ప్రధాని మోడీకి ప్రత్యామ్నాయం లేదు: అజిత్ పవార్

ప్రస్తుతం దేశంలో ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యామ్నాయం లేదని ఎన్సీపీ నేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అన్నారు

  • By: Somu    latest    Dec 25, 2023 11:48 AM IST
ప్రధాని మోడీకి ప్రత్యామ్నాయం లేదు: అజిత్ పవార్

విధాత: ప్రస్తుతం దేశంలో ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యామ్నాయం లేదని ఎన్సీపీ నేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అన్నారు. వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలు రాబోతున్న తరుణంలో సోమవారం ఆయన మీడియాతో చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి. 2024 లోక్ సభ ఎన్నికలపై ప్రతిపక్షాలు ప్రధాని మోడీని సవాల్ చేయాలనుకుంటున్నాయని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించారు.


ప్రస్తుతం దేశంలో ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యామ్నాయం లేదని, ఇలాంటి నిర్ణయం ఒకటి, రెండు అంశాల ఆధారంగా కాకుండా.. వివిధ అంశాల ఆధారంగా తీసుకోబడిందని అజిత్ పవార్ అన్నారు. ‘దేశ ప్రయోజనాలను ఎవరు రక్షిస్తారు. దేశం ఎవరి చేతుల్లో సురక్షితంగా, పటిష్టంగా ఉంటుంది. అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్టను ఎవరు పెంచుతారనే పలు అంశాలు చాలా ముఖ్యమైనవి’ అని అన్నారు.


ఈ నేపథ్యంలో ఇండియా కూటమిలోని పలు విభేదాల కారణంగా ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో మోడీకి ప్రత్యామ్నాయం లేదని ఆయన వ్యాఖ్యానించారు. అయితే గమనించవలసిన విషయం ఏమంటే, మహారాష్ట్రలో బీజేపీ మద్దతుతోనే అజిత్ పవార్ డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యారు. అజిత్ పవార్ వ్యాఖ్యల వెనుక ఆయన మోడీ రుణం తీర్చుకొనే రాజకీయం వుందని మహారాష్ట్ర రాజకీయ విశ్లేషకుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.