Mahbubabad | ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు: మంత్రి సత్యవతి
Mahbubabad మార్కెట్లకు నకిలీ విత్తనాలు రాకుండా చర్యలు జిల్లా అధికారులతో మంత్రి సత్యవతి రాథోడ్ సమీక్ష విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ హెచ్చరించారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్, వ్యవసాయ అధికారులతో, ధాన్యం కొనుగోళ్లపై మంత్రి సత్యవతి రాథోడ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ భూ […]

Mahbubabad
- మార్కెట్లకు నకిలీ విత్తనాలు రాకుండా చర్యలు
- జిల్లా అధికారులతో మంత్రి సత్యవతి రాథోడ్ సమీక్ష
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ హెచ్చరించారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్, వ్యవసాయ అధికారులతో, ధాన్యం కొనుగోళ్లపై మంత్రి సత్యవతి రాథోడ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ భూ ఆక్రమణలను ప్రోత్సహించిన వారిపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు వేగంగా, సజావుగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ముందస్తు ప్రణాళికతో రైతులకు సకాలంలో నాణ్యమైన విత్తనాలు అందే విధంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ముఖ్యమంత్రికేసీఆర్ వ్యవసాయ శాఖపై ప్రత్యేక శ్రద్ధ వహించి రైతులకు, కోట్లాది మందికి ఉపాధి కల్పిస్తున్నారని, గడిచిన 9 ఏళ్లలో వ్యవసాయ రంగానికి దాదాపు 4.5 లక్షల కోట్లు కేటాయించారని, దేశంలో మన కంటే రెండు, మూడు రెట్లు పెద్ద రాష్ట్రాల్లో సైతం ఇంత భారీగా ఖర్చు చేయలేదని అన్నారు.
ప్రభుత్వ కృషితో ఫలితాలు
ప్రభుత్వం తీసుకున్న రైతు అనుకూల విధానాల కారణంగా వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయని, రైతులకు ఎటువంటి ఇబ్బందులూ రాకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించుకొని నాణ్యమైన ఎరువులు, విత్తనాలు సమయానికి అందించడంతో పాటు పంట దిగుబడి అధికంగా వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
గతంలో రైతులు వ్యవసాయ సీజన్ పై ఆధారపడి వ్యవసాయ సేద్యం చేసేవారని రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో వేసవిలో కూడా చెరువులలో నీళ్లు ఉండే విధంగా చర్యలు తీసుకున్నందున రైతాంగానికి సకాలంలో విత్తనాలు అందించి ముందస్తు సేద్యానికి చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ అధికారులు రైతుల సంక్షేమంపై దృష్టి పెట్టాలని వరి పంటకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలైన వాణిజ్య పంటలను చేపట్టే విధంగా రైతులను రైతు వేదికల ద్వారా సమావేశాలు ఏర్పాటు చేసి ప్రోత్సహించాలన్నారు.
పత్తిపాక రోడ్డు వైకుంఠధామం పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు అదేవిధంగా మున్సిపాలిటీలోని ఎన్టీఆర్ స్టేడియం అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. అర్హులైన నిరుపేదలకు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయించాలన్నారు. వానాకాలం సీజన్ కు సంబంధించి రైతులకు అవసరమైన మేరకు విత్తనాలు, ఎరువుల ను స్టాక్ ఉంచుకోవాలని, ప్రభుత్వం అనుసరిస్తున్న కఠిన వైఖరి కారణంగా ప్రస్తుత కాలంలో నకిలీ విత్తనాలు మార్కెట్ లో దాదాపు మాయమయ్యాయి అన్నారు.
అక్కడక్కడ ఉన్న కొన్ని నకిలీలను పూర్తిగా అరికట్టాలని, అమాయకులకు ఇబ్బంది కలిగించరాదని సూచించారు. క్షేత్ర స్థాయిలో సమాచారం సేకరించి పక్క రాష్ట్రాల నుండి వచ్చే నకిలీ విత్తనాలు, ఎరువులపై దృష్టి పెట్టి పకడ్బందీగా నియంత్రించాలని అన్నారు.
దేశ విత్తనావసరాలు తీరుస్తున్న తెలంగాణ
దేశంలో ఉన్న విత్తన అవసరాలలో దాదాపు 60% మేర తెలంగాణ నుంచి సరఫరా చేస్తున్నామని, దేశానికి విత్తన బాండాగారంగా తెలంగాణ ఆవిర్భవించిందని తెలిపారు. అక్కడక్కడా ఎదురవుతున్న ధాన్యం కొనుగోళ్లలోని సమస్యలపై ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం తక్షణం స్పందిస్తుందని, విపత్కర పరిస్థితుల్లో మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తూ రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
గౌరవ సీఎం కేసీఆర్ రైతు అనుకూల విధానాలతో ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచిందని, కేంద్ర సహకారం ఆశించినంత లేకున్నా యాసంగి ధాన్యాన్ని కనీస మద్దతు ధరతో సేకరిస్తున్నామని పేర్కొన్నారు.
కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ కుమారి అంగోత్ బిందు, ఎమ్మెల్యే శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శశాంక, అదనపు కలెక్టర్ డేవిడ్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి చత్రు నాయక్, సివిల్ సప్లై జిల్లా మేనేజర్ కృష్ణవేణి, పౌరసరఫరాల అధికారి నరసింగరావు, సహకార శాఖ అధికారి ఖుర్షిదు తదితరులు పాల్గొన్నారు.