MP Mahua Moitra: పిల్లలున్న వ్యక్తితో.. మహిళా ఎంపీ రహాస్యంగా రెండో పెళ్లి! ఆమెకు50.. ఆయనకు 65..!

MP Mahua Moitra: పశ్చిమ బెంగాల్ కు చెందిన అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా విదేశాల్లో రహస్యంగా పెళ్లిచేసుకున్న కథనాలు వైరల్ గా మారాయి. ఒడిశాకు చెందిన బీజు జనతాదళ్ (బీజేడీ) సీనియర్ నేత, పూరీ మాజీ ఎంపీ పినాకి మిశ్రాను మే 30న జర్మనీలో ఆమె వివాహం చేసుకున్నట్లు టెలిగ్రాఫ్ పేర్కొంది. పెళ్లి కూతురు గెటప్ లో సాంప్రదాయ దుస్తులు ధరించి, బంగారు ఆభరణాలతో ముస్తాబైన 50ఏళ్ల మహువా మొయిత్రా, 65ఏళ్ల మిశ్రా చేయిపట్టుకున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే మహువాతో పాటు టీఎంసీ కూడా ఈ పెళ్లి గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. మహువా మొయిత్రా గతంలో తొలుత డానిష్ ఫైనాన్షియర్ లార్స్ బ్రూర్సెన్‌ను పెళ్లి చేసుకున్నది. కొంత కాలం తర్వాతా వారు విడాకులు తీసుకున్నారు. అనంతరం న్యాయవాది జై అనంత్ దేహద్రాయ్‌తో మూడేళ్ల పాటు ఆమె రిలేషన్ కొనసాగించింది. అయితే మోసం చేసే మాజీ ప్రేమికుడని ఆమె ఆరోపించడంతో వారి మధ్య బంధానికి తెరపడినట్లయ్యింది.
అస్సాంలో జన్మించిన మహువా మొయిత్రా పెట్టుబడి బ్యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. 2010లో మమతా బెనర్జీ టీఎంసీ పార్టీలో ఆమె చేరింది. 2019లో పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణనగర్ నియోజకవర్గం నుంచి తొలిసారి లోక్‌సభకు ఎన్నికైంది. 2024లో మరోసారి విజయం సాధించింది. టీఎంసీ ఫైర్ బ్రాండ్‌గా పేరుగాంచిన మహువా మొయిత్రాపై గతంలో బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే.. మహువా డబ్బులు తీసుకొని లోక్‌సభలో ప్రశ్నలు అడిగారని ఆరోపించారు. దీంతో ఈ వ్యవహారంలో నిజానిజాలను నైతిక విలువల కమిటీ తేల్చిచెప్పింది. ఆ దరిమిలా మహువా లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేసి, సభ నుంచి బహిష్కరిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ఇది 2023 డిసెంబర్‌లో జరిగింది. మహువా ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేశారు. పార్లమెంటు లాగిన్ ఐడి, పాస్‌వర్డ్‌ను తన స్నేహితురాలు హిరానందనితో పంచుకున్నట్లు కూడా మహువాపై ఆరోపణలు వచ్చాయి.
మహువా మొయిత్రా పెళ్లి చేసుకున్నట్లుగా భావిస్తున్న మాజీ ఎంపీ పినాకి మిశ్రా సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది. మొదటిసారిగా 1996లో కాంగ్రెస్ టికెట్‌పై పూరీ నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు. సెయింట్ స్టీఫెన్స్ కళాశాల పూర్వ విద్యార్థి అయిన ఆయన ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి న్యాయ పట్టా పొందారు.1996, 2009 నుండి 2019 వరకు మూడు పర్యాయాలు ఆయన ఎంపీగా పనిచేశారు. మిశ్రా 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్నారు. ఆ సీటు బీజేపీకి చెందిన సంబిత్ పాత్రకు కేటాయించారు. మిశ్రాకు గతంలో వివాహం కాగా..ఆయనకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.