కాంగ్రెస్‌లోకి మైనంపల్లి.. రోహిత్‌లు

  • By: Somu    latest    Sep 23, 2023 12:20 PM IST
కాంగ్రెస్‌లోకి మైనంపల్లి.. రోహిత్‌లు
  • మెదక్ టికెట్ రేసులో రోహిత్
  • మారనున్నరాజకీయ సమీకరణలు
  • చీలనున్న బీఆరెస్ పార్టీ
  • సైలెంట్ అయిన ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి..

విధాత: మెదక్ ప్రత్యేక ప్రతినిధి: మెదక్ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత మల్కాజిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు బీఆరెస్ పార్టీకి రాజీనామా చేయడంతో మెదక్ నియోజక వర్గంలో రాజకీయ సమీకరణలు మారనున్నాయి. మెదక్ ఉమ్మడి జిల్లాలో పట్టున్న నాయకుడు మైనంపల్లి దాదాపు కాంగ్రెస్ పార్టీ లో చేరనున్నట్లు తెలుస్తుంది. మెదక్, రామాయంపేట, నియోజక వర్గాల నుండి గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన మైనంపల్లి హన్మంతరావు ఉమ్మడి మెదక్ జిల్లా టీడీపీ అధ్యక్షులుగా సుదీర్ఘ కాలం పాటు పనిచేశారు.

ప్రత్యేకంగా మెదక్ నియోజక వర్గంతో పాటు రద్దయిన రామాయంపేట నియోజక వర్గంలోని ప్రతి గ్రామంలో ఆయన అనుచరులు ఉన్నారు. అన్ని గ్రామాలలో ఆయనకు పట్టుంది .హన్మంతరావు, ఆయన కుమారుడు రోహిత్ రావు కాంగ్రెస్ పార్టీ లో చేరితే ఆ పార్టీకి మరింత బలం చేకురడం ఖాయంగా కనిపిస్తోంది.

చీలనున్న బీఆరెస్

బీఆరెస్ పార్టీలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిని వ్యతిరేకిస్తున్న వర్గం మైనంపల్లి వెంటే నడువనున్నారు. రామాయంపేట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గంగా నరేందర్, చిన్న శంకరంపేట సర్పంచ్ రాజిరెడ్డి, తెలంగాణ ఉద్యమ విద్యార్థి నాయకుడు జీవన్ రావు, పపాన్నపెట్ ఎంపీపీ చందన ప్రశాంత్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ బాలగౌడ్‌, శంకరం పెట్ మాజీ ఎంపీపీ అరుణ ప్రభాకర్ తోపాటు నియోజక వర్గంలోని అన్ని మండలాల్లోని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి వ్యతిరేక వర్గం అంతా మైనంపల్లి ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన కోసమే పని చేయనున్నారు.

ఒక వేళ కాంగ్రెస్ లోకి మైనంపల్లి హన్మంతరావు, రోహిత్ లు చేరితే వారి వెంటే వారంతా ఆ పార్టీలోకి వెళ్లనున్నారు. ఇదిలా వుండగా 2001నుంచి బీఆరెస్‌లో చురుకుగా పనిచేసిన ఉద్యమ కారుల జాబితాను మైనంపల్లి సేకరించి వారికి ప్రత్యేకంగా ఫోన్లు చేస్తున్నట్లు సమాచారం. దీనికి తోడు ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న వారందరితో ఇప్పటికే మాట్లాడినట్లు సమాచారం.

మెదక్ కాంగ్రెస్ టికెట్ మైనంపల్లి రోహిత్ కే..?

బీఆరెస్‌ పార్టీ కీ రాజీనామా చేసిన ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, అయనకుమారుడు రోహిత్ లు కాంగ్రెస్ పార్టీ లో ఈ నెలాఖరులోగా చేరనన్నునట్లు సమాచారం. మెదక్ అసెంబ్లీ నియోజక వర్గ కాంగ్రెస్ టికెట్ మైనంపల్లి రోహిత్ కు కేటాయించనున్నట్లు తెలస్తోంది. తనకు, తన కుమారుడికి రెండు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేలా మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పెద్దలతో ఒప్పందం కుదిరిందని సమాచారం. అలా కుదరక పోతే మల్కాజిగిరి పార్లమెంట్ కు మైనంపల్లి హన్మంతరావు ను కాంగ్రెస్ పార్టీ పోటీ చేయించనున్నట్లు తెలుస్తోంది.

మెదక్ బరిలో మాత్రం ఆయన కుమారుడు రోహిత్ కు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయిస్తారని సమాచారం. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, దుద్దిళ్ల శ్రీదర్ బాబు, సునీల్ కనుగోలుల ద్వారా ఢిల్లీలో ఏఐసీసీ నాయకులను మైనంపల్లి సంప్రదిస్తున్నారనీ వార్తలు వస్తున్నాయి. మల్కాజిగిరి, లేదా కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల నుండి సైతం కాంగ్రెస్ పార్టీ టికెట్ మైనంపల్లి ఆశిస్తున్నారు. పార్టీ అధిష్టాన వర్గం ఏలా స్పందిస్తుందో వేచి చూడాలి.

సైలెంట్ గా ఎమ్మెల్సీ శేరి!

సీఎం రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి సైలెంట్ అయ్యారు. ఆయన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన సైలెంట్ అయ్యారు. ఆయన వర్గం అంతా ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు వెంట నడుస్తున్నారు. ఆయన సోదరుడు హవేలీ గణపురం ఎంపీపీ శేరి నారాయణ రెడ్డి గతంలోనే ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి కి టికెట్ కేటాయింపు పై పున పరిశీలన చేయాలని మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి మాత్రం బీఆరెస్‌ పార్టీకి వ్యతిరేకంగా నడవనప్పటికి ప్రస్తుతానికి సైలెంట్ అయ్యారు. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారోనని రాజకీయ పరిశీలకులు వేచి చూస్తున్నారు.

మైనంపల్లి అనుచరుడు బక్కికి పదవి..

మైనంపల్లిని బలహీనం చేసే వ్యూహంలో భాగంగా ఆయన ప్రధాన అనుచరుడైన బక్కి వెంకటయ్యకు రెండు రోజుల క్రితం ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా సీఎం కేసీఆర్ నియమించారు. టీడీపీ పార్టీలో మైనంపల్లి హన్మంతరావు జిల్లా అధ్యక్షునిగా ఉన్న సమయంలో బక్కివెంకటయ్య ఆయనతో సన్నితంగా ఉండేవారు.

మరోవైపు మైనంపల్లి, ఆయన కొడుకు కాంగ్రెస్‌లో చేరికలకు సంబంధించి ముందుగా మెదక్ నియోజవర్గం కాంగ్రెస్ నాయకులతో రాష్ట్ర నాయకత్వం చర్చలు జరుపుతోంది. ఇక్కడి నుంచి టికెట్ ఆశించిన డీసీసీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, మ్యాడమ్ బాలకృష్ణ, సుప్రభాత రావులతో పార్టీ నాయకత్వం చర్చలు జరిపి మైనాంపల్లి చేరికకు సజావుగా సాగేలా ప్రయత్నిస్తుండటం ఆసక్తికరం.