అవిశ్వాస ఘంటికలు!

తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపాల్టీల్లో అవిశ్వాస ఘంటికలు మారుమ్రోగుతున్నాయి.

  • By: Somu |    latest |    Published on : Jan 06, 2024 12:53 PM IST
అవిశ్వాస ఘంటికలు!
  • 36 చోట్ల చైర్మన్లకు పదవీ గండం
  • వాటిలో 29చోట్ల గులాబీ చైర్మన్లకే
  • జోరందుకున్న క్యాంపు రాజకీయం
  • స్టే తెచ్చుకునేందుకు కోర్టుకు పరుగు

విధాత : తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపాల్టీల్లో అవిశ్వాస ఘంటికలు మోగుతున్నాయి. గత బీఆరెస్‌ ప్రభుత్వం మూడేళ్ల పదవీకాలం అనంతరం చైర్మన్లు, వైస్‌ చైర్మన్లపై అవిశ్వాసం పెట్టవచ్చన్న నిబంధనను నాలుగేళ్లకు మార్చుతూ మున్సిపల్‌ చట్ట సవరణ చేసింది. అయితే గవర్నర్‌ తమిళిసై దీనిని ఆమోదించకపోవడం, ఇదే క్రమంలో రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో మున్సిపాల్టీ పాలక వర్గాల్లో ఒక్కసారిగా అసమ్మతి భగ్గుమన్నది. అవిశ్వాస తీర్మానాలకు తెరలేచింది. గతంలో కాంగ్రెస్‌ కౌన్సిలర్లను, కార్పొరేటర్లను తమవైపు లాగేసుకుని బీఆరెస్‌ పాగా వేసిన మున్సిపాల్టీలను ఇప్పుడు హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్‌ భావిస్తున్నది.


ఈ నేపథ్యంలో మున్సిపాల్టీల్లో కౌన్సిలర్ల బలాబలాల్లో వేగంగా మార్పులు చోటుచేసుకుని అవిశ్వాస తీర్మానాలకు బలం చేకూరుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా గత జనవరిలో 36 మున్సిపాల్టీల్లో చైర్మన్‌, మేయర్లు, వైస్‌ చైర్మన్లపై అవిశ్వాసం ప్రతిపాదించిన తీరు అవిశ్వాస రాజకీయాలకు పరాకాష్టగా చెప్పవచ్చు. ఇందులో 29 మున్సిపాల్టీలలో బీఆరెస్‌ చైర్మన్లపైన అవిశ్వాసం ప్రతిపాదించారు. గత మున్సిపల్‌ ఎన్నికల్లో అప్పటి అధికార బీఆరెస్‌ రాష్ట్రంలోని 128 మున్సిపాల్టీల్లో, 13 కార్పొరేషన్లలో సింహభాగం పాలకవర్గాలను కైవసం చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలువురు బీఆరెస్‌ కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరారు. దీంతోపాటు సొంత పార్టీలోని అసమ్మతి కారణంగా బీఆరెస్‌ కౌన్సిలర్లు మెజార్టీగా అవిశ్వాసాలకు మద్దతునిస్తున్నారు.

జోరుగా క్యాంపు రాజకీయాలు

పట్టణాల్లో భూములు ధరలు.. ఇండ్ల నిర్మాణాలు పెరిగిపోయిన నేపథ్యంతోపాటు మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు కూడా అందుతుండటంతో మున్సిపాల్టీల్లో అధికార సాధనకు పోటాపోటీ నెలకొంది. దీంతో అవిశ్వాస రాజకీయాలు జోరందుకోగా, అవిశ్వాసం పెట్టిన కౌన్సిలర్లతో చైర్మన్‌ పదవులు ఆశిస్తున్న వారు క్యాంపు రాజకీయాలు చేస్తున్నారు. మూడేళ్లపాటు అధికారంలో ఉన్నవారిని చూసి తమకు కూడా అధికారం కావాలన్న లక్ష్యంతో కొందరు కౌన్సిలర్లు ఉంటే.. ఇంకొందరు అవిశ్వాసం వంటి సందర్భాలు వచ్చినప్పుడే క్యాంపు రాజకీయాలతో నాలుగురాళ్లు వెనుకేసుకోవచ్చని చూస్తున్నారు. అవిశ్వాస రాజకీయాలకు పార్టీల ప్రతిష్ఠ కంటే ఆర్థిక కోణాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అవిశ్వాస రాజకీయాల్లో తొలి వికెట్‌గా ఆర్మూర్‌ మున్సిపాల్టీ చైర్‌ పర్సన్‌ పండిత్‌ వినీతను దించేశారు. ఇక్కడ గత అసెంబ్లీ ఎన్నికల్లో జీవన్‌రెడ్డికి వ్యతిరేకంగా పనిచేశారనే కోపంతో బీఆరెస్‌ కౌన్సిలర్లు అవిశ్వాసం తీర్మానంతో ఆమెను పదవి నుంచి తప్పించారు.

అవిశ్వాసం కత్తి నీడన మున్సిపాల్టీలు..

అవిశ్వాసం ప్రతిపాదిత మున్సిపాల్టీలు 36 వరకు ఉండగా, అందులో హెచ్‌ఎండీఏ పరిధిలో ఆరు మున్సిపాల్టీల్లో అవిశ్వాసాలు ప్రతిపాదించడం గమనార్హం. హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథార్టీ పరిధిలో మేడ్చల్‌, దమ్మాయిగూడ, గుండ్లపోచంపల్లి, ఆదిబట్ల, నాగారం, పెద్ద అంబర్‌పేట్‌, జవహర్‌నగర్‌ మున్సిపాల్టీల్లో అవిశ్వాస తీర్మానాలకు నోటీస్‌లు ఇచ్చారు. నర్సంపేటలో, నల్లగొండలో 8న, 12న బెల్లంపల్లి, నర్సాపూర్‌, 19న చేర్యాల, 20న కాగజ్‌ నగర్‌ మున్సిపాల్టీల్లో అవిశ్వాసాలపై ఓటింగ్‌ జరుగనుంది. నేరడుచర్ల, భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, చౌటుప్పల్‌, కోస్గి, నారాయణఖేడ్‌, వర్ధన్నపేట, భూపాలపల్లిలలో అవిశ్వాస తీర్మానాలపై ఓటింగ్‌ జరుగాల్సివుంది.

వీరిలో చౌటుప్పల్‌, యాదగిరిగుట్ట చైర్మన్లు కాంగ్రెస్‌లో చేరిపోవడంతో తాత్కాలికంగా పదవీగండం తప్పింది. జమ్మికుంట, ఇల్లెందు చైర్మన్లపైన, ఆదిబట్ల చైర్‌పర్సన్‌పైన, కామారెడ్డి వైస్‌ చైర్‌ పర్సన్‌పైన అవిశ్వాసం నోటీస్‌లు ఇచ్చారు. కాంగ్రెస్‌లో గెలిచి బీఆరెస్‌లో చేరి చైర్‌ పర్సన్‌ అయిన ఆర్తిక అప్పటి స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో విబేధాలతో బీఆరెస్‌ నుంచి మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. అయితే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వర్గీయుడు నిరంజన్‌రెడ్డి ఆమెకు వ్యతిరేకంగా తన మద్దతుదారులతో కలిసి అవిశ్వాసం నోటీస్‌ ఇచ్చారు.

హైకోర్టుకు చైర్మన్ల పరుగులు

అవిశ్వాసం గండం గట్టేక్కేందుకు నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మున్సిపాల్టీ చైర్మన్‌ అంకం రాజేందర్‌, వైస్‌ చైర్మన్‌ ఖలీల్‌ అహ్మద్‌లపై పెట్టిన అవిశ్వాసం నాటకీయ ఫక్కీలో చివరి నిమిషంలో రద్దయ్యింది. 12మంది కౌన్సిలర్లకుగాను 9మంది అవిశ్వాసంపై సంతకాలు చేశారు. చైర్మన్‌, వైస్‌ చైర్మన్లు హైకోర్టును ఆశ్రయించి స్టే ఆర్డర్‌ సాధించడంతో ఓటింగ్‌ ప్రక్రియ ఆఖరి క్షణంలో నిలిచిపోయింది. నల్లగొండ జిల్లా నందికొండ (నాగార్జున సాగర్‌) మున్సిపాల్టీ చైర్మన్‌పై పెట్టిన అవిశ్వాసం తీర్మానం ఓటింగ్‌ సైతం శుక్రవారం జరుగాల్సివున్న హైకోర్టు స్టేతో అదికూడా ఓటింగ్‌ రోజునే నిలిచిపోయింది. భువనగిరిలో ఈ నెల 23న అవిశ్వాసంపై ఓటింగ్‌ జరుగనుంది.


35మంది కౌన్సిలర్లలో 31 మంది అవిశ్వాసానికి మద్దతు ఇస్తుండటంతో ప్రస్తుత చైర్మన్‌ ఎనబోయిన ఆంజనేయులు, వైస్‌ చైర్మన్‌ చింతల కిష్టయ్య పదవి నుంచి దిగాల్సిన పరిస్థితి నెలకొంది. నల్లగొండ మున్సిపాల్టీలో 48 మంది కౌన్సిలర్లకుగాను 20 మంది కాంగ్రెస్‌ కౌన్సిలర్లు, 20 మంది బీఆరెస్‌ కౌన్సిలర్లు, ఆరుగురు బీజేపీ, ఒకరు ఎంఐఎం, ఒకరు స్వతంత్ర కౌన్సిలర్‌ గెలుపొందారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల వేళ అప్పటి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డికి వ్యతిరేకంగా 12మంది బీఆరెస్‌ కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరారు. ఒక కౌన్సిలర్‌ను అంతకుముందే పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. అవిశ్వాసం నోటీస్‌కు 20మంది కాంగ్రెస్‌ కౌన్సిలర్లు, 12మంది బీఆరెస్‌ కౌన్సిలర్లు, ఒక స్వతంత్ర కౌన్సిలర్‌, సస్పెండ్‌ కాబడిన కౌన్సిలర్‌ మద్దతు లభించనుంది.


అయితే మాజీ ఎమ్మెల్యే కంచర్ల తమ పార్టీ కౌన్సిలర్లకు విప్‌ జారీ చేసి విధిగా తమ చైర్మన్‌కే ఓటు వేయాలని పార్టీ మారిన బీఆరెస్‌ కౌన్సిలర్లను గందరగోళంలో నెట్టారు. విప్‌ ధిక్కరిస్తే కౌన్సిలర్లుగా అనర్హులవుతారంటూ కంచర్ల చెబుతున్నారు. ఫిరాయింపు చట్టంలో మూడింట రెండొంతుల సభ్యులు పార్టీ మారితే ఆ విప్‌ వర్తించనప్పటికీ, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు అలాంటి నిబంధన వర్తిస్తుందో లేదోనన్న సందిగ్ధం నెలకొంది. దీంతో ఈ నెల 8న జరిగే ఓటింగ్‌పై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతున్నది. ఇప్పటికే కొంతమంది చైర్మన్లు హైకోర్టు స్టేలతో అవిశ్వాస గండాలను తాత్కాలికంగా అధిగమించిన నేపథ్యంలో మిగతావారు కూడా స్టేల కోసం కోర్టులకు పరుగులెత్తడం కొసమెరుపు.