ఢిల్లీలో అప్పుడే మొదలైన చలి..! పదేళ్ల తర్వాత అక్టోబర్ 2న అత్యల్ప ఉష్ణోగ్రతలు..!

విధాత: నైరుతి రుతుపవనాలు తిరోగమణం మొదలైంది. వార్షాలు తగ్గుముఖం పట్టడంతో ఆ తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. అయితే, అక్టోబర్ ప్రారంభంలోనే ఢిల్లీలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. అక్టోబర్ 2న సోమవారం కనిష్ఠ ఉష్ణోగ్రతలు మూడు డిగ్రీలు తగ్గి 20.1 డిగ్రీలకు చేరాయి. 2011 తర్వాత అక్టోబర్‌లో ఇంత తక్కువగా నమోదవడం ఇదే తొలిసారి. సాధారణంగా అక్టోబర్ 8 నుంచి 12 వరకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు 21 డిగ్రీల మధ్య ఉంటుంది.
అయితే, ఢిల్లీలోని రిడ్జ్ ప్రాంతంలో సోమవారం ఉష్ణోగ్రతలు తగ్గాయి. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 17.1 డిగ్రీలు రికార్డు కాగా.. మరికొన్ని ప్రాంతాల్లో 19 డిగ్రీలకు తగ్గాయి. దాంతో చలితో ఆయా ప్రాంతాల్లో జనం ఇబ్బందులకు గురయ్యారు. సోమవారం గరిష్ఠ ఉష్ణోగ్రత 35.1 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఆయానగర్, జాఫర్‌పూర్‌లో గరిష్ఠ ఉష్ణోగ్రత 34.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. మరో వైపు కనిష్ఠ ఉష్ణోగ్రత లోధి రోడ్‌లో 19 డిగ్రీల సెల్సియస్, ఆయానగర్‌లో 19.4 డిగ్రీల సెల్సియస్, జాఫర్‌పూర్‌లో 19.6, నరేలాలో 20.3 డిగ్రీలకు చేరాయి.
అయితే, ఈ నెల 6వ తేదీ వరకు ఇదే వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుందని, వర్షాలు కురిసే అవకాశాలు లేవని వాతావరణ శాఖ తెలిపింది. 3-6 తేదీల మధ్య ఉదయం వేళల్లో పొగమంచు కురిసే అవకాశం ఉంటుందని, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల మధ్య, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 19-20 డిగ్రీల మధ్య ఉంటాయని అంచనా వేసింది. 7 నుంచి 8 తేదీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగి.. అక్టోబర్ మూడోవారం నుంచి ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.