MLA Harish Rao | బడ్జెట్‌లో గ్యారంటీల అమలుపై స్పష్టత కరవు

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో ఆ పార్టీ ఇచిచ్న ఆరు గ్యారెంటీల అమ‌లుపై ప్ర‌జ‌ల‌కు స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేక‌పోయారని మాజీ మంత్రి, బీఆరెస్ సీనియర్ నేత టీ.హరీశ్‌రావు విమర్శించారు

  • By: Somu    latest    Feb 10, 2024 12:03 PM IST
MLA Harish Rao | బడ్జెట్‌లో గ్యారంటీల అమలుపై స్పష్టత కరవు
  • అరకొర నిధుల కేటాయింపులు
  • ఎన్నికల ప్రచారంలోనూ..అసెంబ్లీలోనూ వారివన్ని అబద్ధాలే
  • మాజీ మంత్రి టీ.హరీశ్‌రావు ఫైర్‌


MLA Harish Rao | విధాత : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో ఆ పార్టీ ఇచిచ్న ఆరు గ్యారెంటీల అమ‌లుపై ప్ర‌జ‌ల‌కు స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేక‌పోయారని మాజీ మంత్రి, బీఆరెస్ సీనియర్ నేత టీ.హరీశ్‌రావు విమర్శించారు. ఓట్ ఆన్ అకౌంట్ బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన అనంత‌రం హ‌రీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలకు, అన్నదాతల పథకాలకు బడ్జెట్‌లో అరకొర కేటాయింపులున్నాయన్నారు. అన్న‌దాత‌ల‌ను ఆగంజేసే విధంగా కాంగ్రెస్ బ‌డ్జెట్ ఉందన్నారు. వ్య‌వ‌సాయ రంగానికి రూ. 19,746 కోట్లు పెట్టారని, వీటిలో జీతాల‌కే రూ. 3 వేల కోట్లు పోతాయని, మిగిలిన రూ. 16 వేల కోట్ల‌తో రైతుల‌కు ఇచ్చిన హామీల‌ను ఎలా అమ‌లు చేస్తారని ప్రశ్నించారు.


కోటి 50 ల‌క్ష‌ల ఎక‌రాల భూమికి రైతు భ‌రోసాకే రూ. 22,500 కోట్లు కావాలని, డిసెంబ‌ర్ 9న రూ. 2 ల‌క్ష‌ల రైతు రుణ‌మాఫీ చేస్తామ‌ని మాట త‌ప్పారని,. రూ. 2 ల‌క్ష‌ల రుణ‌మాఫీకి రూ. 40 వేల కోట్లు అవ‌స‌మని, కానీ బ‌డ్జెట్‌లో పైసా కేటాయించ‌లేదన్నారు. అన్ని ర‌కాల పంట‌ల‌కు బోన‌స్ ఇస్తామ‌న్నారని, దీనికి రూ. 15 వేల కోట్లు అవ‌స‌రమని, ఇవ‌న్నీ అమ‌లు చేయాలంటే రూ. 82 వేల కోట్లు కావాలని, బ‌డ్జెట్‌లో కేటాయించింది కేవ‌లం రూ. 16 వేల కోట్లు మాత్ర‌మేనన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతుల ఆగ్ర‌హానికి గురికాక త‌ప్ప‌దు అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. రైతుల‌కు చాంతాడంత చేస్తామ‌ని చెప్పి చెంచాడంత కూడా నిధులు కేటాయించ‌లేద‌ని హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు.


రాష్ట్ర బ‌డ్జెట్ తెలంగాణ ప్ర‌జ‌ల‌ను తీవ్ర నిరాశ‌ప‌రిచిందన్నారు. రాష్ట్రంలో ప్ర‌జా పాల‌న అభాసుపాలైందని, కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్ర‌తి రోజూ సీఎం ప్ర‌జా ద‌ర్బార్ నిర్వ‌హిస్తామ‌న్నారని, వాగ్దాన భంగంతో కాంగ్రెస్ పాల‌న ప్రారంభ‌మైందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు ఎన్నిక‌ల ప్ర‌చారంలో అబ‌ద్దాలు చెప్పారని, నిండు అసెంబ్లీలోనూ అబ‌ద్దాలే చెప్పార‌ని హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు. శ్వేత ప‌త్రాల పేరుతో కాంగ్రెస్ కాలం గ‌డుపుతోందని, 6 గ్యారెంటీల‌కు చ‌ట్టం చేస్తామ‌న్న మాట‌లు ఏమ‌య్యాయని, కొండంత ఆశ చూపి గోరంత కూడా చేయ‌లేదని, రుణ‌మాఫీకి బ‌డ్జెట్‌లో రూపాయి కూడా కేటాయించ‌లేదని, నిరుద్యోగ భృతి గురించి బ‌డ్జెట్‌లో ప్ర‌స్తావ‌న లేదని హ‌రీశ్‌రావు నిల‌దీశారు.


రాష్ట్రంలో రైతుల‌కు 24 గంట‌ల క‌రెంట్ వ‌స్తుందా..? ఎక్క‌డ కూడా 15 గంట‌ల‌కు మించి క‌రెంట్ రావ‌డం లేదన్నారు. దీనిపై ఏ స‌బ్ స్టేష‌న్‌కైనా వెళ్దామ‌ని కాంగ్రెస్ నేత‌ల‌కు చాలెంజ్ విసురుతున్నానన్నారు. గ‌త కాంగ్రెస్ పాల‌న‌లో ఉచిత క‌రెంట్ అంతా ఉత్త క‌రెంట్ అని, బీఆర్ఎస్ పాల‌న‌లో ఉచిత క‌రెంట్‌తో రైతులు ఆనందంగా ఉన్నారన్నారు. చెరువులు బాగు చేసి, ఉచిత క‌రెంట్ ఇచ్చి రైతును రాజును చేసింది కేసీఆర్ ప్రభుత్వమన్నారు. రైతును మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. సమావేశంలో హరీశ్‌రావు వెంట మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులున్నారు.