Opposition meet | దేశ రక్షణకే మా భేటీ

Opposition meet ప్రజాస్వామ్యంతో మోదీ సర్కార్‌ ఆటలు రాజ్యాంగాన్నే బీజేపీ చెరిపివేస్తున్నది భారతదేశానికి భిన్నత్వమే గొప్ప బలం మీడియాతో ప్రతిపక్ష నాయకులు వ్యాఖ్యలు బెంగళూరు: తమ సమావేశం దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసమేనని పలువురు ప్రతిపక్ష పార్టీల నాయకులు చెప్పారు. బెంగళూరులో ప్రతిపక్షాల భేటీ రెండో రోజైన మంగళవారం సమావేశానికి ముందు మీడియాతో మాట్లాడిన నేతలు.. దేశ ప్రజాస్వామ్యంతో బీజేపీ ఆటలాడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశం అనే భావనను రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. […]

  • By: Somu    latest    Jul 18, 2023 12:28 PM IST
Opposition meet | దేశ రక్షణకే మా భేటీ

Opposition meet

  • ప్రజాస్వామ్యంతో మోదీ సర్కార్‌ ఆటలు
  • రాజ్యాంగాన్నే బీజేపీ చెరిపివేస్తున్నది
  • భారతదేశానికి భిన్నత్వమే గొప్ప బలం
  • మీడియాతో ప్రతిపక్ష నాయకులు వ్యాఖ్యలు

బెంగళూరు: తమ సమావేశం దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసమేనని పలువురు ప్రతిపక్ష పార్టీల నాయకులు చెప్పారు. బెంగళూరులో ప్రతిపక్షాల భేటీ రెండో రోజైన మంగళవారం సమావేశానికి ముందు మీడియాతో మాట్లాడిన నేతలు.. దేశ ప్రజాస్వామ్యంతో బీజేపీ ఆటలాడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశం అనే భావనను రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. ఇది నిర్మాణాత్మక సమావేశమన్న పశ్చిమబెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ.. దీని ఫలితం కూడా దేశానికి మంచి చేస్తుందని చెప్పారు.

పదేళ్లు భారతదేశాన్ని పాలించే అవకాశం వచ్చిన మోదీ.. దేశంలోని అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసి పెట్టారని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మండిపడ్డారు. పైగా దేశ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థ అతాలకుతలమైందని, ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయికి చేరుకున్నదన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి రంగంలోనూ నిరుద్యోగిత పెరిగిపోయిందని చెప్పారు. మోదీని వదిలించుకోవాల్సిన సమయం దేశ ప్రజలకు ఆసన్నమైందని అన్నారు.

అందుకే భావసారూప్యత కలిగిన అన్ని ప్రతిపక్ష పార్టీలు ఒక్క తాటిపైకి వచ్చాయని చెప్పారు. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సి ఉన్నదని, పేదలు, యువత, రైతులు, మైనార్టీలను రక్షించుకోవాల్సి ఉన్నదని ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్‌ యాదవ్‌ అన్నారు. మోదీ పాలనలో అన్ని రంగాలు నలిగిపోయాయని విమర్శించారు. ‘భారతదేశం అంటే ఏమిటో మాకు తెలుసు. అందుకే ఈ దేశాన్ని కాపాడుకోవాలి. ఇదే ఈ సమావేశం ప్రాముఖ్యత’ అని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చెప్పారు.

దేశం బహుముఖంగా తీవ్రమైన దాడికి గురవుతున్నదని అన్నారు. మెరుగైన మార్పులు తీసుకురావడం ద్వారా దేశాన్ని కాపాడుకోవాలని చెప్పారు. రాజ్యాంగాన్ని చెరిపివేస్తున్నారని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లా విమర్శించారు. మోదీ పాలనలో దేశ లౌకిక స్వభావం విస్మరణకు గురవుతున్నదని చెప్పారు. దేశ రాజ్యాంగం, ప్రజాస్వామ్యంతో మోదీ ప్రభుత్వం ఆటలాడుతున్నదని పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ ఆరోపించారు.

ఈ దేశానికి భిన్నత్వమే బలమన్న ముఫ్తీ.. దానిని నాశనం చేస్తున్నారని మోదీ సర్కారుపై మండిపడ్డారు. ఈ సమావేశం ద్వారా భారతదేశ రక్షణకు 2024 ఎన్నికల్లో మహోద్యమం రానున్నదనే బలమైన సందేశాన్ని బెంగళూరు ప్రతిపక్షాల భేటీ ఇచ్చిందని సీపీఐ ఎంఎల్‌ ప్రధాన కార్యదర్శి దీపాంకర్‌ భట్టాచార్య చెప్పారు.