విధాత : సీఎం రేవంత్‌రెడ్డిని పట్టుకుని చడ్డీగ్యాంగ్ సభ్యుడివా అంటూ బీఆరెస్ మాజీ మంత్రి టి.హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకంగా, ముఖ్యమంత్రి పదవిని అవమానించేలా ఉన్నాయని పరిగి కాంగ్రెస్ ఎమ్మెల్యే టి. రాంమోహన్ రెడ్డి (Ram Mohan Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ గతంలో అధికారంలో ఉన్నపుడు నాలుగు నెలల పాటు ఎలాంటి కార్యక్రమాలు బీఆరెస్ చేపట్టలేదన్న సంగతి మరువరాదన్నారు. కనీసం అప్పుడు క్యాబినెట్ కూడా ఏర్పాటు చేయలేదన్నారు.
అధికారంలోకి కోల్పోయిన అసహనంతో హరీష్ రావు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని, కమిషన్లు తీసుకని ఫామౌస్ లు కట్టుకున్న నువ్వు మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతావా అని, నీ అవినీతి మొత్తం బయటకి తీస్తామని హెచ్చరించారు. సీఎంపై అభ్యంతరకరంగా ఎక్కువ మాట్లాడితే తాటా తీస్తామని హెచ్చరించారు. పదేళ్లు మీ కుటుంబమే తెలంగాణ రాష్ట్రాన్ని చడ్డీగ్యాంగ్ లాగా దోచుకున్నారని రాంమోహన్‌రెడ్డి విమర్శించారు. రైతులను వేధించి భయపెట్టి అక్రమంగా భూములు కొని ఫామ్ హౌజ్ లు కట్టుకున్న హరీశ్‌రావు చరిత్ర గురివింద గింజ సామేతలా ఉందన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి పైన అడ్డగోలుగా మాట్లాడితే రాష్ట్రంలో తిరగనియ్యమని, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు తలచుకుంటే మీరు బయటకు రాలేరని హెచ్చరించారు. బీజేపీతో లోపాయికారి ఒప్పందంతో బీఆరెస్ సాగుతుందని, బీఆరెస్‌కు హరీష్ రావు వెన్నుపోటు పొడుస్తారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో అద్భుతమైన పాలన చేస్తుందన్నారు. పథకాలు, హామీల అమలులో ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని, పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ 14సీట్లు గెలుస్తుందని, బీఆరెస్ ఈ ఎన్నికలతో కనుమరుగవుతుందని చెప్పారు.