అద్దె బస్సుల యాజమాన్యం సమస్యలపై ఉన్నత స్థాయి కమిటీ: ఎండీ సజ్జనార్

అద్దె బస్సుల యాజమాన్యాల సమస్యల పరిష్కారానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఒక ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని ఎండీ సజ్జనార్ వెల్లడించారు

  • By: Somu    latest    Jan 04, 2024 10:32 AM IST
అద్దె బస్సుల యాజమాన్యం సమస్యలపై ఉన్నత స్థాయి కమిటీ: ఎండీ సజ్జనార్

విధాత: అద్దె(హైర్‌) బస్సుల యాజమాన్యాల సమస్యల పరిష్కారానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు టీఎస్ ఆర్టీసీ ఒక ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని ఎండీ సజ్జనార్ వెల్లడించారు. హైర్ బస్సులు యాజమానులు ఈ రోజు ఉదయం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి తమ సమస్యలు విన్నవించారు. స్పందించిన మంత్రి దీనిపై చర్చించాలని, అవసరమైతే ఒక ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని ఎండీ సజ్జనార్‌కు సూచించారు. ఆ వెంటనే బస్ భవన్ లో హైర్ బస్సు యాజమానులతో సజ్జనార్ సమావేశం ఏర్పాటు చేశారు.


ప్రధానంగా ఐదు విషయాలను హైర్ బస్సుల యాజమానులు ఆర్టీసీ సంస్థ దృష్టికి తీసుకువచ్చారు. వాటిపై సంస్థ ఉన్నతాధికారులతో కలిసి చర్చించారు. ఈ సమస్యల పరిష్కారానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు టీఎస్ఆర్టీసీ ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆ కమిటీ వారం రోజుల్లోగా నివేదిక అందిస్తుందని, నివేదిక సిఫారసులను పరిశీలించిన తర్వాత.. ఆ మేరకు యాజమాన్యం నిర్ణయం తీసుకుంటుందని హైర్ బస్సు యాజమానులకు వివరించడం జరిగింది. అందుకు వారు సానుకూలంగా స్పందించారు.


సమావేశం వివరాలను సజ్జనార్ వెల్లడించారు. హైర్ బస్సు యాజమానులు కొన్ని అంశాలను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చారని, మహాలక్ష్మి స్కీం అమలు తర్వాత ఇబ్బందులు గురవుతున్నామని వారు చెప్పడం జరిగిందన్నారు. సంస్థ ఉన్నతాధికారులతో కలిసి ఈ రోజు సుదీర్ఘంగా చర్చించడం జరిగిందని, రవాణ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు ఒక ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు.


ఆ కమిటీ అన్ని అంశాలను శాస్త్రీయ కోణంలో పరిశీలిస్తుందని, సంస్థ బస్సులు, హైర్ బస్సుల డేటాను క్రోడికరించి.. ఒక నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఈ నిర్ణయాలపై హైర్ బస్సు యాజమానులు సానుకూలంగా స్పందించారని తెలిపారు. దీంతో వారంతా సమ్మె ఆలోచనను విరమించుకున్నారన్నారు. ఈ సమావేశంలో టీఎస్ఆర్టీసీ సీవోవో డాక్టర్ రవిందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, కృష్ణకాంత్, వినోద్ కుమార్, వెంకటేశ్వర్లు, ఫైనాన్స్ అడ్వజర్ విజయపుష్ఫ, సీఎంఈ రఘునాథరావు, సీటీఎం జీవన్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.