Megha – BYD | మేఘా ఇంజినీరింగ్ – బీవైడీ ఒప్పందానికి భారత ప్రభుత్వం అడ్డుకట్ట !
Megha - BYD విధాత:భారతీయ కంపెనీలతో జట్టు కట్టి తమ వ్యాపారాలను విస్తరించడానికి ప్రయత్నిస్తున్న చైనా ఆటోమొబైల్ కంపెనీలకు చుక్కెదురవుతోంది. తాజాగా చైనా దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ బీవైడీ (BYD).. ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి మేఘా (Megha) ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థతో జట్టు కట్టాలని ప్రయత్నించింది. అయితే ఈ ఒప్పందానికి భారత ప్రభుత్వం అడ్డుకట్ట వేసినట్లు సమాచారం. భద్రత, సాంకేతిక చోరీ తదితర ఆరోపణలపై సరిహద్దు దేశాలతో వ్యాపార ఒప్పందాలు, పెట్టుబడులపై కేంద్రం ఆచితూచి వ్యవహరిస్తుండటమే […]

Megha – BYD
విధాత:భారతీయ కంపెనీలతో జట్టు కట్టి తమ వ్యాపారాలను విస్తరించడానికి ప్రయత్నిస్తున్న చైనా ఆటోమొబైల్ కంపెనీలకు చుక్కెదురవుతోంది. తాజాగా చైనా దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ బీవైడీ (BYD).. ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి మేఘా (Megha) ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థతో జట్టు కట్టాలని ప్రయత్నించింది.
అయితే ఈ ఒప్పందానికి భారత ప్రభుత్వం అడ్డుకట్ట వేసినట్లు సమాచారం. భద్రత, సాంకేతిక చోరీ తదితర ఆరోపణలపై సరిహద్దు దేశాలతో వ్యాపార ఒప్పందాలు, పెట్టుబడులపై కేంద్రం ఆచితూచి వ్యవహరిస్తుండటమే దీనికి కారణం.
వారి పెత్తనమే ఎక్కువ..
ముఖ్యంగా చైనా నుంచి వచ్చే సంస్థలపై అక్కడి ప్రభుత్వం పెత్తనం ఎక్కువగా ఉంటుందని.. భారత్‌లోని వారి భాగస్వామ్య సంస్థలు కేవలం డమ్మీలుగా మారతాయని కేంద్రం భావిస్తోంది. భారత కంపెనీలకు నిర్ణయాధికారం, సాంకేతిక బదిలీ తదితరాల్లో ఏ పాత్రా ఉండదని చెబుతోంది.
మేఘా సంస్థ తయారుచేస్తున్న ఒలెక్ట్రా గ్రీన్ టెక్ బస్సులకు బీవైడీ ఇప్పటికే ఛాసిస్, బ్యాటరీలను సరఫరా చేస్తోంది. ఎప్పడు వీలైతే అప్పుడు భారత్‌లోకి ప్రవేశించి విద్యుత్ వాహనాల మార్కెట్‌ను కొల్లగొట్టాలని అది భావిస్తోంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఎంతవరకు ఆ కోరిక నెరవేరుతుందో చూడాలి.
ఆటోమొబైల్‌కే పరిమితం కాదు
అయితే భారత ప్రభుత్వ నిశిత పరిశీలన ఈ ఒక్క కంపెనీకే పరిమితం కాలేదు. మహారాష్ట్రలోని జనరల్ మోటార్స్‌కు చెందిన ప్లాంట్‌ను కొనుగోలు చేయాలని భావించిన చైనాకు చెందిన గ్రేట్ వాల్ మోటార్స్.. ప్రభుత్వ నిబంధనలకు భయపడి ఆ ఒప్పందం నుంచి వెనక్కు వచ్చింది. జనరల్ మోటార్స్ దేశంలో కార్లను విక్రయిస్తున్నప్పటికీ.. ఎఫ్‌డీఐ లను అనుమతించడంలో భారత్ ఆచితూచి వ్యవహరిస్తుండటంతో.. మార్కెట్ విస్తరణ కోసం స్వదేశీ కంపెనీలను ఆశ్రయించక తప్పని పరిస్థితి నెలకొంది.
ఆటోమొబైల్ రంగంలోనే కాకుండా మొబైల్ ఫోన్ల రంగం కూడా భారత ప్రభుత్వ నిఘా నేత్రంలో ఉంది. ఆ దేశానికి చెందిన ఒప్పో, గ్జియోమీ, వివోలు భద్రతాపరమైన అనుమతుల కోసం ప్రభుత్వానికి ఇటీవలే అభ్యర్థించాయి. సమాచార రంగంలో సాంకేతికతను అభివృద్ధి చేసే హువాయి, జెడ్‌టీఈ సంస్థలు ఇప్పటికే భారత్‌లో తమ వ్యాపారాలను నిలిపివేశాయి.