మణిపూర్ క్యాడర్ ఐపీఎస్‌లకు కేంద్ర పారామిలటరీ బలగాల్లో టాప్ పోస్టులు
ముగ్గురు మణిపూర్ క్యాడర్ సీనియర్ ఐపీఎస్ అధికారులను కేంద్ర ప్రభుత్వం గురువారం కేంద్ర పారామిలటరీ బలగాలకు చీఫ్‌లుగా నియమించింది

- సీఐఎస్ఎఫ్ తొలి మహిళా డీజీగా నైనా సింగ్
- ఐటీబీపీ చీఫ్‌గా రాహుల్ రస్‌గోత్రా నియామకం
- సీఆర్‌పీఎఫ్ డీజీగా అనీష్ దయాల్ సింగ్
విధాత: ముగ్గురు మణిపూర్ క్యాడర్ సీనియర్ ఐపీఎస్ అధికారులను కేంద్ర ప్రభుత్వం గురువారం కేంద్ర పారామిలటరీ బలగాలకు చీఫ్‌లుగా నియమించింది. సీఐఎస్ఎఫ్ తొలి మహిళా డీజీగా నైనా సింగ్, ఐటీబీపీ చీఫ్‌గా రాహుల్ రస్‌గోత్రా, సీఆర్‌పీఎఫ్ డీజీగా అనీష్ దయాల్ సింగ్‌కు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు గురువారం కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది.
ప్రస్తుతం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) స్పెషల్ డీజీగా పనిచేస్తున్ననైనా సింగ్‌కు డైరెక్టర్ జనరల్‌గా నియమించారు. ఆమె మొట్టమొదటి మహిళా డైరెక్టర్ జనరల్‌గా ఇప్పుడు బాధ్యతలు చేపట్టబోతున్నారు. దేశవ్యాప్తంగా విమానాశ్రయాలు, ఢిల్లీ మెట్రో, ప్రభుత్వ భవనాలు, ఇతర సంస్థల్లో భద్రతా చర్యలను సీఐఎస్ఎఫ్ పర్యవేక్షిస్తున్నది. మణిపూర్-క్యాడర్ ఐపీఎస్ అధికారిగా సివిల్ సర్వీస్‌లో చేరిన ఆమె తర్వాత రాజస్థాన్ క్యాడర్‌కు మారారు. గత కొంతకాలంగా సీఐఎస్ఎఫ్ డీజీగా ఆమె అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్నారు. వచ్చే ఏడాది జూలై 31 వరకు ఆమె ఆ పదవిలో ఉండనున్నారు.
1988 బ్యాచ్‌కు చెందిన మణిపూర్-క్యాడర్ ఐపీఎస్ అధికారి అనిష్ దయాల్ సింగ్, ప్రపంచంలోనే అతిపెద్ద పారామిలిటరీ దళం అయిన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. ఐటీబీపీకి అధిపతిగా ఉండటంతో పాటు కొన్నివారాలుగా ఆయన అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2024న డిసెంబర్ 31 పదవీ విరమణ చేసే వరకు అనిష్ సీఆర్‌పీఎఫ్ నాయకత్వం వహిస్తారు. ఈ దళంలో దాదాపు 3.25 లక్షల మంది సిబ్బంది ఉన్నారు. శాంతి పరిరక్షణ కోసం దేశమంతటా విస్తరించి ఉన్నది. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో కూడా చురుకైన పాత్ర పోషిస్తున్నది.
మణిపూర్ క్యాడర్‌కు చెందిన 1989-బ్యాచ్ ఐసీఎప్ అధికారి రాహుల్ రస్‌గోత్రాకు ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. ఈ దళలో దాదాపు 90,000 మంది సిబ్బంది ఉన్నారు. రస్‌గోత్రా దాదాపు మూడు దశాబ్దాలపాటు ఇంటెలిజెన్స్ బ్యూరోలో ముఖ్యమైన బాధ్యతలు నిర్వహించారు. 2025 సెప్టెంబర్ 30 వరకు అంటే పదవీ విరమణ తేదీ వరకు ఆయన ఐటీబీపీ డీజీగా ఉంటారని ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొన్నది.