CM Revanth Reddy: మా ప్రభుత్వం చేసిన నికర అప్పు రూ.4,682 కోట్లు : సీఎం రేవంత్ రెడ్డి
పదేళ్లలో బీఆర్ఎస్ పాలకులు చేసిన అప్పులకు చెల్లించినవి పోగా 15 నెలల్లో మా ప్రభుత్వం చేసిన నికర అప్పు రూ.4,682 కోట్లు మాత్రమేనని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పష్టం చేశారు. పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన మొత్తం అప్పు రూ. 8,19,151 కోట్లు అని రేవంత్ రెడ్డి వివరించారు.

CM Revanth Reddy: పదేళ్లలో బీఆర్ఎస్ పాలకులు చేసిన అప్పులకు చెల్లించినవి పోగా 15 నెలల్లో మా ప్రభుత్వం చేసిన నికర అప్పు రూ.4,682 కోట్లు మాత్రమేనని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పష్టం చేశారు. బడ్జెట్ చర్చలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతూ అప్పులపై తప్పుడు లెక్కలు చెబుతూ హామీలను అమలు చేయలేక గత ప్రభుత్వంపై నిందలు మోపి తప్పించుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని ఆరోపించారు. కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 16 మంది ముఖ్యమంత్రులు చేసిన అప్పు 2014 నాటికి మొత్తం అప్పు రూ.90,160 కోట్లుగా ఉందన్నారు. పదేళ్లలో వాళ్లు చేసిన అప్పు రూ.1,12,2023 నాటికి రూ. 6,69,257 కోట్లు అని తెలిపారు. ఇది కాకుండా 40 వేల 154 కోట్లు పేమెంట్స్ పెండింగ్ లో పెట్టారని, ఇవి కలిపితే వాళ్లు పదేళ్లలో చేసిన మొత్తం అప్పు రూ. 8,19,151 కోట్లు అని రేవంత్ రెడ్డి వివరించారు. ఇక వాళ్లు సాధించిన ఘనత ఏమిటో వాళ్లే చెప్పాలని ఎద్దేవా చేశారు. పదేళ్లలో ఒక పార్టీ, ఒక కుటుంబం చేసిన అప్పు ఏడున్నర లక్షల కోట్లు అయితే..మేం వచ్చిన పదిహేను నెలల్లో చేసిన రూ.1,58,041 కోట్లు అని వెల్లడించారు. ఇందులో డిసెంబర్ 2023 నుంచి 28 ఫిబ్రవరి 2025 వరకు చెల్లించిన అసలు మొత్తం రూ. 88,591 కోట్లు అని, డిసెంబర్ 2023 నుంచి 28 ఫిబ్రవరి 2025 వరకు చెల్లించిన వడ్డీ మొత్తం రూ. 64,768 కోట్లు అని తెలిపారు. పదేళ్లలో వాళ్లు చేసిన అప్పులకు అసలు, వడ్డీ కలిపి మేం తిరిగి చెల్లించిన మొత్తం రూ. 1,53,359 కోట్లు అని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
రుణమాఫీ హామీ పూర్తి చేశాం
లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పిన కేసీఆర్.. నాలుగేళ్లల్లో చేసిన మాఫీ రూ.16,143 కోట్లు అని, వడ్డీ పోగా వీళ్లు మొదటి ఐదేళ్లల్లో చేసిన రుణమాఫీ 13,514 కోట్లు మాత్రమేనని రేవంత్ రెడ్డి వెల్లడించారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక నాలుగేళ్లు రైతుల రుణమాఫీకి రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. చివరి ఏడాదిలో 21,35,557 మంది రైతులకు రూ.11,909 కోట్లు మాత్రమే మాఫీ చేశారన్నారు. పదేళ్లలో బీఆర్ఎస్ చేసిన రుణమాఫీ రూ.16,908 కోట్లు మాత్రమేనని తెలిపారు. వీళ్లు మమ్మల్ని రుణమాఫీ చేయలేదని మాట్లాడుతున్నారని, పది నెలల్లో మేం 25,35,964 మంది రైతులకు రూ. 20,616,89 కోట్లు మాఫీ చేశామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పదేళ్లలో మీరు చేసింది ఎంత? పది నెలల్లో మేం చేసింది ఎంత? చూడండని చురకలేశారు. ప్రజలు ఉరి తీసినా మీ ఆలోచనా విధానంలో మార్పు రాలేదని, వాళ్లు ఎగ్గొట్టిన రైతు బందు రూ.7,625 కోట్లు నేను చెల్లించానని, రూ.4666.59 కోట్లు రెండో విడత రైతు భరోసా అందించామని తెలిపారు. రైతు భరోసాను రూ. 10 వేల నుంచి రూ. 12 వేలకు పెంచామన్నారు. వరి వేస్తే ఉరి అని చెప్పిన వాళ్లు ఫామ్ హౌస్ లో పండిన వడ్లను క్వింటాల్ రూ.4500 చొప్పున కావేరి సీడ్స్ కు అమ్ముకున్నారని, కానీ మేం రూ.11 వేల 61 కోట్లు సన్న వడ్లకు బోనస్ ఇచ్చామని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
ప్రాజెక్టులు కట్టిందే మీరు ఫామ్ హౌస్ లు కట్టుకోవడానికి..
ఉచిత కరెంట్ కాంగ్రెస్ పేటెంట్ అని స్పష్టం చేశారు. 29,14,692 మంది రైతులకు ఉచిత విద్యుత్తుకు రూ.15,332 కోట్లు వెచ్చించామని తెలిపారు. రైతు బీమాను కొనసాగించామని చెప్పారు. మీరు పదేళ్లు చేయలేనివి మేం పదినెలల్లో చేస్తే అభినందించాల్సింది పోయి కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారన్నారు. నన్ను అభినందించకపోయినా ఫరవాలేదు… ప్రభుత్వాన్ని అభినందించవచ్చు కదా అని హితవు పలికారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల డిజైన్లు మార్చి అంచనాలు పెంచి కమిషన్లు దండుకుని ప్రాజెక్టులను కూలిపోయేలా కట్టారన్నారు. ప్రాజెక్టులు కట్టిందే మీరు ఫామ్ హౌస్ లు కట్టుకోవడానికని.. దీనిపై నిజనిర్ధారణకు సిద్ధమా అని సవాల్ చేశారు. కాళేశ్వరం లేకపోయినా గోదావరికి నీళ్లు ఇవ్వవచ్చని స్పష్టం చేశారు. కాళేశ్వరంతో నీళ్లు వస్తున్నాయని బీఆర్ఎస్ చెప్పడం అబద్దమన్నారు. కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులతోనే ఇవ్వాళ 1కోటి 50లక్షల ఎకరాలకు సాగునీరందుతుందన్నారు. లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరంతో కొత్తగా లక్ష ఎకరాలకు కూడా నీరివ్వలేదన్నారు. భూసేకరణలో భూములు కోల్పోయిన వారికి అన్ని విధాలుగా న్యాయం చేస్తామని వివరించారు. ఈ ఐదేళ్లే కాదు..వచ్చే ఐదేళ్లు కూడా మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తదని ధీమా వ్యక్తం చేశారు.