బీడు భూముల్లో వందల కొద్దీ వృత్తాకార గోతులు.. ఇప్పటికీ ఓ పెద్ద మిస్టరీ

విధాత: ఈ భూమిపై మానవుడికి అంతుచిక్కని వింతలు, విశేషాలు చాలానే ఉన్నాయి. వాటిలో ఒకటి ఫెయిరీ టేల్స్ (జానపద వృత్తాలు) ఎడారి ప్రాంతాల్లో కనిపించే ఈ వింత వృత్తాలు దశాబ్దకాలంగా శాస్త్రవేత్తలకు అంతుపట్టకుండా ఉన్నాయి. గుండ్రంగా రింగ్ ఆకారంలో ఉన్న ఈ డిజైన్ల (Fairy Circles) ను అంతరిక్షం నుంచి దశాబ్ద కాలం కిందటే గమనించారు. అయితే వీటిని ఎవరు, ఎందుకు ఏర్పాటు చేశారన్నది మాత్రం ఇప్పటికీ అంతుచిక్కలేదు. అయితే వీటిపై తాజాగా జరిగిన ఓ పరిశోధన ఈ గుండ్రటి ఆకారాలపై కొన్ని కొత్తవిషయాలను బయట పెట్టింది.
ఎక్కడ ఉన్నాయి?
శాటిలైట్ల నుంచి పరిశీలించగా నమీబియా, ఆస్ట్రేలియాల్లోని వ్యవసాయానికి పనికిరాని బీడు భూముల్లో ఈ వృత్తాలు ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. వీటి సంఖ్య సుమారు 263 వరకు ఉండొచ్చని అంచనా. మొత్తం మీద చూసుకుంటే 3 ఖండాలు, సాహెల్, మడగాస్కర్ సహా 15 దేశాల్లో వీటి ఉనికి ఉంది. వీటన్నింటినీ గుదిగుచ్చి ఈ కొత్త అధ్యయనంలో ఒక మ్యాప్‌ను రూపొందించారు.

వీటి చుట్టూ ఉండే వాతావరణం, మొక్కలు మొదలైన వాటి వివరాలను, పొందుపరిచారు. అలా మొత్తం శాటిలైట్ చిత్రాల సాయంతో 5,74,799 హెక్టార్ల ల్యాండ్‌ను వీరు పరిశోధించారు. వీటన్నింటిలో ఉమ్మడిగా ఉన్న అంశాలను పరిశీలించగా.. ఈ వృత్తాలన్నీ తడారిపోయిన, నీటి జాడలేని, తేమ ఎక్కువగా ఉన్న, బీడు భూముల్లో ఉన్నట్లు కనుగొన్నారు.
ఇదే రకమైన వాతావరణంలో ఈ వృత్తాలు లేని చోట్లతో పోలిస్తే వృత్తాల చుట్టుపక్కల పచ్చదనం కాస్త ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. అంటే మన పూర్వీకుల్లో తెలివైన జాతి ఏదైనా వాన నీటిని నిల్వ చేసేందుకు, భూమిలోకి ఇంకించేందుకు ఈ వృత్తాకార గోతులను తవ్విందా అని పరిశోధనకు నేతృత్వం వహించిన అలికాంటే విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త ఎమిలో గియార్డో ఊహిస్తున్నారు.
ఒక వేళ అలా అనుకున్నా ఇన్ని వందల వృత్తాలను పక్కా రేఖాగణితాన్ని అనుసరిస్తూ ఎలా తవ్వారనేది ఒక మిస్టరీయేనని పేర్కొన్నారు. ప్రస్తుతం తాము రూపొందించిన ఫెయిరీ రింగ్స్ మ్యాప్ భవిష్యత్ పరిశోధనలకు ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ వృత్తాల దగ్గర ఉన్న వాతావరణానికి, మిగిలిన చోట్ల ఉన్న వాతావరణానికి దీర్ఘకాలంలో ఏమైనా తేడా కనిపిస్తే.. ఈ వృత్తాల ఉద్దేశం అర్థమయ్యే అవకాశముందని పేర్కొన్నారు.