Telangana | పార్టీల బీసీల జపం

Telangana బీఆరెస్ లక్ష సాయం.. కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్‌ అదను చూసి ఒత్తిడి పెడుతున్న బీసీ సంఘాలు విధాత: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో జనాభాలో మెజార్టీగా ఉండే బీసీల ఓట్ల కోసం అన్ని పార్టీలు తమ ప్రయత్నాలకు ..వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అధికార బీఆరెస్ పార్టీ బీసీలను ఆకట్టుకునేందుకు లక్ష ఆర్ధిక సాయం ప్రకటనతో బీసీ ఓట్లకు గాలం విసరగా, కాంగ్రెస్ పార్టీ త్వరలోనే బీసీ డిక్లరేషన్‌తో బీసీ వర్గాలను ఆకర్షించేందుకు కసరత్తు చేస్తుంది. […]

Telangana | పార్టీల బీసీల జపం

Telangana

  • బీఆరెస్ లక్ష సాయం.. కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్‌
  • అదను చూసి ఒత్తిడి పెడుతున్న బీసీ సంఘాలు

విధాత: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో జనాభాలో మెజార్టీగా ఉండే బీసీల ఓట్ల కోసం అన్ని పార్టీలు తమ ప్రయత్నాలకు ..వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అధికార బీఆరెస్ పార్టీ బీసీలను ఆకట్టుకునేందుకు లక్ష ఆర్ధిక సాయం ప్రకటనతో బీసీ ఓట్లకు గాలం విసరగా, కాంగ్రెస్ పార్టీ త్వరలోనే బీసీ డిక్లరేషన్‌తో బీసీ వర్గాలను ఆకర్షించేందుకు కసరత్తు చేస్తుంది.

బీజేపీ నుండి తమ ప్రధాని నరేంద్రమోడీనే బీసీ నేతగా ఉన్నారని, బీసీయైన ఈటెల రాజేందర్‌కు ఎన్నికల నిర్వాహణ కమిటీ చైర్మన్ చేశామని, బీజేపీ ఎన్నికల ప్రణాళికలో బీసీ సంక్షేమ విధానాలను వెల్లడిస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయమే తమ డిమాండ్లకు అనువైందన్న ఆలోఛనతో ఉన్న బీసీ సంఘాలు సైతం తమకు జనాభా థామాషా మేరకు సంక్షేమ పథకాలు, చట్టసభలలో అవకాశాలు కల్పించాలంటు గళమెత్తుతున్నాయి. వరుసగా తమ సామాజిక వర్గాల సమావేశాలు నిర్వహిస్తు బీసీ నేతలు టికెట్ల కోసం తమ పార్టీల నాయకత్వాలపై ఒత్తిడి పెంచుతున్నారు.

అధికార బీఆరెఎస్ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పోటీగా గణనీయ సంఖ్యలో అన్ రిజర్వ్‌డ్ నియోజకవర్గాల్లో బీసీలు టికెట్లను ఆశిస్తున్న తీరు ఆ పార్టీ అధినాయకత్వంపై పెరుగుతున్న బీసీల ఒత్తిడికి నిదర్శనంగా కనిపిస్తుంది. ఒక్క ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోనే మొత్తం 12అసెంబ్లీ నియోజకవర్గాల్లో అన్‌రిజర్వ్‌డ్ తొమ్మిది స్థానాల్లో ఏకంగా ఐదు స్థానాల్లో బీసీ నేతలు టికెట్ల కోసం పోటీ పడుతున్న తీరు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీలో బీసీల టికెట్ల పోరు ఏ స్థాయిలో ఉందో అవగతమవుతుంది.

అటు కాంగ్రెస్‌లో మాజీ ఎంపీ వి.హనుమంతరావు వంటి వారు పార్టీ వేదికల్లో, బహిరంగ సభల్లో తన బీసీ గళాన్ని గట్టిగానే వినిపిస్తున్నారు. ప్రతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో మూడు సీట్లు బీసీలకు కేటాయించాలంటు ఏకంగా ప్రతి జిల్లాల వారిగా కాంగ్రెస్‌లో బీసీ సదస్సులు నిర్వహిస్తు ఆ పార్టీ అధిష్టానానికి బీసీ టికెట్ల డిమాండ్‌ను తీసుకెళ్లే ప్రయత్నం జోరుగా చేస్తుండగా, విహెచ్ సదస్సులకు జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకత్వం, కేడర్ పెద్ద సంఖ్యలో హాజరవుతుండటం ఆసక్తికరం. విహెచ్ స్ఫూర్తితో మునుగోడు, భువనగిరి వంటి నియోజవర్గాల్లో ఇప్పటికే బీసీ నేతలు టికెట్ల కోసం బాహటంగానే కాంగ్రెస్ నాయకత్వానికి తమ డిమాండ్లు వినిపిస్తున్నారు.

బీసీ వ్యూహాల్లో బీఆరెస్ దూకుడు

బీఆరెస్ ప్రకటించిన లక్ష సాయం పథకంకు దరఖాస్తులను స్వీకరించగా పెద్ద సంఖ్యలో వచ్చిన దరఖాస్తులు ఒకవైపు, బడ్జెట్ పరిమితులు మరోవైపు సంకటంగా మారడంతో ఈ పథకం ఎలా అమలు చేయాలన్నదానిపై తంటాలు పడుతుంది. రాష్ట్రంలో ప్రతి నెల 15 వ తే్దిన ప్రతి నియోజకవర్గంలో 300మంది లబ్ధిదారులకు యూనిట్ల మంజూరు చేపట్టాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధికార యంత్రాంగానికి నిర్ధేశించారు.

లక్ష ఆర్ధిక సాయం కోసం ఏకంగా5.28లక్షల దరఖాస్తులు అందడంతో అంతమందికి లక్ష సాయం ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. దరఖాస్తుల వడపోత సాగించి ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో పరిమితంగా పథకం యూనిట్లు మంజూరు చేస్తే అప్పటికి ఎన్నికల ప్రకటనతో కోడ్ కారణంగా బీసీ లక్ష సాయం వాయిదా పడితే పథకం అమలు భారం నుండి ప్రభుత్వం బయటపడవచ్చు.

ఇప్పటికే గృహలక్ష్మీ పథకాన్ని సైతం ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ప్రతి నియోజకవర్గంలో 3వేల మందికి పరిమితం చేయాలని, లబ్ధిదారులకు మూడు దశల్లో మూడు లక్షల సాయం అందించాలని ప్రభుత్వం భావిస్తుండగా ఈ పథకాన్ని కూడా బడ్జెట్ పరిమితుల నేపధ్యంలో ఎన్నికల వరకు నామమాత్రంగా నడిపించి ఎన్నికలో్ల లబ్ధి పొందాలని బీఆరెఎస్ ఆలోచనగా కనిపిస్తుంది. గృహలక్ష్మీ పథకంలో కూడా బీసీ, మైనార్టీలకు 50 శాతం ఇవ్వాలని, ఎస్సీలకు 20, ఎస్టీలకు 10, ఆర్ధికంగా వెనుకబడిన వారికి మిగిలిన 20శాతం ఇవ్వాలని నిర్ణయించారు