అభయ హస్తం.. పేదల నేస్తం: ఎమ్మెల్యే కుంభం

కాంగ్రెస్ ప్రభుత్వం పేదల నేస్తంగా అభయ హస్తం గ్యారంటీ సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు

  • By: Somu    latest    Dec 30, 2023 12:30 PM IST
అభయ హస్తం.. పేదల నేస్తం: ఎమ్మెల్యే కుంభం

విధాత, ఉమ్మడి నల్లగొండ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం పేదల నేస్తంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అభయ హస్తం గ్యారంటీ సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని భువనగిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. శనివారం నియోజకవర్గంలోని వలిగొండ మండల కేంద్రం గ్రామ పంచాయతీలో ప్రజాపాలన గ్రామసభలో అభయ హస్తం పథకాల దరఖాస్తులను అధికారులతో కలిసి ప్రజల నుంచి స్వీకరించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ముంగిటిలోనే, ప్రజల మధ్యకు వచ్చి సంక్షేమ పథకాలను నేరుగా ప్రజలకు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీ మేరకు అభయ హస్తం ఆరు గ్యారంటీల అమలుపై సీఎం రేవంత్‌రెడ్డి తొలి సంతకం చేశారన్నారు. గత పదేళ్లలో అన్ని వర్గాల వారు ఇబ్బందులు పడ్డారని ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఉచిత వైద్యంకు దూరమయ్యారన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు.


ఆరోగ్యశ్రీ క్రింద వైద్య సహాయం 5లక్షల నుంచి 10లక్షలకు పెంచిందన్నారు. మహాలక్ష్మితో మహిళలు కుటుంబాన్ని నడిపేందుకు నెలకు 2500 రూ.లు ఇచ్చే కార్యక్రమం మొదలవుతుందని, 200 యూనిట్ల గృహజ్యోతి ఉచిత విద్యుత్, రైతు భరోసా క్రింద ఎకరానికి 15 వేలు, కౌలు రైతుకు 12 వేలు అందించడం జరుగుతుందని, చేయూత క్రింద 4 వేల నెలవారి పెన్షన్ అందించి ప్రభుత్వం మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని అన్నారు. పేదవానికి ఇండ్లు ఇచ్చే కార్యక్రమంలో ఏ పేదవాడు కూడా ఇళ్లు లేకుండా ఉండొద్దని, గౌరవంగా ఉండాలనేదే గృహలక్ష్మి ఇందిరమ్మ ఇండ్ల పథకమని అన్నారు.


ప్రజాపాలనతో ప్రతి ఒక్కరి దరఖాస్తు తీసుకుంటారని, ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నామన్నారు. నీటిపారుదల శాఖ, రోడ్లు భవనాల శాఖల మంత్రులు మన ఉమ్మడి జిల్లాకు చెందిన వారేనని, అన్ని పనులు చేపడతామన్నారు. మూసీ క్రింద 60 వేల ఎకరాలు సాగు అవుతున్నాయని, మూసీ కాలువల మరమ్మత్తులకు ప్రాధాన్యతనివ్వడం జరుగుతుందని, బునియాదిగాని కాలువపై ప్రత్యేక శ్రద్ధ పెడతామని, వందల కోట్ల నిధులతో కాలువల పనులు చేపడతామని, అవసరమైన చోట కాలువల మీద బ్రిడ్జిల నిర్మాణం చేపడతామని తెలిపారు.


రోడ్ల వెడల్పు, మరమ్మత్తులు చేపడతామని, చిట్యాల రోడ్డును 4 లేన్ల రోడ్డుగా చేస్తామని, మూసీ బ్రిడ్జికి మరమ్మత్తులు చేపడతామన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న మట్టి రోడ్లను బీటీ రోడ్లుగా మార్చడం, వలిగొండ రైల్వే స్టేషన్ రోడ్డు కూడా మరమ్మత్తుల జరిపిస్తామన్నారు. వలిగొండలో ఆసుపత్రిని కూడా పూర్తి చేసుకుంటామని ఈ ప్రభుత్వం అన్ని సమస్యలను పరిష్కరిస్తుందని, ప్రతి ఊరికి బస్సులు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని, ప్రజాప్రతినిధులు, అధికారుల భాగస్వామ్యంతో ఒక టీమ్‌గా ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలను చేపడతామని అన్నారు.


ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి, జిల్లా గ్రామిణాభిృద్ది అధికారి నాగిరెడ్డి, ఎంపీపీ నూతి రమేశ్ రాజు, జడ్పీటీసీ వాకిటి పద్మ, మండల స్పెషల్ ఆఫీసర్ శేఖర్ రెడ్డి, తహశీల్ధార్ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపిడిఓ గీతారెడ్డి, వైస్ ఎంపీపీ ఉమ, సర్పంచ్‌ లలిత శ్రీనివాస్, ఎంపీటీసీలు భాగ్యమ్మ, రమేశ్, యశోద, వార్డు మెంబర్లు, అధికారులు పాల్గొన్నారు.