Wild Elephants | తమిళనాడులో దారుణం : కాపలా ఉన్న రైతులను చంపిన అడవి ఏనుగులు

తమిళనాడులోని ఎరోడ్ జిల్లా సత్యమంగళం–కడంబూరు అటవీ ప్రాంతంలో రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు రైతులు అడవి ఏనుగుల దాడిలో దారుణంగా మృతి చెందారు. పంటలకు రాత్రిపూట కాపలా కాస్తున్న ప్రభు (38), సిద్ధురాజ్ (35)లను ఏనుగులు తొక్కి చంపాయి.

Wild Elephants | తమిళనాడులో దారుణం : కాపలా ఉన్న రైతులను చంపిన అడవి ఏనుగులు

Two Farmers Trampled to Death by Wild Elephants in Tamil Nadu’s Sathyamangalam Forest Area

విధాత భారత్​ డెస్క్​ | హైదరాబాద్​:

Wild Elephants |తమిళనాడు ఎరోడ్ జిల్లా సత్యమంగళం తాలూకా కడంబూరు కొండల్లో మళ్లీ అడవి ఏనుగు దాడి దారుణంగా దాడి చేసింది. రాత్రిపూట పంటలకు కాపలా ఉన్న రైతును అడవి ఏనుగు తొక్కి చంపిన ఘటన స్థానికుల్లో తీవ్ర భయాందోళనకు గురిచేసింది. రెండు రోజుల వ్యవధిలో ఇది రెండో ఘటన కావడంతో స్థానిక గ్రామస్తులు భయభ్రాంతులకు గురౌతున్నారు.

దాడి చేసిన ఏనుగు – తప్పించుకునే ప్రయత్నంలో మరణం

ఎలాంచి గ్రామానికి చెందిన ప్రభు (38) గత సంవత్సరం నుండి ప్రకాశ్​ అనే రైతు పొలంలో పనిచేస్తున్నాడు. ఎనిమిది ఎకరాల అరటి–కొబ్బరి తోటలో తరచూ ఏనుగులు ప్రవేశిస్తుండంతో రాత్రిపూట రైతులు వంతులవారీగా కాపలా  కాయడం అలవాటయ్యింది.

సెప్టెంబర్ 15 రాత్రి కూడా ప్రభు తోటలో కావలిపనిలో ఉన్నాడు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఒంటరిగా వచ్చిన ఒక అడవి ఏనుగు అరటి తోటలోకి ప్రవేశించింది. శబ్దం విన్న ప్రభు, గ్రామంలోని మరో ఇద్దరు రైతులు షణ్ముగం, చిన్నబాబులకు ఫోన్ చేసాడు. ఇంతలో ప్రభుపైకి దూసుకొచ్చిన ఏనుగు నుంచి తప్పించుకునే క్రమంలో అతడు జారిపడటంతో తొక్కిచంపేసింది. వాళ్లు అక్కడికి చేరుకునేలోపే ఏనుగు ఆగ్రహానికి గురైన ప్రభు దుర్మరణం పాలయ్యాడు. ఏనుగు అటవీ ప్రాంతం లోపలికి వెళ్లిపోయింది. అక్కడికి చేరుకున్న షణ్ముగం, చిన్నబాబుల సమాచారం అందుకున్న కడంబూరు పోలీసులు, అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని సత్యమంగళం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరణించిన ప్రభుకు భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు.

ముందురోజు దగ్గర్లోనే ఓ దాడి –అప్పుడు హతమైంది సిద్ధురాజ్

ఈ ఘటనకు ముందురోజే సత్యమంగళం టైగర్ రిజర్వు (STR)లోని కడగనల్లి గ్రామంలో మరో రైతు ప్రాణం కోల్పోయాడు. సిద్ధురాజ్ (35) అనే రైతు తన రెండు ఎకరాల మక్కజొన్న పంటను రాత్రి వేళ జంతువుల నుంచి రక్షించేందుకు కాపలాగా ఉన్నాడు. అర్ధరాత్రి అటవీ ప్రాంతం నుంచి వచ్చిన అడవి ఏనుగు ఆగ్రహంతో అతనిపై దాడి చేసింది. విచ్చలవిడిగా తొక్కడంతో సిద్ధురాజ్ అక్కడికక్కడే మరణించాడు.

ఏనుగుల దాడులతో బితుకుబితుమంటున్న గ్రామస్థులు : పరిష్కారం కోసం ఎదురుచూపులు

సత్యమంగళం టైగర్ రిజర్వు పరిధిలో అడవి ఏనుగుల సంచారం రోజురోజుకు పెరుగుతుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంటలను విచ్చలవిడిగా నాశనం చేయడం, రాత్రిపూట దాడులు చేయడం, గ్రామాల్లోకి చొరబడటం తరచూ జరుగుతున్నాయి. ముఖ్యంగా కడంబూరు, కడగనల్లి, ఎలాంచి ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో రైతులు పంటల వద్ద కాపలా ఉండడం ప్రమాదకరంగా మారింది.

ఈ తరహా ఘటనలు వరుసగా జరుగుతుండటంతో అటవీ శాఖ వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవాలని, రాత్రిపూట పటిష్టమైన పహారా ఏర్పాటు చేయాలని, ఏనుగుల కదలికలపై ముందస్తు హెచ్చరిక వ్యవస్థ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.