నేటి నుంచి.. 6 రోజులు 4 రాష్ట్రాల్లో మోదీ సుడిగాలి పర్యటనలు..

- 8 ర్యాలీల్లో ఎన్నికల ప్రచారం
- అక్టోబరు 1, 3 తేదీల్లో తెలంగాణకు
విధాత: త్వరలో ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాల్లో (Modi in poll Bound States) మోదీ సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. ఇందులో భాగంగా వచ్చే ఆరు రోజుల పాటు ఆయన సుమారు ఎనిమిది బహిరంగ సభల్లో పాల్గొంటారు. అంతే కాకుండా రూ.కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. శనివారం బిలాస్‌పుర్ వెళ్లనున్న ఆయన.. బీజేపీ ఆధ్వర్యంలోని పరివర్తన్ శఖానంద్ ర్యాలీలో పాల్గొంటారు.
ఆదివారం తెలంగాణలోని మహబూబ్‌నగర్ చేరుకుని రూ.13,500 కోట్లకు పైన విలువ కలిగిన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. సోమవారం మరలా ఉత్తరభారతానికి చేరుకుని రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్, మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లలో పర్యటిస్తారు. 2018 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గ్వాలియర్ చంబల్ లో బీజేపీ అనుకున్న స్థాయిలో ఓట్లను సాధించలేదన్న విషయం తెలిసిందే.
మంగళవారం ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పుర్ లో పర్యటించిన అనంతరం.. మరోసారి తెలంగాణకు వచ్చి నిజామాబాద్ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మహబూబ్‌నగర్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్ ఒకప్పుడు ఎంపీగా గెలవగా.. నిజామాబాద్ ఎంపీగా కవిత 2014లో ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2019లో ఈ సీటును భాజపా తన ఖాతాలో వేసుకుంది.
దీంతో ఈ రెండు నగరాలను రాష్ట్ర బీజేపీ నాయకులు మోడీ పర్యటనకు ఎంపిక చేసినట్లు సమాచారం. తర్వాత అక్టోబరు 5 గురువారం నాడు.. రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్‌కు గట్టి పట్టున్న జోధ్‌పూర్‌లో ప్రధాని పర్యటిస్తారు. అదేరోజు మరోసారి మధ్య ప్రదేశ్‌లోని జబల్‌పూర్‌కి వెళ్లి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. మరోవైపు త్వరలోనే ఎన్నికల కమిషన్ ఈ రాష్ట్రాల అసెంబ్లీలకు పోలింగ్ తేదీలను ప్రకటించనుంది.