Ajit Pawar | సోదరిపై భార్యను పోటీ పెట్టి తప్పు చేశా : అజిత్‌పవార్
ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో తన సోదరి సుప్రియా సూలేపై తన భార్య సునేత్ర పవార్‌ను పోటీకి దింపి తప్పు చేశానని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ అన్నారు.

ముంబై: ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో తన సోదరి సుప్రియా సూలేపై తన భార్య సునేత్ర పవార్‌ను పోటీకి దింపి తప్పు చేశానని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ అన్నారు. బారామతి లోక్‌సభ స్థానంలో శరద్‌పవార్ కూతురు సుప్రియా సూలేపై ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ పోటీచేసి ఓడిపోయిన విషయం విదితమే. సునేత్ర పవార్ ఆ తర్వాత రాజ్యసభ సభ్యురాలుగా ఎన్నికయ్యారు. ముఖమంత్రి లడ్‌కీ బహన్ యోజన ప్రారంభం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అజిత్‌పవార్ మాట్లాడారు. అజిత్‌పవార్ లోక్‌సభ ఎన్నికలకు కొంతకాలం ముందు ఎన్సీపీ నుంచి విడిపోయి సంకీర్ణ ప్రభుత్వంలో చేరారు. ‘నేను నా చెల్లెళ్లందరినీ ప్రేమిస్తాను. కుటుంబాల్లోకి రాజకీయాలు రానివ్వకూడదు. నా చెల్లెపై నా భార్యను పోటీ పెట్టి తప్పు చేశాను. అలా జరిగి ఉండకూడదు. కానీ పార్లమెంటరీ పార్టీ ఆ నిర్ణయం చేసింది. అది తప్పని ఇప్పుడు భావిస్తున్నాను’ అని అజిత్‌పవార్ అన్నారు.