సంక్రాంతి తరువాత రైతుబంధు: మంత్రి తుమ్మల
సంక్రాంతి పండగ తరువాత రైతుబంధు డబ్బులు వేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు

విధాత : సంక్రాంతి పండగ తరువాత రైతుబంధు డబ్బులు వేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులలో ఎవరైతే నిజంగా అర్హులో వారిని గుర్తించాల్సిన బాధ్యత ఉందన్నారు. అధికారులు కూడా నిజమైన అర్హులకు ఇస్తే అది ఇందిరమ్మ రాజ్యం అవుతుందన్నారు.
ఆరు గ్యారెంటీలు పేద ప్రజలు కోరుకునే కనీస అవసరాలన్నారు. గత సీఎం మాటలకే పరిమితమై కొన్ని కార్యక్రమాలు తుంగలో తొక్కారని విమర్శించారు. ఈనాటి సీఎం ప్రజల వద్దకు అధికారులను పంపించి ప్రజల ముందే ఆ కార్యక్రమాలు చేసుకోమని చెప్పారన్నారు. ఎంత డబ్బు, అహంకారం, అధికారం ఉన్నా ప్రజల ముందు దిగదుడుపే అని మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు నిరూపించారన్నారు.
ఈ సంవత్సరం ఖరీఫ్ పంటకాలానికి ఖమ్మం జిల్లాలోకి గోదావరి జలాలు ప్రవేశిస్తాయన్నారు. తప్పకుండా మా పదవీ కాలంలోనే ఆ నీళ్లు మీకు రావాలని మేము ప్రయత్నం చేస్తున్నామన్నారు. జాతీయ రహదారులు, సాగునీటి ప్రాజెక్టులు, సంక్షేమం అన్నింటినీ పూర్తి చేసే బాధ్యత తాము తీసుకుంటామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.
ఇందిమ్మ రాజ్యంలో సంక్షేమానికే ప్రాధాన్యత : పొంగులేటి
ప్రజా పాలనతో పాటు మనం కోరుకున్న ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నామని, ఇందిరమ్మ రాజ్యంలో పేదల సంక్షేమానికే ప్రాధాన్యత ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం రూరల్ మండలం మల్లెమడుగులో పల్లె దవాఖానా ప్రారంభోత్సవం సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో పేదల సమస్యలు తెలుసుకునేందుకు ప్రభుత్వ అధికారులే ప్రజల వద్దకు వస్తారని పొంగులేటి తెలిపారు.
ప్రజా పాలనలో దరఖాస్తులతో పేదల న్యాయమైన కోరికలను ఈ ప్రభుత్వం తీర్చుతుందన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం మాటలతోనే కాకుండా పేదలకు ఇచ్చిన గ్యారెంటీలను చేసి చూపిస్తుందన్నారు. గత ప్రభుత్వం అప్పులు చేసి పోయిందని, వారిలా మాటలు చెప్పి తప్పించుకునే ప్రభుత్వం మాది కాదన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని.. ఎన్ని అవాంతరాలు ఎదురైనా పేదలకు ఇచ్చిన హామీలను తప్పనిసరిగా నెరవేర్చుతామని పొంగులేటి తెలిపారు.
కంటతడి పెట్టిన పొంగులేటి
రాజకీయ జీవితంలో తాను ఎన్నో కష్టాలు, అనేక అవమానాలు విరించానని మంత్రి సొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. భక్తరామదాసు కళాక్షేత్రంలో గ్రూప్స్ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో రైట్ చాయిస్ ఆత్మీయ అభినందన సభలో ఆయన మాట్లాడారు. ఒకానొక సమయంలో కార్యకర్తలకు తెలియకుండా ఒంటరిగా కన్నీరు పెట్టుకున్నానని చెబుతూ భావోద్వేగానికి గురై కంట తడి పెట్టారు.
నాతో పాటు నన్ను నమ్ముకున్న వారందరినీ గత ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేసిందన్నారు. బాధను దిగమింగి ధైర్యం చెప్పాననన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో నిరుద్యోగ యువతకు భవిష్యత్తు ఉంటుందన్నారు. ఈ సందర్భంగా పొంగులేటి రాజకీయ ప్రస్థానం పై లఘు చిత్ర ప్రదర్శన నిర్వహించారు. చిత్ర రూపకర్త మెండం కిరణ్‌కుమార్‌ను పొంగులేటి అభినందించారు.