New JNU Rules | నిరాహార దీక్షలో కూర్చుంటే 20వేలు కట్టాల్సిందే

ధర్నాలు, ప్రదర్శనల్లో పాల్గొన్నా అంతే.. అవమానకరంగా వ్యవహరిస్తే 50 వేలు ఫైన్‌ అవసరమైతే రస్టిగేట్‌ చేసే అవకాశం ఢిల్లీ జేఎన్‌యూలో కొత్త నిబంధనలు అమల్లోకి జేఎన్‌యూ (JNU) అనేది దేశ విద్యార్థి రాజకీయాలకు కేంద్ర స్థానంగా భావిస్తుంటారు. భావి మేధో సంపద.. ఇక్కడనే తయారవుతుంది. అంతటి కీలక వర్సిటీలో రాజకీయాలనే నిషేధించేలా కొత్త నిబంధనలను మేనేజ్‌మెంట్ తీసుకురావడం వివాదాస్పదమవుతున్నది. ఇది తుగ్లక్‌ కోడ్‌ తరహాలో ఉన్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిరంకుశ నిబంధనలు ఉపసంహరించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్‌ […]

  • By: krs    latest    Mar 02, 2023 10:21 AM IST
New JNU Rules | నిరాహార దీక్షలో కూర్చుంటే 20వేలు కట్టాల్సిందే
  • ధర్నాలు, ప్రదర్శనల్లో పాల్గొన్నా అంతే..
  • అవమానకరంగా వ్యవహరిస్తే 50 వేలు ఫైన్‌
  • అవసరమైతే రస్టిగేట్‌ చేసే అవకాశం
  • ఢిల్లీ జేఎన్‌యూలో కొత్త నిబంధనలు అమల్లోకి

జేఎన్‌యూ (JNU) అనేది దేశ విద్యార్థి రాజకీయాలకు కేంద్ర స్థానంగా భావిస్తుంటారు. భావి మేధో సంపద.. ఇక్కడనే తయారవుతుంది. అంతటి కీలక వర్సిటీలో రాజకీయాలనే నిషేధించేలా కొత్త నిబంధనలను మేనేజ్‌మెంట్ తీసుకురావడం వివాదాస్పదమవుతున్నది. ఇది తుగ్లక్‌ కోడ్‌ తరహాలో ఉన్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిరంకుశ నిబంధనలు ఉపసంహరించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

విధాత : దేశానికి అనేక మంది రాజకీయ నాయకులను అందించిన ఢిల్లీ జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (JNU) వివాదాస్పద కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. వీటి ప్రకారం ఎవరైనా విద్యార్థులు నిరాహార దీక్ష లేదా ధర్నాలో పాల్గొంటే 20వేలు ఫైన్‌ కట్టాల్సి ఉంటుంది. ఎవరి పట్లనైనా అభ్యంతరకరంగా ప్రవర్తిస్తే 50వేలు జరిమానా (Heavy Fines) విధిస్తారు.

ఈ మేరకు బుధవారం ఒక నోటిఫికేషన్‌ను జేఎన్‌యూ యాజమాన్యం విడుదల చేసింది. అవసరాన్ని బట్టి సదరు విద్యార్థిని రస్టిగేట్‌ చేస్తామని హెచ్చరించింది. సవరించిన కొత్త నిబంధనలను (Disciplinary Rules) జేఎన్‌యూ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ ఆమోదించినట్టు పేర్కొన్నది. దీనిపై విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

కొత్త నిబంధనల ప్రకారం యూనివర్సిటీ క్యాంపస్‌లో నిరాహార దీక్షలు, ధర్నాలు, సమూహాలుగా వచ్చి చర్చలు జరపడం, వర్సిటీ గేట్లను, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసు ద్వారాలు దిగ్బంధించడం నిషేధం. వర్సిటీలో ఏ విద్యార్థి రాకపోకలను ఇబ్బంది పెట్టడమూ క్షమార్హం కాదు. వీటికి రూ.20 వేల వరకు జరిమానా విధిస్తారు.

విద్యార్థులు లేదా వర్సిటీ సిబ్బందిని బెదిరించినా, అవమానించే రీతిలో ప్రవర్తించినా (భౌతిక దాడులు, దుర్భాషలాడటం, చేయి చేసుకోవడం) 50 వేలు జరిమానా విధించడంతోపాటు అవసరమైతే సదరు విద్యార్థిని రస్టిగేట్‌ చేస్తామని పేర్కొన్నది.

యూనివర్సిటీ సిబ్బంది ఇండ్ల ముందు ఘెరావ్‌ చేయడం, బైఠాయించడం, నిరసన ప్రదర్శనకు దిగడం వంటివి చేసినా 20వేలు జరిమానా విధిస్తామని, అడ్మిషన్‌ను రద్దు చేస్తామని హెచ్చరించింది.

కొత్త నిబంధనలపై వివిధ విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ కొత్త నిబంధనలను వెంటనే వాపస్‌ తీసుకోవాలని జేఎన్‌యూ ఏబీవీపీ కార్యదర్శి (JNU ABVP secretary) వికాస్‌ పటేల్‌ డిమాండ్‌ చేశారు. దీన్ని తుగ్లక్‌ కోడ్‌గా ఆయన అభివర్ణించారు. ఇప్పటివరకు ఉన్న నిబంధనలు పకడ్బందీగానే ఉన్నాయని, కొత్త నిబంధనల అవసరం లేదని ఆయన తేల్చి చెప్పారు.

వీటి బదులు వర్సిటీలో భద్రత, లా అండ్‌ ఆర్డర్‌ను మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులతో ఎలాంటి చర్చలు జరుపకుండానే యాజమాన్యం ఈ నిరంకుశ నిబంధనలు (Draconian Code of Conduct) అమల్లోకి తెచ్చిందని ఆయన మండిపడ్డారు.