Monsoon | జాడ లేని తొలకరి.. రుతుపవనాల రాక మరింత ఆలస్యం
విధాత: కేరళకు నైరుతి రుతుపవనాల (Monsoon) రాక మరింత ఆలస్యమవుతుందని వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది. ఏ రోజున అవి భారత్‌ను తాకుతాయన్న సమయాన్ని సైతం ఈ సారి ప్రకటించకపోవడం గమనార్హం. మాన్‌సూన్ రాకకు సహకరించే పశ్చిమ పవనాలు బలహీనపడటంతో తగినంత బలంగా మేఘాలు ఏర్పడలేదు. మరోవైపు ఆగ్నేయ అరేబియా సముద్రంపై అల్పపీడనం ఏర్పడటమూ రుతుపవనాలకు కావాల్సిన మేఘాల విస్తృతిని బలహీనపరిచింది. రానున్న 24 గంటల్లో ఇది తుపానుగా మారి వాయవ్య దిశగా కదులుతుందని ఐఎండీ తెలిపింది. […]

విధాత: కేరళకు నైరుతి రుతుపవనాల (Monsoon) రాక మరింత ఆలస్యమవుతుందని వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది. ఏ రోజున అవి భారత్‌ను తాకుతాయన్న సమయాన్ని సైతం ఈ సారి ప్రకటించకపోవడం గమనార్హం. మాన్‌సూన్ రాకకు సహకరించే పశ్చిమ పవనాలు బలహీనపడటంతో తగినంత బలంగా మేఘాలు ఏర్పడలేదు.
మరోవైపు ఆగ్నేయ అరేబియా సముద్రంపై అల్పపీడనం ఏర్పడటమూ రుతుపవనాలకు కావాల్సిన మేఘాల విస్తృతిని బలహీనపరిచింది. రానున్న 24 గంటల్లో ఇది తుపానుగా మారి వాయవ్య దిశగా కదులుతుందని ఐఎండీ తెలిపింది. ఈ తుపాను గోవాకు పశ్చిమంగా 920 కి.మీ. ముంబయికి దక్షిణంగా 1120 కి.మీ, పోరుబందర్‌కు 1160 కి.మీ. దూరంలో ఉందని వెల్లడించింది.
సాధారణంగా జూన్1 కల్లా నైరుతి రుతుపవనాలు కేరళను తాకి, జులై 15కల్లా దేశం మొత్తం విస్తరించాల్సి ఉంది. ఈ సారి కాస్త ఆలస్యంగా జూన్ 4న రుతుపవనాలు వస్తాయని వాతావరణ శాఖ భావించినప్పటికీ.. తాజాగా ఆ అంచనాలను సవరించింది. అయితే జూన్ 8న కేరళను రుతుపవనాలు తాకే అవకాశముందని సంబంధిత శాస్త్రవేత్త ఒకరు తెలిపారు.
ప్రస్తుతం మేఘాలు పూర్తి స్థాయిలో ఆవృతమవుతున్నాయని, పరిస్థితులు సానుకూలంగా ఉంటే త్వరలోనే తొలకరి పలకరిస్తుందని తెలిపారు. ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అంచనా వేయగా.. సాధారణం కంటే తక్కువగానే వర్షాలు ఉండొచ్చని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ ప్రకటించింది.
రుతుపవనాలే ఆధారం..
బారత ఆర్థికవ్యవస్థ రుతుపవనాల మీదే ఆధారపడి ఉంది. 51 శాతం వ్యవసాయ భూమి రతుపవనాల నుంచి వర్షపాతాన్ని పొందుతుండగా.. కనీసంలో కనీసం 47 శాతం ప్రజలకు ఈ వర్షాలే దిక్కు. అత్యల్ప వర్షపాతం నమోదైతే దేశం మొత్తం ఆర్థికంగానూ, సామాజికంగానూ దెబ్బతినే ప్రమాదముంది.