హరిద్వార్ కోర్టుకు అడవి ఏనుగు!
ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్‌లోని కోర్టు ప్రాంగణంలోకి చొరబడిన అడవి ఏనుగు బీభత్సం సృష్టించింది

- గేటును తోసుకొని ప్రాంగణంలోకి చొరబడిన గజం
- భయాందోళనలకు గురైన లాయర్లు, కక్షిదారులు
- సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన దృశ్యాలు
విధాత: ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్‌లోని కోర్టు ప్రాంగణంలోకి చొరబడిన అడవి ఏనుగు బీభత్సం సృష్టించింది. ఈ హఠత్పారిణామానికి లాయర్లు, కక్షిదారులు బెంబేలెత్తిపోయారు. కోర్టు ప్రాంగణంలో అటుఇటూ పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
హరిద్వార్ రోషనాబాద్‌లోని జిల్లా సెషన్స్ కోర్టు ప్రాంగణంలోకి బుధవారం అడవి ఏనుగు చొరబడింది. ప్రధాన గేటును తోసుకొని లోపలికి వచ్చిన గజం.. కోర్టు ఆవరణలో తిరుగుతూ గందరగోళం సృష్టించింది. సమీపంలోని రాజాజీ టైగర్ రిజర్వ్ నుంచి బయటికి వచ్చినట్టు భావిస్తున్న ఆ ఏనుగు.. జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయం, కోర్టు ఆవరణలో ఇష్టమొచ్చినట్టు తిరిగిది. గోడను, కొన్ని వస్తువులను కూడా ఏనుగు ధ్వంసం చేసిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏనుగు ప్రాంగణంలోకి ప్రవేశించే ముందు కోర్టు ప్రధాన గేటును ఢీకొట్టినట్టు వీడియో కనిపిస్తున్నది. ఏనుగు రావడంతో వెంటనే అప్రమత్తమైన కోర్టు అధికారులు అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఏనుగు ఉన్నట్లు సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. అధికారులు ఏనుగును భయపెట్టేందుకు గాల్లోకి కాల్పులు జరిపారు. రాజాజీ టైగర్ రిజర్వ్ వైపు మళ్లించి అటవీలోకి తరలించారు. దాంతో స్థానిక ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.