జీవో 317, 46పై 14న ఉద్యోగ సంఘాలతో భేటీ
జీవో నెంబర్లు 317, 46 లోని లోటుపాట్లు, పలు అంశాలపై లోతుగా అధ్యయనం చేసి చర్చించామని, జీవోలతో ఉద్యోగులు, ఉపాధ్యాయుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు

సమస్యలపై గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు
సబ్ కమిటీ నిర్ణయం
వెల్లడించిన మంత్రి దామోదరం రాజనర్సింహ
విధాత, హైదరాబాద్ : జీవో నెంబర్లు 317, 46 లోని లోటుపాట్లు, పలు అంశాలపై లోతుగా అధ్యయనం చేసి చర్చించామని, జీవోలతో ఉద్యోగులు, ఉపాధ్యాయుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఈ నెల 14వ తేదీ సాయంత్రం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించాలని అధికారులను మంత్రివర్గం సబ్ కమిటీ చైర్మన్, మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. జీవో 317సమస్యలపై నియమించిన క్యాబినెట్ సబ్ కమిటీ మంగళవారం సచివాలయంలో సమావేశమైంది. చైర్మన్ దామోదరం రాజనర్సింహ సహా మంత్రులు డీ. శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌లు హాజరయ్యారు. సబ్ కమిటీ భేటీ వివరాలను రాజనర్సింహ వెల్లడించారు. జీవో 317తో పాటు 46లోని లోటుపాట్లు, పలు అంశాలపై లోతుగా అధ్యయనం చేయాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించిందన్నారు. ఇందుకు ఈనెల 14వ తేదీన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో భేటీ కాబోతున్నామన్నారు. జీవోలతో ఎదురైన సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఫిర్యాదులను స్వీకరించడానికి గ్రీవెన్స్ సెల్ ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర సర్వీసెస్ శాఖ సెక్రెటరీని ఆదేశించడం జరిగిందన్నారు. ఆన్‌లైన్ ద్వారా గ్రీవెన్స్ సెల్ ను ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్ర ప్లానింగ్ డిపార్ట్మెంట్‌ను ఆదేశించామని తెలిపారు. గ్రీవెన్స్ సెల్‌కు రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల శాఖ సెక్రెటరీని నోడల్ అధికారిగా నియమించడం జరిగిందని వెల్లడించారు.
ఈ సబ్ కమిటీ సమావేశంలో రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు, పీఆర్సీ కమిటీ చైర్మన్ శివ శంకర్, సెక్రటేరియట్ సర్వీసెస్ సెక్రెటరీ నిర్మల, విద్యా శాఖ డైరెక్టర్ దేవసేన, శృతి ఓజా డైరక్టర్ ఆఫ్ ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.