కాంగ్రెస్ డీఎన్ఏలో హిందూ వ్యతిరేక ధోరణి
కాంగ్రెస్ డీఎన్ఏలోనే హిందూ వ్యతిరేక ధోరణి ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు.

- డీఎంకే నేతల వ్యాఖ్యలపై రాహుల్ స్పంధించాలి
- తెలంగాణలో హామీల అమలుకు మరికొంత సమయం ఇస్తాం
- బీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్: కాంగ్రెస్ డీఎన్ఏలోనే హిందూ వ్యతిరేక ధోరణి ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. సోమవారం హైదరాబాద్ లోని తన నివాసంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఇండియా కూటమిలో ఉన్న డీఎంకే నేతలు హిందువుల మనోభావాలు దెబ్బతినేలా, సనాతన ధర్మాన్ని అవమానిస్తూ మాట్లాడినప్పుడు, హిందీ మాట్లాడే రాష్ట్రాలను గోమూత్ర రాష్ట్రాలంటూ అవహేళన చేసినప్పుడు కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.
ఆ వ్యాఖ్యల పట్ల రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హిజాబ్ వివాదంపై కూడా రాహుల్ గాంధీ వైఖరిని వెల్లడించాలన్నారు. కాంగ్రెస్ అంటేనే మోసం, కుట్ర, మభ్యపెట్టడమని విమర్శించారు. తెలంగాణలో హామీల అమలుకు మరికొంత సమయం ఇస్తామని, తగిన సమయంలోగా హామీలు అమలు చేయకపోతే కచ్చితంగా పోరాటం చేస్తామని తెలిపారు.