు చూపుతో నిర్ణయం తీసుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తున్నది.
బీసీకి ఇస్తారా? ఓసీకి ఇస్తారా?
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కుల గణన విజయవంతంగా పూర్తి చేసింది. బీసీ జనాభా 56 శాతం పైబడి ఉందని లెక్కలు తేల్చింది. తెలంగాణ మోడల్ ను దేశ వ్యాప్తంగా చేపట్టాలని రాహుల్ గాంధీ బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో పార్టీల అభ్యర్థుల గెలుపు ఓటములలో మున్నూరు కాపులు, యాదవులు, ముదిరాజులు, పద్మశాలీల ఓట్లు క్రియాశీలకంగా ఉన్నాయి. ఈ కులాల నుంచి అధ్యక్ష పదవికి ఎంపిక చేస్తారా? ఇతర కులాల నాయకులకు పెద్ద పీట వేస్తారా? అనేది తెలియడం లేదు. ఓసీ నాయకుడిని ఎంపిక చేస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి విమర్శలు వచ్చే ప్రమాదం కూడా ఉందని, ఏం నిర్ణయం వెలువరిస్తారో తెలియడం లేదని ఒక నాయకుడు తెలిపారు. తాను కూడా పోటీలో ఉన్నానని, 1995 నుంచి హిందూ వాహినిలో పనిచేస్తున్నానని గోషామహల్ ఎమ్మెల్యే టీ రాజాసింగ్ తాజాగా ప్రకటన చేశారు. 2009లో మంగళ్‌హాట్ డివిజన్ నుంచి కార్పొరేటర్ టికెట్ కోసం ప్రయత్నించగా ఇవ్వలేదని, కసితో టీడీపీలో చేరి కార్పొరేటర్ గా గెలుపొందిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఇవి కూడా చదవండి..
BJP President | బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికలో సమస్య అక్కడే!
Harish Rao | జాబ్ క్యాలెండర్.. ఒక దగా క్యాలెండర్! : మాజీ మంత్రి హరీష్ రావు