మేఘాల్లో ప్లాస్టిక్ అణువులు.. కాలుష్యాల్లో ఇదో ర‌కం..

  • By: Somu    latest    Sep 28, 2023 11:03 AM IST
మేఘాల్లో ప్లాస్టిక్ అణువులు.. కాలుష్యాల్లో ఇదో ర‌కం..

విధాత‌: భూమిపై పేరుకుపోతున్న ప్లాస్టిక్.. స‌ముద్రాల్లో చేర‌డానికి కొత్త మార్గం క‌నుగొంది. భూమిపై ఉన్న ప్లాస్టిక్ అతి సూక్ష్మ‌మైన అణువుల‌గా విడిపోయి.. మేఘాల్లోకి చేరిపోతోంద‌ని తాజా అధ్య‌య‌నం ఒక‌టి బ‌య‌ట‌పెట్టింది. దీని వ‌ల్ల ఆ మేఘాలు (Plastic in Clouds) వ‌ర్షించిన‌పుడు మాన‌వుడు జాడ లేని, జీవ‌వైవిధ్యం అద్భుతంగా ఉండే ప్రాంతాల‌కు ఆ ప్లాస్టిక్ చేరే ప్ర‌మాదం ఉంద‌ని శాస్త్రవేత్త‌లు ఆందోళ‌న చెందుతున్నారు.


ఈ ప‌రిశోధ‌న కోసం జ‌పాన్ శాస్త్రవేత్త‌లు మేఘాల నుంచే నేరుగా 44 న‌మూనా నీటి బిందువుల‌ను తీసుకున్నారు. ఈ నీటిలో క‌నీసం 70 మైక్రోప్లాస్టిక్ అణువులున్నాయ‌ని వాటిని ప‌రిశోధించి తేల్చారు. మేఘాల నీటిలో ప్లాస్టిక్ ఉనికి ఉంద‌ని సాధికారికంగా క‌నుగొన‌డం ఇదే తొలిసారి అని ఈ ప‌రిశోధన ప‌త్రం పేర్కొంది. గాలిలో ప్లాస్టిక్ కాలుష్యం గురించి మ‌నం ప‌ట్టించుకోక‌పోతే మాన‌వాళి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వ‌స్తుంది.


వాతావ‌ర‌ణ మార్పులు, ప‌ర్యావ‌ర‌ణ విప‌త్తుల‌కు ఇది కార‌ణం కావ‌చ్చు. తిరిగి స‌రిచేయలేని విప‌త్తులు దీని వ‌ల్ల ఏర్ప‌డే ప్ర‌మాద‌ముంది అని అధ్య‌య‌నానికి నేతృత్వం వ‌హించిన వ‌సీదా యూనివ‌ర్సిటీ ప్రొఫ‌స‌ర్ హిరోషీ ఒకోచీ హెచ్చ‌రించారు. ఈ మేఘాల్లో ఉండే మైక్రోప్లాస్టిక్ అణువుల‌కు సూర్యుని కిర‌ణాలు, అల్ట్రావ‌యోలెట్ త‌రంగాలు త‌గిలిన‌పుడు వాటి నుంచి గ్రీన్ హౌస్ గ్యాసులు వెలువ‌డే ప్ర‌మాద‌మూ ఉంద‌ని తెలిపారు.


మైక్రోప్లాస్టిక్స్ అంటే ఏంటి?


5 మి.మీ. కంటే త‌క్కువ సైజులో ఉండే ప్లాస్టిక్ అణువుల‌ను మైక్రోప్లాస్టిక్స్ అంటారు. ప‌రిశ్ర‌మ‌ల వ్య‌ర్థాలు, టెక్స్‌టైల్స్‌, సింథ‌టిక్ కారు టైర్లు, సౌంద‌ర్య ఉత్ప‌త్తులు మొద‌లైన వాటిలో ఎక్కువ‌గా మైక్రోప్లాస్టిక్ అవ‌శేషాలు ఉంటాయి. ఇప్ప‌టికే ఆర్కిటిక్ స‌ముద్ర‌పు మంచు ప‌ల‌కాల్లోనూ.. స్పెయిన్ నుంచి ఫ్రాన్స్ వ‌ర‌కు ఉన్న పైరెనీస్ ప‌ర్వ‌త శ్రేణుల వ‌ద్ద జ‌లాల్లో ఈ మైక్రో ప్లాస్టిక్‌ల ఉనికి క‌న‌బడుతోంది.


ఇక్క‌డి చేప‌ల్లోనూ వీటి అవ‌శేషాలున్నాయ‌ని ప‌రిశోధ‌కులు తేల్చారు. అయితే వీటిలోకి ఆ ప్లాస్టిక్ ఎక్క‌డి నుంచి వ‌చ్చింద‌నేది శాస్త్రవేత్త‌ల‌కు అంతుబ‌ట్ట‌లేదు. జ‌పాన్ ప‌రిశోధ‌కులు చేసిన తాజా ప‌రిశోధ‌న ద్వారా ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం వ‌చ్చింద‌నే అనుకోవాలి. ఈ ప‌రిశోధ‌నా ఫ‌లితాల‌పై ప‌ర్యావ‌ర‌ణ వేత్త‌లు దృష్టి పెట్టాల్సిన అవ‌స‌రం ఉంది.