Maharashtra | మహారాష్ట్రలో దారుణం.. ఇద్దరిని చంపిన పెద్దపులి
Maharashtra మహారాష్ట్రంలోని చంద్రాపూర్ జిల్లాలో ఘటన రెండు రోజుల్లోనే దాడి.. భయాందోళనలో ప్రజలు విధాత: మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో గడిచిన రెండు రోజుల్లో వేర్వేరు ఘటనల్లో పెద్దపులి ఇద్దరిని పొట్టనపెట్టుకున్నది. గురువారం పొలం పనులకు వెళ్లిన ఓ మహిళపై పులి దాడి చేసింది. అంతకు ముందు రోజు మరొకరిపై దాడిచేసి చంపేసింది. ఈ ఏడాది జనవరి నుంచి జిల్లాలో 13 మంది పులుల బారిన పడ్డారు. గతేడాది ఈ సంఖ్య 53గా ఉన్నది. దీంతో పరిసర గ్రామాల […]

Maharashtra
- మహారాష్ట్రంలోని చంద్రాపూర్ జిల్లాలో ఘటన
- రెండు రోజుల్లోనే దాడి.. భయాందోళనలో ప్రజలు
విధాత: మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో గడిచిన రెండు రోజుల్లో వేర్వేరు ఘటనల్లో పెద్దపులి ఇద్దరిని పొట్టనపెట్టుకున్నది. గురువారం పొలం పనులకు వెళ్లిన ఓ మహిళపై పులి దాడి చేసింది. అంతకు ముందు రోజు మరొకరిపై దాడిచేసి చంపేసింది. ఈ ఏడాది జనవరి నుంచి జిల్లాలో 13 మంది పులుల బారిన పడ్డారు. గతేడాది ఈ సంఖ్య 53గా ఉన్నది. దీంతో పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
బ్రహ్మపురి అటవీ డివిజన్‌లోని నాగ్‌భిడ్ తహసీల్‌లోని అకాపూర్ గ్రామ సమీపంలో దేవతా జీవన్ చన్‌ఫనే (47) అనే మహిళ పొలం పనులకు వెళ్లినప్పుడు బుధవారం ఆమెపై పులి దాడిచేసింది. సాయంత్రమైనా ఆమె తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే అటవీ అధికారులకు సమాచారం కూడా ఇచ్చారు.
గ్రామస్థులు, అధికారులు వేర్వేరుగా వెతుకగా, అటవీ సమీపంలో ఆమె తల ఒక చోట, ఇతర శరీర భాగాలు వేర్వేరు చోట్ల లభించాయి. మృతురాలి కుటుంబానికి తక్షణ సాయం కింద రూ.25 వేలను అటవీ అధికారులు అందించారు. అ ప్రాంతంలో పులి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. పులి దాడులు మళ్లీ జరుగకుండా చర్యలు చేపడుతామని చెప్పారు. అలాగే గ్రామస్థులు కూడా పులి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మంగళవారం అదే డివిజన్‌లోని బోల్దా అటవీ ప్రాంతంలోని సావర్‌గావ్ గ్రామానికి చెందిన ఈశ్వర్ కుంభారే (45) అనే వ్యక్తిని పులి చంపింది. కుంభరే పొలంలో పని చేస్తుండగా దాడి చేయడంతో జిల్లాలోని చిమూర్ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ రెండు చోట్ల ఒకే పులి దాడి చేసి ఉండకపోవచ్చని అటవీ అధికారులు తెలిపారు. రెండు ప్రాంతాలు దూరందూరంగా ఉన్నాయని పేర్కొన్నారు.